కిచకిచమంటే... ఆపదున్నట్టే!

అడవిలో ఒంటరిగా తిరుగుతోంది సింహం. ఆ సమయంలో జంతువులన్నీ చెట్ల కింద హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాయి. మిట్టమధ్యాహ్నం ఒళ్లు మరిచి నిద్రపోతున్న వాటిని చూసి మృగరాజుకి ఒళ్లు మండింది. ..

Updated : 19 May 2022 06:27 IST

అడవిలో ఒంటరిగా తిరుగుతోంది సింహం. ఆ సమయంలో జంతువులన్నీ చెట్ల కింద హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాయి. మిట్టమధ్యాహ్నం ఒళ్లు మరిచి నిద్రపోతున్న వాటిని చూసి మృగరాజుకి ఒళ్లు మండింది. ఒక్కసారిగా గట్టిగా గర్జించింది. ఆ శబ్దానికి జంతువులన్నీ కళ్లు తెరచి చూశాయి. ఎదురుగా మృగరాజు కోపంతో కనబడింది. ‘మృగరాజా! ఈ సమయంలో మీరు ఇటు వైపు రావటానికి కారణం?’ అని అడిగాయి జంతువులు. ‘నా సంగతి పక్కన పెట్టండి. ముందు పగటి వేళ ఈ నిద్రేంటి? వేళాపాళా లేదా?’ అని ప్రశ్నించింది. ‘మృగరాజా.. చెట్ల మీద నివాసం ఉండే పక్షుల అరుపుల కారణంగా రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. అవి కిచకిచమంటూ అరుపులు, రెక్కల శబ్దాలతో నానా గొడవ చేస్తున్నాయి’ అని తమ గోడు వెళ్లబోసుకున్నాయి. జంతువుల పరిస్థితి చూసి సింహానికి జాలి కలిగింది. ‘సరే! పక్షులన్నింటినీ రేపు నా గుహ దగ్గరకు రమ్మనమని చెప్పండి. వాటితో మాట్లాడతా’ అని వెళ్లిపోయింది. 

మరుసటి రోజు పక్షులన్నీ సింహం గుహ వద్దకు చేరుకున్నాయి. అది బయటకు రాగానే పక్షులన్నీ భయంగా ఒక దగ్గరకు చేరాయి. సింహం వాటిని ఉద్దేశించి ‘మీ వల్ల అడవిలో జంతువులకు నిద్ర కరవైంది. రాత్రిపూట నిశ్శబ్దంగా ఉండాల్సిన మీరు అందరికీ నిద్రాభంగం కలిగిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి?’ అని ప్రశ్నించింది. ‘మృగరాజా.. మేమూ అందరిలాగే రాత్రిపూట నిద్రించేవాళ్లమే. మా కిలకిలరావాలతోనే అందరినీ మేల్కొలుపుతాం. ఆ తర్వాత ఆహార సేకరణకు బయటకు వెళ్లి సాయంత్రం గూళ్లకు చేరుకుంటాం. పిల్లలకు ఆహారం పెట్టాక నిద్రపోతాం’ అన్నాయవి. ‘మీరు రాత్రిళ్లు నిద్రాభంగం కలిగిస్తున్నారని జంతువులు చేసిన ఫిర్యాదు అబద్ధమంటారా?’ అని ప్రశ్నించింది సింహం. దానికి పక్షులు ‘రాజా.. మేము ఉదయం కాకుండా మరెప్పుడైనా కిచకిచమని గట్టిగా అరిచామంటే అక్కడ ప్రమాదం పొంచి ఉందని అర్థం’ అని బదులిచ్చాయవి. ఆ మాటలు సింహానికి నమ్మబుద్ధి కాలేదు. ‘మీ మాటలు నమ్మశక్యంగా లేవు.. నిరూపించగలరా!’ అని ప్రశ్నించింది. ‘తప్పకుండా మృగరాజా! అయితే ఒక షరతు’ అన్నాయవి. ‘ఏంటది?’ ప్రశ్నించింది సింహం. ‘మేము పిలిచినప్పుడు మీరు రావాలి’ అన్నాయి. దానికి సింహం అంగీకరించి.. గుహలోకి వెళ్లిపోయింది. 

ఒకరోజు సింహం గుహలో ఉండగా, కావ్‌.. కావ్‌ అని అరవసాగింది కాకి. సింహం బయటకు రాగానే, తమ నివాసాల దగ్గరకు రమ్మన్నది కాకి. సింహం అక్కడికి వెళ్లగానే పక్షుల అరుపులు పెద్దగా వినపడ్డాయి. తలెత్తి పైకి చూస్తే.. ఒక పాము చెట్టు పైకి ఎక్కి పిల్ల పక్షులను, గుడ్లను తినటం కనిపించింది. పామును ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా అరవసాగాయి పక్షులు. సింహం ఒక్కసారి గర్జించగానే పాము భయంతో చెట్టు దిగి పొదల్లోకి వెళ్లిపోయింది. పక్షులన్నీ సింహానికి కృతజ్ఞతలు చెబుతూ.. ‘చూశారా మృగరాజా.. ప్రమాదం పాము రూపంలో రావటంతో అరవాల్సి వచ్చింది’ అన్నాయి. అప్పటికీ పక్షుల మాటలు సింహానికి నమ్మబుద్ధి కాలేదు. వాటిని పట్టించుకోకుండా గుహకు చేరుకుంది. మరోసారి రాత్రిపూట పక్షుల నుంచి సింహానికి పిలుపు వచ్చింది. సింహం వాటి నివాసమైన చెట్టు దగ్గరకు చేరుకుంది. అక్కడ పక్షుల అరుపులు పెద్దగా వినబడుతున్నాయి. అదే సమయంలో సింహానికి.. ఓ పక్క నుంచి ఇద్దరు మనుషుల మాటలు వినబడ్డాయి. వెంటనే తేరుకున్న సింహం.. వారిపై దాడికి సన్నద్ధం అవుతుండగా.. కాకి వారించింది. 

 ‘మృగరాజా.. మీరు ముందుగా వారి మాటలు వినండి’ అంది. ఆ మాటలను బట్టి వారు వేటగాళ్లని సింహానికి అర్థమైంది. వారిలో ఒకరు ‘ఈ రాత్రికి ఇనుప వల వేయటం పూర్తి కావాలి. రేపు పెద్ద జంతువులైన సింహమో, పులో వలలో పడితే మన పంట పండుతుంది. వాటి చర్మం, గోళ్లు అమ్ముకుంటే మంచి ధర వస్తుంది. మన కష్టాలూ తొలగిపోతాయి’ అన్నాడు. రెండో వేటగాడు ‘అవును.. నువ్వు చెప్పింది నిజమే. వాటి మాంసానికి కూడా గిరాకీ ఉంది’ అన్నాడు. ఆ వేటగాళ్లు తన కోసం వల పన్నుతున్నట్లు తెలుసుకున్న సింహం కోపంతో రగిలిపోయింది. గర్జిస్తూ వారి మీద దాడికి యత్నించింది. వేటగాళ్లు వలను అక్కడే వదిలేసి పారిపోయారు. ‘మీరు రాత్రి పూట అరవటం వల్లే నాకు అపాయం తప్పింది. లేకపోతే ఈ వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. క్షమించండి’ అంటూ గుహ వైపు వెళ్లిపోయింది సింహం. మరుసటి రోజు అది అడవి జంతువులకు జరిగిన విషయాన్ని వివరించి.. రాత్రిపూట పక్షుల అరుపులు వినిపిస్తే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర  
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని