వెన్న రుచి తెలిసింది!

మారుమూల పల్లె నుంచి వెన్న కుండల కావడి మోసుకుంటూ దగ్గరలో ఉన్న పట్నానికి వెళుతున్నాడు రామయ్య. అలా వెళ్లి..

Updated : 09 Apr 2022 02:52 IST


 

మారుమూల పల్లె నుంచి వెన్న కుండల కావడి మోసుకుంటూ దగ్గరలో ఉన్న పట్నానికి వెళుతున్నాడు రామయ్య. అలా వెళ్లి.. మంచి ధరకు అమ్మడం అతడికి అలవాటు. వ్యాపారం లాభసాటిగా ఉండటంతో పదిరోజులకోసారి పట్నానికి వెళ్లేవాడు. తాజా వెన్న కావాలని కొందరు పదే పదే కోరుతుండడంతో.. ప్రతిసారి ఒకటే కుండ తీసుకెళ్లే రామయ్య, ఈసారి కావిడితో బయలుదేరాడు.

పట్నం బాటలో నడుస్తూ నడుస్తూ.. ‘ఎవరైనా తోడు దొరికితే బాగుండు.. మాటల్లో పడితే కావడి బరువు తెలియదు. భుజాల నొప్పీ, అలసట ఉండదు’ అని మనసులో అనుకున్నాడు. ఆకాశం నుంచి దైవం తథాస్తు అన్నట్లు.. మరుక్షణమే డొంకదారిలోంచి నడుచుకుంటూ పట్నం వైపే వెళ్తున్న ఓ వ్యక్తి రామయ్యకు ఎదురుపడ్డాడు. ఎవరో, ఏంటో తెలియకపోయినా.. రామయ్యను చూడగానే స్నేహపూర్వకంగా నవ్వాడు ఆ వ్యక్తి. ఆ నవ్వులోని ఆత్మీయతకు రామయ్య కూడా సంతోషించాడు. ఇద్దరూ కొద్దిసేపటికే సరదా కబుర్లతో మంచి మిత్రులుగా మారిపోయారు.

అతడి చేతిలో సంచి చూసి ‘పట్నం ఎందుకు వెళ్తున్నావు?’ అని అడిగాడు రామయ్య. ‘నా పేరు రవిరాజు. నేనొక చిత్రకారుడిని. జమీందారు తన కొత్త ఇంట్లో అలంకరణ కోసం కొన్ని చిత్రాలు గీయమని కోరారు. నిన్న సాయంత్రమే ఆ పని పూర్తి అయింది. వాటిని సంచిలో వేసుకొని.. జమీందారుకు అప్పగించేందుకు ఉదయాన్నే బయలుదేరాను. బదులుగా ఆయన ఇచ్చే డబ్బుతో పట్నంలోనే కొంత సామగ్రి కొనుగోలు చేయాలి’ అని వివరించాడు.  

‘అవునవును. జమీందార్ల ఇళ్లకుండే దర్జానే వేరు’ అంటూ కళ్లెగరేశాడు రామయ్య. సూర్యుడు సరిగ్గా నడినెత్తి మీదకు రావడంతో.. తమతోపాటు తెచ్చుకున్న అన్నం తిందామని ఒక చెరువు గట్టునున్న చెట్టు కింద ఆగారిద్దరూ. కావడి దించి.. ‘వెన్న కోసం కోతులొస్తాయేమో.. నీవిక్కడే ఉండు మిత్రమా! నేనొచ్చాక వెళ్దువు’ అని చెరువు దగ్గరికి వెళ్లాడు రామయ్య. కుండల్లో ఉన్నది వెన్న అని తెలియగానే రవిరాజు కళ్లు మెరిశాయి. ఆత్రుత ఆపుకోలేక.. ఒక కుండ మూత తీసి చూస్తే, తాజా వెన్న నోరూరించింది. తినాలా, వద్దా అనుకుంటూనే.. రామయ్య కాళ్లూ, చేతులూ కడుక్కునేంతలో నిమ్మకాయంత వెన్న ఉండ తీసుకొని.. గబుక్కున నోట్లో వేసుకున్నాడు రవిరాజు. గుటుక్కున మింగి గప్‌చుప్‌గా వేలు తుడుచుకున్నాడు. కానీ, తర్వాత తన చిన్నపిల్లాడి చేష్టలకు లోలోపలే సిగ్గుపడ్డాడు.

రామయ్య వచ్చాక.. తానూ చెరువు దగ్గరకు వెళ్లి కాళ్లూ, చేతులూ కడుక్కొని వచ్చాడు రవిరాజు. ఇద్దరూ కలిసి తెచ్చుకున్న అన్నం, రొట్టెలూ పంచుకొని తిన్నారు. ‘ఇక బయలు దేరుదామా?’ అడిగాడు రవిరాజు. ‘భుజం కాస్త నొప్పిగా ఉంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటా’ బదులిచ్చాడు రామయ్య. సరేనన్నాడు రవిరాజు. రామయ్య.. చిన్న కునుకు తీసి లేచి చూడగా.. సంచిలోని చిత్రాలను మరోసారి పరిశీలించి చూసుకుంటున్నాడు రవిరాజు. జీవకళ ఉట్టిపడే ఆ చిత్రాలను చూసిన రామయ్య అవాక్కయ్యాడు.

‘భళా.. మిత్రమా! నీవింతటి గొప్పవాడివని ఊహించలేదు. నీ పనితనాన్ని చూశాక.. జమీందారు కేవలం డబ్బులతోనే సరిపెట్టరు. అంతకుమించిన కానుకలతో సత్కరిస్తారు కూడా. నీ కళా నైపుణ్యానికి నేనేమివ్వగలను చెప్పు. నీ మిత్రుడైనందుకు నాకెంతో గర్వంగా ఉంది’ అని పరవశించిపోయాడు. చెట్టు ఆకునొకటి కోసుకొచ్చి.. నీటితో శుభ్రం చేసి.. అందులో వెన్న పెట్టి.. రవిరాజు చేతికి అందించాడు రామయ్య. ప్రస్తుతం నేనివ్వగలిగింది ఇదేనంటూ.. తినాల్సిందేనని పట్టుబట్టాడు. మెల్లిగా, కొద్దికొద్దిగా తింటూ తాజా వెన్నపూస రుచిని ఆస్వాదిస్తున్న రవిరాజుకు కాస్త సిగ్గుగా అనిపించింది. ఈ రుచి తెలిస్తే.. అంతకుముందు ఆత్రుత ఆపుకోలేక గుట్టుగా తిన్న వెన్న రుచే తెలియలేదు అతడికి. దొంగతనానికీ దొరతనానికీ తేడా తెలుసుకొని మనసులోనే నిట్టూరుస్తూ.. రామయ్యకు కృతజ్ఞతలు తెలిపాడు రవిరాజు.  

- గుడిపూడి రాధికారాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని