సన్నద్ధతే సగం విజయం!

పూర్వం స్వర్ణధాత్రి అనే రాజ్యాన్ని విక్రమవర్మ పరిపాలించేవాడు. తన ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు. ఆమె పేరు స్వర్ణమణి. ఆమెకు తగిన వరుడిని చూసి పెళ్లి చేయాలని అనుకున్నాడు రాజు.

Published : 21 May 2022 00:06 IST

పూర్వం స్వర్ణధాత్రి అనే రాజ్యాన్ని విక్రమవర్మ పరిపాలించేవాడు. తన ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు. ఆమె పేరు స్వర్ణమణి. ఆమెకు తగిన వరుడిని చూసి పెళ్లి చేయాలని అనుకున్నాడు రాజు. విక్రమవర్మకు వయసు మీద పడుతుండటంతోపాటు వారసులూ లేకపోవడంతో ఎలాగైనా స్వర్ణధాత్రి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని శత్రు దేశాల రాజులు చూడసాగారు. వారిలో పొరుగున ఉండే అనంతగిరి రాజైన అనంతసేనుడు ముందువరసలో ఉంటాడు. వేగుల ద్వారా ఎప్పటికప్పుడు విక్రమవర్మ ఆరోగ్య స్థితిగతులనూ, రాజ్య వివరాలనూ ఆరా తీస్తుండేవాడు. ఈ విషయం ఎలాగోలా విక్రమవర్మకు తెలిసింది.

వెంటనే.. రాజ్యంలో రక్షణ చర్యలు, సైనిక బలగాల సన్నద్ధత తదితర అంశాలపైన సమీక్ష నిర్వహించాడు విక్రమవర్మ. స్వర్ణధాత్రి రాజ్యానికి మూడు వైపులా ఉప్పొంగుతూ ప్రవహించే నదులూ, ఒక వైపు సామంతరాజ్యం సుందరకాంతారం ఉంది. ఎవరైనా స్వర్ణధాత్రి రాజ్యంపైన దాడి చేయాలంటే సుందరకాంతారం దాటి రావాలి. ఆ ఒక్కచోట నుంచే అవకాశం ఉంటుంది. దాంతో ఆ సామంత రాజ్య రాజు బాహుబలికి కబురుపెట్టాడు విక్రమవర్మ.

వారిద్దరి మాటల్లో పొరుగురాజు అనంతసేనుడు గురించి చర్చకు రాగా.. ‘ప్రభూ.. ఏ రాజైనా, భటుడైనా మా సుందరకాంతారాన్ని దాటిన తర్వాతే మీ దగ్గరకు రావాలి. పొరుగున ఉన్న శత్రురాజు మీలా సౌమ్యుడు కాదు. అతడిని ఎలా ఎదుర్కొనాలో నాకు బాగా తెలుసు. అందుకు సేనలను సైతం సంసిద్ధం చేశాం. మీ తాతముత్తాతల కాలం నుంచి మాకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. మమ్మల్ని దాటి రావడమే శత్రురాజుకు అసలు సవాలు. మీరు నిశ్చింతగా ఉండండి’ అని హామీనిచ్చాడు బాహుబలి. పరిస్థితులు బాగా తెలిసిన వాడు కావడంతో తమ రహస్య యుద్ధతంత్రాల్ని, రక్షణ చర్యలనూ విక్రమవర్మకు వివరించాడు. అందుకు కావాల్సిన ఆయుధాలనూ సమకూర్చుకునేలా అంగీకారానికొచ్చారు. శత్రురాజ్యం సైన్యం పదివేలకు పైగా ఉండటం, స్వర్ణధాత్రి రాజ్య సేనల సంఖ్య అంతకంటే తక్కువగా ఉందన్న విషయం గూఢచారుల ద్వారా తెలుసుకున్నారు. సుందరకాంతారపు సైన్యాన్ని కూడా బలోపేతం చేసేలా నియామకం చేపడతామని ప్రకటించాడు బాహుబలి. వ్యూహ ప్రతివ్యూహాల్లో ఎలా మెలగాలని వారిద్దరూ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

నెలరోజులలోపే ఊహించిన ఉపద్రవం రానే వచ్చింది. శత్రురాజ్య సైనికులు సుందరకాంతారం అటవీ సరిహద్దుల గుండా స్వర్ణధాత్రి వైపు దూసుకెళ్లేందుకు మెరుపుదాడి చేశారు. అప్పటికే అడవిలో చెట్లపైన మొహరించిన సొంత సైన్యానికి సూచనలిచ్చాడు బాహుబలి. అంతే.. క్షణాల్లోనే వందల కొద్దీ బాణాలు చెట్లమీదున్న తేనెతుట్టెలను కదిలించాయి. రెప్పపాటులో లక్షల కొద్దీ తేనెటీగలు అనంతగిరి సైన్యాన్ని చుట్టుముట్టాయి. వాటి దాడి నుంచి తేరుకొనేలోగా కారంపొడి సంచులను గాల్లోకెగరేసి శత్రుసైనికులకు కళ్లలో మంటలు పుట్టించారు. అడుగడుగునా ఆటంకాలు, కందకాలు.. అనంతగిరి సేనకు నరకం చూపించాయి. విక్రమవర్మనూ, బాహుబలిని తక్కువ అంచనా వేశామనీ శత్రురాజు తలపట్టుకున్నాడు.

కొద్దిమంది సైనికులు సుందరకాంతారం రాజ్యాన్ని దాటి.. స్వర్ణధాత్రి వైపుగా కదిలారు. అప్పటికే కదనరంగంలోకి దిగిన ఆ రాజ్య సేనలు వారిని బందీలుగా చేసుకున్నాయి. వారి దగ్గర ఉన్న ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. బాహుబలి ఎత్తుగడలూ, మెరుపు దాడి జరగొచ్చనే సందేహంతో ముందే సన్నద్ధమవడంతో స్వర్ణధాత్రి గెలుపుబావుటా ఎగురవేసింది. ఓటమిపాలైన అనంతసేనుడు తన తప్పు తెలుసుకొని.. విక్రమవర్మ, బాహుబలికి క్షమాపణ కోరుతూ లేఖ పంపించాడు. శత్రువును మట్టికరిపించి.. రాజ్యాన్ని కాపాడిన బాహుబలికి తన కూతురు స్వర్ణమణిని ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు విక్రమవర్మ. తన తదుపరి రాజ్య బాధ్యతలనూ అతడికే అప్పగించాడు. 

- చిట్యాల రవీందర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని