ఒక్క మనిషే ఉన్నాడు!

పొలాలు, ఇళ్ల కాగితాలు, వస్తువులు తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బు అప్పిస్తాడు సోములు. అంతా ఆయన్ను చక్రవడ్డీ సోములు అంటారు. ఆరోజు సోములు పుట్టినరోజు. పొద్దున్నే దుకాణం తెరిచాడు. పుట్టిన రోజు కాబట్టి గుడికి వెళ్లాలి అనుకున్నాడు. ఆ ఊళ్లో గుడి.. కొండ మీద ఉంది. ‘వీలైనంత త్వరగా గుడికి వెళ్లి తిరిగి రావాలి. లేకపోతే వ్యాపారం దెబ్బతింటుంది’ అనుకున్నాడు.

Updated : 06 Apr 2022 04:39 IST

పొలాలు, ఇళ్ల కాగితాలు, వస్తువులు తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బు అప్పిస్తాడు సోములు. అంతా ఆయన్ను చక్రవడ్డీ సోములు అంటారు. ఆరోజు సోములు పుట్టినరోజు. పొద్దున్నే దుకాణం తెరిచాడు. పుట్టిన రోజు కాబట్టి గుడికి వెళ్లాలి అనుకున్నాడు. ఆ ఊళ్లో గుడి.. కొండ మీద ఉంది. ‘వీలైనంత త్వరగా గుడికి వెళ్లి తిరిగి రావాలి. లేకపోతే వ్యాపారం దెబ్బతింటుంది’ అనుకున్నాడు.

అప్పుడే కొండమీది గుడి నుంచి కిందకు దిగి వచ్చి, తన దుకాణం ముందు నుంచి వెళ్తున్న ఒక ముసలి సాధువును చూశాడు సోములు. ఆయన్ను ఆపి ‘కొండ మీది గుడిలో మనుషులు ఉన్నారా?’ అని అడిగాడు. ఒక నవ్వు నవ్వి... ‘ఒక మనిషి ఉన్నాడు’ అని చెప్పాడు సాధువు. అయితే ఇదే సరైన సమయం అని గబగబా కొట్టు కట్టేసి గుడికి బయల్దేరాడు సోములు.

కొండెక్కి గుళ్లోకి వెళ్లాడు. జనం వరుస కట్టి ఉన్నారు. తను కూడా సాధువును తిట్టుకుంటూ వరుసలో నిలబడ్డాడు సోములు..! దైవదర్శనం చేసుకుని బయట పడేసరికి రెండుగంటలకు పైగానే సమయం పట్టింది.

కొండ దిగి తన కొట్టు దగ్గరకు వచ్చాడు సోములు. ఆ ముసలి సాధువు కోసం చూశాడు. పక్కనే ఉన్న మర్రిచెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు ఆ సాధువు. సోములు కోపంగా వెళ్లి సాధువు జోలెను దూరంగా విసిరేశాడు. బొచ్చెను నేలకేసి కొట్టాడు. ‘నీ వల్ల ఇవాళ నా వ్యాపారం దెబ్బతింది. కొండ మీద గుడిలో మనుషులు ఉన్నారా? అని అడిగితే ఒక మనిషి ఉన్నాడని, సాధువై ఉండి కూడా నువ్వు అబద్ధం చెబుతావా?’ అన్నాడు కోపంగా.

‘నేను అబద్ధం చెప్పలేదు. నిజమే చెప్పాను’ అన్నాడు సాధువు నవ్వుతూ. కోపంగా ఏదో అనబోయిన సోములు, ఆగమన్నట్టు సాధువు చేసిన సైగతో మౌనంగా ఉండిపోయాడు. ‘కొండ మీది గుడికి వెళ్లే దారిలో ఒక ముసలి బిచ్చగాడు తిండిలేక స్పృహతప్పి పడిపోయి ఉన్నాడు. ఎంతోమంది దేవుడికి ఎన్నో కానుకలు తీసుకుని ఆ దారిలో గుడికి వెళుతున్నారు. ఎవరూ ఆ బిచ్చగాడిని పట్టించుకోలేదు. ఒక మనిషి మాత్రం ఆ బిచ్చగాడిని చూసి ఆగాడు. దేవుడి కోసం తను తీసుకువెళుతున్న కొబ్బరికాయను పగలగొట్టి కొన్ని నీళ్లు బిచ్చగాడి ముఖం మీద చల్లాడు. మరికొన్ని నీళ్లు అతనితో తాగించాడు. దేవుడి కోసం తీసుకువెళ్తున్న అరటిపళ్లను అతనికి తినిపించాడు. అతని ప్రాణం కాపాడాడు. గుడికి వెళ్లే దారిలో ఒకచోట బాట మధ్యలో ఒక పిల్లి మృత కళేబరం పడి ఉంది. అది కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. అందరూ ముక్కుమూసుకుని పక్కకు తప్పుకొని వెళ్లిపోతున్నారు. ముసలి బిచ్చగాడి ప్రాణం కాపాడిన మనిషి అక్కడ ఆగాడు. ఆ పిల్లి మృత కళేబరాన్ని తీసి బాటను శుభ్రం చేశాడు. స్వార్థపరులు, ఇతరుల కష్టాలను పట్టించుకోని వారు మనుషులు అనిపించుకోరు. గుడిలోని అంత మంది జనంలో ముసలి బిచ్చగాడి ప్రాణం కాపాడి, బాటను శుభ్రం చేసిన ఆ వ్యక్తి ఒక్కడే నాకు మనిషిగా కనపడ్డాడు. అందుకే గుడిలో మనుషులు ఉన్నారా అన్న నీ ప్రశ్నకు, ఒక మనిషి ఉన్నాడని నేను సమాధానం చెప్పాను. తనకోసం తాను బతకటం ఏ జీవి అయినా చేసే పనే. ఇతరుల కోసం ఎంతో కొంత చేయటం అనేది మనిషి మాత్రమే చేసే పని’ అన్నాడు సాధువు నవ్వుతూ.

తను దూరంగా విసిరేసిన సాధువు జోలె, బొచ్చెను తీసుకు వచ్చి అతని పాదాల దగ్గర ఉంచాడు సోములు. సాధువుకు నమస్కారం చేసి అక్కడి నుంచి ఇవతలకు వచ్చాడు మౌనంగా. సాధువు మాటలు సోములుకు పదేపదే గుర్తుకు రాసాగాయి. కొన్ని రోజులకు వడ్డీ వ్యాపారం మానేశాడు. బియ్యం వ్యాపారం మొదలు పెట్టాడు. ధర్మబద్ధంగా వ్యాపారాన్ని కొనసాగించాడు. వడ్డీ వ్యాపారంలో తాను సంపాదించిన సొమ్ముతో కొండమీది గుడికి అనుబంధంగా ఉచిత అన్నదాన సత్రాన్ని కట్టించాడు. ఒక నిధిని ఏర్పాటు చేసి ప్రతి రోజు అన్నదానం జరగటానికి తగిన ఏర్పాట్లూ చేశాడు. కొంతకాలానికి సోములు చనిపోయాడు. కానీ ఇప్పటికీ అతను కట్టించిన అన్నదాన సత్రం అలాగే ఉంది. ప్రతి రోజు అనేక మంది అన్నార్తుల ఆకలి తీరుస్తోంది.

- కళ్లేపల్లి తిరుమలరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని