జీవహింస మహాపాపం!

‘అమ్మా!’ అంటూ ఒక్కసారిగా అరిచాడు చేతన్‌. అంతలోనే ‘ఎందుకమ్మా.. అలా గిల్లావు?’ అని ఏడుపు ముఖంతో అడిగాడు. ‘నొప్పి అంటే ఎలా ఉంటుందో చూపించడానికి’ అంది వాళ్ల అమ్మ కాస్త కోపంగా. ‘నాకు నొప్పి తెలియడం ఎందుకు?’ అని అమాయకంగా అడిగాడు చేతన్‌

Published : 06 May 2022 00:31 IST

‘అమ్మా!’ అంటూ ఒక్కసారిగా అరిచాడు చేతన్‌. అంతలోనే ‘ఎందుకమ్మా.. అలా గిల్లావు?’ అని ఏడుపు ముఖంతో అడిగాడు. ‘నొప్పి అంటే ఎలా ఉంటుందో చూపించడానికి’ అంది వాళ్ల అమ్మ కాస్త కోపంగా. ‘నాకు నొప్పి తెలియడం ఎందుకు?’ అని అమాయకంగా అడిగాడు చేతన్‌. ‘కుక్కను రాయితో కొడితే దానికి నొప్పి కలుగుతుందని చెప్పినా నువ్వు వినలేదు కదా. అందుకే అది ఎలా ఉంటుందో నీకు తెలియజేద్దామని..’ అంది అమ్మ.  
‘కుక్కను కొట్టినప్పుడు అది అరుస్తూ ఉంటే సరదాగా ఉంటుందమ్మా.. అందుకే కొట్టాను. అయినా వీధిలో తిరిగే కుక్క మీద నీకు ఎందుకంత ప్రేమ?’ విసుగ్గా అన్నాడు చేతన్‌. ‘మన సరదాల కోసం సాటి ప్రాణిని హింసించడం మంచి పద్ధతి కాదు’ అంది తల్లి. ‘సాటి అంటే సమానమైనది అని మా టీచర్‌ చెప్పారు. మరి ఈ కుక్క మనతో సమానం ఎలా అవుతుంది?’ అని అమాయకంగా అడిగాడు.
‘లోకంలో ఉన్న ప్రాణులన్నింటికీ కష్టసుఖాలు దాదాపు ఒకేలా ఉంటాయి. కాబట్టి అన్ని ప్రాణులూ సమానమే. మొక్కలు, చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. నిన్ను చీమ కానీ, దోమ కానీ కుడితే ఏం చేస్తావు?’ అని ప్రశ్నించింది అమ్మ.
‘ఇంకేం చేస్తా.. నలిపి చంపేస్తా’ అని బదులిచ్చాడు చేతన్‌. ‘అవి కుట్టడం వల్ల నీకు కలిగిన చిన్న బాధకే వాటిని చంపేస్తున్నావే. అలాంటప్పుడు వాటికి నువ్వు హాని చేస్తే అవి ఊరుకుంటాయనుకున్నావా? ప్రతి ప్రాణికీ రక్షించుకునేందుకు ఏదో ఒక మార్గం తెలుసు. తమని రక్షించుకునేందుకు వాటికి కొన్ని అవయవాలు ఉంటాయి. వాటినే ఆయుధాలుగా ఉపయోగించుకుంటాయి’ అంది అమ్మ. ‘నువ్వు మరీ చిత్రంగా చెబుతావమ్మా. అవయవాలు ఆయుధాలు ఎలా అవుతాయి?’ అని అనుమానం వ్యక్తం చేశాడు చేతన్‌.  
‘మొన్న చింటూను, కోడి ముక్కుతో పొడిచింది చూశావు కదా? తన పిల్లలను శత్రువుల బారి నుంచి రక్షించుకునే ఆయుధం దాని ముక్కు’ అని చెప్పింది అమ్మ. ‘ఔనా!’ అంటూ.. ఆశ్చర్యపోయాడు చేతన్‌. వాటికే కాదు. సృష్టిలో ప్రాణులన్నింటికీ వాటి అవయవాలే ఆయుధాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఆవులు, గేదెలు, మేకల్లాంటి జీవులు తమ కొమ్ములతో దాడి చేస్తాయి. కుక్క కరిచేస్తుంది. పక్షులు తమ ముక్కులతో పొడిచి తమను తాము రక్షించుకుంటాయి. మనుషుల్లాగా ఇతర ప్రాణులు అంత తొందరగా ఎవరినీ ఏమీ చెయ్యవు. తమను ఏమైనా చేస్తారేమోననే భయం వాటికి ఉంటుంది. నువ్వు కుక్కను రాయితో కొట్టినా అది నిన్ను ఏమీ చేయక పోవడానికి కారణం అదే. కానీ దానికి గట్టిదెబ్బ తగిలితే మాత్రం నిన్ను తప్పకుండా కరిచేస్తుంది. ఒక్కొక్కసారి కండ ఊడి పోతుంది కూడా. అందుకే అనవసరంగా వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది’ అని వివరంగా చెప్పింది అమ్మ.  
‘అమ్మో...!  జంతువులతో జాగ్రత్తగా ఉండాలైతే..’ భయంగా మొహం పెట్టి అన్నాడు చేతన్‌. ‘కేవలం జంతువులే కాదు. మొక్కలకు కూడా తమను తాము ఇతరుల నుంచి రక్షించుకునేందుకు ఆయుధాలున్నాయి. తెలుసా?’ అంది అమ్మ. ‘ఏంటీ.. మొక్కలకు ఆయుధాలా....?’ ఆశ్చర్యపోతూ అడిగాడు చేతన్‌. ‘ఔను నిజం.. కొన్ని మొక్కలకు ముళ్లు ఉండడం, కొన్ని ఆకులు తగిలితే దురద పుట్టడం, కొన్ని మొక్కలను తాకితే అవి ముడుచుకుపోవడం, కొన్ని చెడు వాసన వెదజల్లడం లాంటివన్నీ తమను తాము రక్షించుకోవడానికే. అంటే అవే వాటి ఆయుధాలు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మనకు తెలియకుండానే ఇబ్బందులకు గురవుతాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి’ అని ఓపికగా చెప్పింది అమ్మ.
‘ఇదంతా విన్నాక, ఇదివరకటి సంఘటనలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆలోచిస్తే నీ మాటలే నిజమనిపిస్తున్నాయి. ఇక మీదట ఏ ప్రాణినీ ఇబ్బంది పెట్టనమ్మా’ మాట ఇస్తూ అన్నాడు చేతన్‌. ‘అందుకే నిన్ను బంగారు కొండా అంటాను’ అని చేతన్‌ను దగ్గరకు తీసుకుంది అమ్మ.

- ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని