జ్ఞాన దీపం

జ్ఞానవర్మకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ. అతడి తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులంటే మక్కువ. తెలివితేటలుంటే ఆస్తిపాస్తులు నిలబెట్టుకోగలడనే ఉద్దేశంతో వీధి బడి చదువయ్యాక.. అతడిని ఒక గురుకులానికి పంపారు. అప్పటికి అతడి వయస్సు పన్నెండేళ్లు. జ్ఞానవర్మ ఆ గురుకులంలో చదువు పూర్తి చేశాక..

Updated : 27 May 2022 06:31 IST

జ్ఞానవర్మకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ. అతడి తల్లిదండ్రులకు ఆస్తిపాస్తులంటే మక్కువ. తెలివితేటలుంటే ఆస్తిపాస్తులు నిలబెట్టుకోగలడనే ఉద్దేశంతో వీధి బడి చదువయ్యాక.. అతడిని ఒక గురుకులానికి పంపారు. అప్పటికి అతడి వయస్సు పన్నెండేళ్లు. జ్ఞానవర్మ ఆ గురుకులంలో చదువు పూర్తి చేశాక.. ఇంటికి చేరకుండా మరొక ప్రసిద్ధ గురుకులంలో చేరాడు. అంతటితో ఆగక దేశాటన చేసి లోకజ్ఞానం కూడా పొందాడు.
ఆ తరువాత తల్లిదండ్రుల వైపు మనసు లాగగా స్వగ్రామం చేరాడు. అప్పటికి అతడికి పెళ్లి వయసు వచ్చింది. తల్లిదండ్రులు అతడికి జ్ఞానాంబ అనే ఒక తెలివైన అమ్మాయితో పెళ్లి చేశారు. జ్ఞానవర్మ తండ్రి చేసే వ్యవసాయ, వ్యాపార పనుల్లో సాయపడసాగాడు. వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే జ్ఞానాంబ భర్తకున్న అపారమైన తెలివితేటలను గమనించింది. భర్త ప్రతిభ ఇంటికే పరిమితం కావడం ఆమెకు నచ్చలేదు. పదిమందికి ఉపయోగపడాలనుకుంది.
ఒకరోజు భర్తతో... ‘మన రాజుగారు పాలనకు సంబంధించిన సలహాదారులను ఎంపిక చేస్తున్నారనే చాటింపు ఇటీవల విన్నారు గదా! మీరు పెద్ద చదువులు చదివారు. పైగా చాలా తెలివైన వారు. మీ చదువు, తెలివితేటలు వృథా కారాదు. వ్యాపారంలో, వ్యవసాయంలో వచ్చిన సమస్యలను చిటికెలో పరిష్కరిస్తున్నారు. మీలాంటి వారు రాజు గారికి సలహాదారులైతే రాజ్యానికి మేలు చేసే వారవుతారు. మీరు రాజు గారు నిర్వహించబోయే పరీక్షకు వెళ్లండి. తప్పని సరిగా ఎంపికవుతారు’ అని ప్రోత్సహించింది.
ఆమె మాటలు అత్తమామల చెవిన పడ్డాయి. వెంటనే మామగారు కలుగజేసుకొని.. ‘కొలువు చేసుకుని బతికే గతి మన కుటుంబానికి లేదు. ఉన్న ఆస్తులు కాపాడుకుంటే చాలు’ అని కోడలి మాటలను తోసిపుచ్చారు. తండ్రి మాట కాదనలేక జ్ఞానవర్మ చాలా నిరుత్సాహపడ్డాడు. కోడలు ఇక వాదించలేదు. అప్పటి నుంచి ఆమె అత్తమామలను ఎలా ఒప్పించాలా అని ఆలోచనలో పడింది.
ఒకరోజు సాయంత్రం జ్ఞానాంబ రాత్రి వెలుగు కోసం దీపాలను సిద్ధం చేసింది. చీకటి పడగానే ఇంట్లో ఎత్తైన దిమ్మల మీద దీపాలను వెలిగించింది. తరువాత ఇంటి బయట ఓ దీపాన్ని ఒక గుంతలో పెట్టి వెలిగించింది.
ఇంటి బయట చీకటి చూసి మామగారు... ‘బయట దీపం పెట్ట లేదా?’ అని కేకేశారు. కోడలు దీపం పెట్టానని సమాధానమిచ్చింది. కోపంతో మామగారు ఇంటి బయటకు వస్తూ ఎక్కడని అడిగారు. కోడలు.. ‘అదిగోండి అక్కడ!’ అని గుంతలో ఉన్న దీపాన్ని చూపించింది. అంతే.. మామగారి కోపం కట్టలు తెంచుకుంది. ‘నీ తెలివి ఏడ్చినట్టుంది. దీపాన్ని ఎత్తులో ఉంచుతావా? గుంతలో ఉంచుతావా? గుంతలోని వెలుగు ఆ గుంత దాటదు. బయట చీకటి లేకుండా చెయ్యలేదు. ఆ మాత్రం తెలియదా నీకు?’ అని అడిగాడు.
కోడలు ప్రశాంతంగా... ‘నాకేమీ కాలేదు. మీ అబ్బాయి తెలివితేటలు గుంతలో ఉంచిన దీపం వెలుగులాగా వ్యాపించకుండా ఉన్నాయని మీకు అర్థమయ్యేలా చెప్పడానికే ఈ పని చేశాను’ అంది. మామగారు తన తప్పును తెలుసుకున్నాడు. కొడుకును పరీక్షకు వెళ్లమని ప్రోత్సహించాడు. రాజు గారు నిర్వహించిన పరీక్షల్లో జ్ఞానవర్మ విజయం సాధించి ముఖ్య సలహాదారుడి పదవిని పొందాడు.
కొడుకు తెలివితేటలు రాజ్యాభివృద్ధికి ఉపయోగపడి ప్రజలంతా అతడి పేరు చెప్పుకుంటుంటే ఆ తల్లిదండ్రులు చాలా ఆనందించారు. జ్ఞాన దీపం నలుగురికి ఉపయోగపడిందని జ్ఞానాంబ పరమానందం పొందింది.

- బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని