అమృతంలాంటి ఆహారం!

చింతలకొండ రాజ్యానికి రాజు పద్మనాభుడు. కొద్దిరోజులుగా ఆయనకు ఏ ఆహారం తిన్నా, దాని రుచి తెలియటం లేదు. ఎన్నో చిట్కాలు పాటించినా.. ఎందరి సలహాలు తీసుకున్నా ఫలితం లేదు. రాజ వైద్యులూ

Updated : 04 May 2022 01:42 IST

చింతలకొండ రాజ్యానికి రాజు పద్మనాభుడు. కొద్దిరోజులుగా ఆయనకు ఏ ఆహారం తిన్నా, దాని రుచి తెలియటం లేదు. ఎన్నో చిట్కాలు పాటించినా.. ఎందరి సలహాలు తీసుకున్నా ఫలితం లేదు. రాజ వైద్యులూ ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యారు. కడుపు నింపుకొనేందుకు అయిష్టంగా ఏదో ఒకటి తినటమే తప్ప.. రుచిని ఆస్వాదిస్తూ ఆహారం తీసుకొని ఎంతో కాలమైంది.

రాజ్యానికి సమీపంలోని అడవిలో ఉండే నిత్యసంతోషుని ఆశ్రమానికి వెళ్లాడు పద్మనాభుడు. తన సమస్యను ఆయనకు వివరించాడు. నిత్యసంతోషుడు కాసేపు ఆలోచించి ‘రాజా.. మీ సమస్యకు పరిష్కారం తప్పక లభిస్తుంది. ఇప్పటినుంచి మీరు తినే ఆహారంలో.. ఏది అమృతం లాగా అనిపిస్తుందో, అప్పటి నుంచి మళ్లీ మీకు ఆహార పదార్థాల రుచి తెలుస్తుంది’ అని చెప్పాడు. ‘అలాంటి ఆహారం ఎక్కడ లభిస్తుంది? ఎవరు ఇస్తారు?’ అంటూ ప్రశ్నించాడు పద్మనాభుడు. ‘నీ రాజ్యంలోనే ఉంటుంది. వెతకండి’ అంటూ బదులిచ్చాడు నిత్యసంతోషుడు. ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన రాజు.. మంత్రికి విషయం చెప్పడంతో.. ‘రాజుగారి నాలుకకు రుచి పుట్టేలా, అమృతం లాంటి ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టినవారు గొప్ప బహుమతి అందుకుంటారు’ అని చాటింపు వేయించాడు. ఆ రోజు నుంచి రాజ్య ప్రజలు, అనేక రకాల ఆహార పదార్థాలతో రాజుగారి వద్దకు వచ్చేవారు. తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు - ఇలా ఆరు రుచులతో అద్భుతమైన వంటకాలను తయారు చేసి తీసుకువచ్చి రాజుగారికి తినిపించేవారు. అవేవీ ఆయనకు అమృతంలా అనిపించలేదు.

ఒకసారి ఓ వ్యక్తి పద్మనాభుడి వద్దకు వచ్చి ‘మహారాజా.. నేను ఎనిమిది రుచుల ఆహార పదార్థాలను తయారు చేయగలను. మీకు అమృతం లాంటి ఆహారాన్ని అందించగలను’ అన్నాడు. ‘ఆరు రుచులు అందరికీ తెలిసినవే. మిగతా రెండు ఏమిటి?’ అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు. ‘వేడిగా ఉంటే పదార్థాలు రుచిగా ఉంటాయి. ఎండన పడి వచ్చినవారికి చల్లని పానీయాలు హాయినిస్తాయి. కాబట్టి వేడి, చల్లదనం కూడా రుచులే..’ అన్నాడా వ్యక్తి. అతను పెట్టిన ఏ పదార్థం కూడా పద్మనాభుడికి అమృతంలాగా అనిపించలేదు. మరుసటి రోజు కూరగాయలు పండించే ఒక వ్యక్తి పద్మనాభుడి దగ్గరకు వచ్చాడు. ‘ప్రభూ, నేను మీకు అమృతంలాంటి ఆహారాన్ని పెడతాను. కానీ, మీరు నా వెంట మా ఇంటికి రావాలి’ అని కోరాడు. అయిష్టంగానే అయినా చిన్న ఆశతో సరేనంటూ అతడి ఇంటికి వెళ్లాడు పద్మనాభుడు. అతను పెట్టిన ఆహారం తిన్నాడు. అద్భుతంగా ఉండటంతో.. అది అమృతంలాగా అనిపించింది రాజుకు. కోటకు తిరిగివచ్చాక.. ఆ తర్వాత నుంచి పద్మనాభుడికి తను తినే ఆహార పదార్థాల రుచి తెలియసాగింది. అతనిని మెచ్చుకొని బంగారు నాణేలతో పాటు మంచి బహుమతి కూడా ఇచ్చాడు రాజు.

‘మహారాజా.. కూరగాయలు పండించే వ్యక్తి మీకు ఏమి ఆహారం పెట్టాడు? అది అంత గొప్పదా?’ ఆసక్తిగా పద్మనాభుడిని అడిగాడు మంత్రి. ‘అవును.. అది గొప్ప ఆహారమే.. గంజి’ అని రాజు చెప్పగానే నోరెళ్లబెట్టాడు మంత్రి. ‘ప్రభూ.. గంజా...!!’ అని ఏదో అడగబోయి ఆగిపోయాడు. ‘మంత్రీ.. నీ సందేహం నాకు అర్థమైంది. వివరంగా చెబుతాను విను’ అన్నాడు రాజు.

‘‘కూరగాయలు పండించే వ్యక్తి నాకు అమృతం లాంటి ఆహారం పెడతానంటే.. ఆరోజు ఉదయాన్నే అతనితో పాటు వాళ్ల ఇంటికి వెళ్లాను. ‘ప్రభూ.. ఇంట్లో ఎవరూ లేరు. నేను మీకు ఆహారాన్ని సిద్ధం చేసే పనిలో ఉంటాను’ అని లోపలికి వెళ్లాడతను. కాసేపటికి బయటకు వచ్చి.. ‘క్షమించాలి రాజా.. పెరట్లోని కూరగాయల మొక్కలకు నీళ్లు పోసే సమయమైంది. ఆ పని చూశాక, వంట పూర్తి చేస్తా’ అన్నాడు. ఇంతలో కల్పించుకొని ‘ఆ పని నేను చూస్తా కానీ ముందు నువ్వు వంట సంగతి చూడు’ అని నేనే పెరట్లోకి వెళ్లాను. ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా నేను అదే పనిలో ఉన్నాను. ఒళ్లు వంచి కష్టం చేయడంతో.. విపరీతమైన ఆకలి వేసింది. అప్పుడే, కూరగాయలు పండించే వ్యక్తి.. ఉప్పు కలిపిన గంజి, పచ్చిమిరపకాయ తీసుకొచ్చి ఆహారంగా ఇచ్చాడు. నేను దాన్ని తాగగానే.. అది నాకు అమృతంలాగా అనిపించింది. అంతకు ముందు వరకు ఏ ఆహారం రుచి అయినా నాకు తెలియకపోవడానికి అసలు కారణం - శారీరక శ్రమ లేకపోవటమేనని అప్పుడు అర్థమైంది’’ అంటూ ముగించాడు పద్మనాభుడు. ఎలాగైతేనేం.. రాజుగారి సమస్యకు పరిష్కారం దొరికినందుకు మంత్రితోపాటు రాజ్యంలోని ప్రజలంతా సంతోషించారు.

- కళ్ళేపల్లి తిరుమలరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని