ఓహో.. అలాగా.. అయితే సరే!

కౌశాంబీ రాజ్యంలో కోతుల బెడద ఎక్కువైంది. ఆ దేశాన్ని ఏలే మహారాజు కీర్తివర్మ.. మూర్ఖుడు. ఓరోజు అతడు.. ఇద్దరు భటులను పిలిచి ఆ కోతులను అన్నింటినీ బంధించి అడవిలో వదిలిపెట్టి రమ్మన్నాడు. రాజుగారి ఆదేశంతో భటులు చాలా కష్టపడి

Updated : 07 Apr 2022 00:13 IST

కౌశాంబీ రాజ్యంలో కోతుల బెడద ఎక్కువైంది. ఆ దేశాన్ని ఏలే మహారాజు కీర్తివర్మ.. మూర్ఖుడు. ఓరోజు అతడు.. ఇద్దరు భటులను పిలిచి ఆ కోతులను అన్నింటినీ బంధించి అడవిలో వదిలిపెట్టి రమ్మన్నాడు. రాజుగారి ఆదేశంతో భటులు చాలా కష్టపడి ఆ కోతులను బంధించి అడవిలో దూరంగా వదిలి పెట్టి వచ్చారు. కొన్ని రోజుల వరకు ఏ సమస్యా లేదు. కానీ మహారాజు కీర్తివర్మకు, తోటలో విహారం చేసే సమయంలో ఒక కోతి కనిపించింది. మహారాజు ఆ ఇద్దరు భటులను పిలిచి ‘అన్ని కోతులను బంధించి అడవిలో వదిలిపెట్టి రమ్మన్నాను కదా! ఈ కోతి ఎక్కడి నుంచి వచ్చింది. దీన్ని ఎందుకు వదిలిపెట్టలేదు. మీకు కఠిన కారాగార విధిస్తున్నాను’ అన్నాడు. దానికి ఆ ఇద్దరు భటులు కంగారు పడ్డారు. అతికష్టం మీద మంత్రి దగ్గరకు వెళ్లి ఆయనకు ఈ విషయం చెప్పారు.

మంత్రి.. వారికి ముప్పు లేదని హామీ ఇచ్చి, రాజుగారి దగ్గరకు వెళ్లి.. ముందుగా భటుల మంచితనం గురించి చెప్పాడు. తర్వాత వారి శిక్ష విషయమై అడిగాడు. రాజు.. ‘తాను కోతులు అన్నింటిని వదిలిపెట్టి రమ్మంటే.. వారు అలాగే వదిలిపెట్టి వచ్చామని తనతో అబద్ధం చెప్పారు’ అని అన్నాడు. ఈరోజు తనకు తోటలో కోతి కనబడిందనీ మంత్రితో చెప్పాడు. ‘మహారాజా! వారు కోతులు అన్నింటిని అడవిలో వదిలి పెట్టిన మాట వాస్తవమే. అందుకు నేనే సాక్ష్యం. నేనూ కోతులన్నింటికీ రాజ్యానికి తిరిగి రావద్దని చెప్పాను. అయినా ఒక కోతి పారిపోయి వచ్చింది. నాకు నిన్ననే అది కనిపించింది. మళ్లీ రాజ్యంలోనికి ఎందుకు వచ్చావని దాన్ని అడిగాను. రాజు అంటే నాకు చాలా అభిమానం. ఆయన్ను చూడకుండా ఉండలేను. అందుకే ఆ అడవిలో ఉండలేక తిరిగి వచ్చానంది. అదే మీకు ఈరోజు కనిపించింది. అందువల్ల ఈ శిక్ష న్యాయం కాదు’ అని రాజుతో అన్నాడు మంత్రి.

రాజు కూడా ‘అవును మంత్రివర్యా! మీరు అన్నది నిజమే. ఇప్పుడే వారి శిక్షను రద్దు చేస్తున్నాను’ అని అన్నాడు. మరుసటి రోజు.. రాజుగారికి మరో రెండు, అంటే మొత్తం మూడు కోతులు కనిపించాయి. రాజు మంత్రిని పిలిచి ‘మీరు ఒక్క కోతి నా మీద అభిమానంతో తిరిగి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు నాకు మరో రెండు కోతులు కనిపించాయి. ఇప్పుడు కూడా ఆ భటుల తప్పు లేదంటారా’ అని ప్రశ్నించాడు. అప్పుడు మంత్రి ‘లేదు మహారాజా! మొదటి కోతి మీ పైన అభిమానంతో వచ్చింది. ఈ రెండు కోతులు దాని పిల్లలు. తల్లిని వదిలి ఉండలేక అవి కూడా వచ్చేశాయి’ అన్నాడు. ‘ఓహో.. అలాగా.. అయితే సరే’ అన్నాడు ఆ రాజు.

మరుసటిరోజు.. రాజుకు మరిన్ని కనిపించాయి. రాజు, మంత్రిని పిలిచి వాటిని చూపించాడు. మంత్రి ఏ మాత్రం తడబడకుండా  ‘అవును మహారాజా! ఆ కోతి కుటుంబం బంధువులు ఈ కోతులు. అందువల్ల అవి తమ తమ బంధువులను వదిలిపెట్టి ఎలా ఉంటాయి. అందుకే అవి కూడా రాజ్యంలోకి ప్రవేశించాయి’ అన్నాడు. ‘నువ్వు అన్నది నిజమే. బంధువులు వాటిని వెతుక్కుంటూ రావడం సహజమే’ అని అన్నాడు ఆ మూర్ఖుడైన రాజు. మంత్రి భటులను పిలిచి, మందలించి.. ఆ కోతులను బంధించి దూరంగా అడవిలో వదిలి పెట్టి రమ్మన్నాడు. వారు మంత్రి చెప్పినట్టు చేశారు. తమను శిక్ష నుంచి కాపాడిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

తర్వాత మంత్రి, రాజుతో ‘అడవిలోని కోతులకు పండ్లు దొరకడం లేదట. ఇక్కడికి వస్తామంటున్నాయి ప్రభూ!’ అని అన్నాడు. అప్పుడు రాజు ‘లేదు.. లేదు.. అవి అక్కడే ఉండాలి’ అని అన్నాడు. ‘అలాగైతే మహారాజా! మనమే కొన్ని పండ్ల విత్తనాలను అక్కడకు పంపి చల్లిద్దాం’ అని అన్నాడు. రాజు ఈ మాటలకు అంగీకరించాడు. మంత్రి మరునాడు ప్రజలు అందరూ అడవిలో పండ్ల విత్తనాలను, వానాకాలంలో విధిగా చల్లాలని చాటింపు వేయించాడు. ప్రజలు అలాగే చేశారు. కొంతకాలానికి అవి మొక్కలై, తర్వాత చెట్లుగా మారాయి. వాటికి కాయలు కాశాయి. కోతులు వాటిని తృప్తిగా తింటూ అక్కడే ఉండిపోయాయి. అవి రాజ్యం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. త్వరలోనే కౌశాంబీ రాజ్యం కోతులు లేని రాజ్యంగా మారిపోయింది.

- సంగనభట్ల చిన్నరామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని