అల్లరి ఏనుగుకు పాఠం!

అదొక అందమైన అడవి. ఆ అడవి మధ్యలో ఓ కొలను.. ఆ కొలను ఒడ్డున ఒక మామిడి చెట్టు. ఒక వేసవికాలంలో మామిడి చెట్టు విరగకాసింది. కొమ్మకొమ్మకూ పసుపు పచ్చని పండ్లే కనిపిస్తున్నాయి. దాహంతో అల్లాడుతూ నీటి కోసం అడవి మొత్తం తిరుగుతున్న కోతికి.. కొలను, దాని ఒడ్డున మామిడి చెట్టు కనిపించాయి. ముందు దాహం తీర్చుకున్నాక.. పండ్లు తినాలనుకుంది.

Published : 28 May 2022 01:25 IST

అదొక అందమైన అడవి. ఆ అడవి మధ్యలో ఓ కొలను.. ఆ కొలను ఒడ్డున ఒక మామిడి చెట్టు. ఒక వేసవికాలంలో మామిడి చెట్టు విరగకాసింది. కొమ్మకొమ్మకూ పసుపు పచ్చని పండ్లే కనిపిస్తున్నాయి. దాహంతో అల్లాడుతూ నీటి కోసం అడవి మొత్తం తిరుగుతున్న కోతికి.. కొలను, దాని ఒడ్డున మామిడి చెట్టు కనిపించాయి. ముందు దాహం తీర్చుకున్నాక.. పండ్లు తినాలనుకుంది. ముందూవెనకా ఆలోచించకుండానే గబుక్కున నీటిలోకి దిగబోయింది. ఒక్కసారిగా మొసలి కనిపించడంతో గతుక్కుమంది. రెండు రోజుల కిందటే జాలర్లు వచ్చి చెరువులోని చేపలన్నింటినీ వల వేసి పట్టుకెళ్లడంతో.. మొసలి ఆకలితో నకనకలాడుతోంది. ఎప్పుడు గాలి వీస్తుందా.. చెట్టు మీద నుంచి మామిడి పండ్లు ఎప్పుడు రాలతాయా అని ఎదురుచూస్తోంది. సమయం గడుస్తున్నా.. ఒక్కటీ కింద పడకపోవడంతో డీలాపడింది. చెరువు అడుగు భాగంలో అక్కడక్కడా దొరికే దుంపలనే తింటూ తృప్తి పడుతుండేది. సరిగ్గా అదే సమయంలో కోతి కనిపించడంతో, దాన్ని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంది మొసలి.  

‘కోతి బావా.. కోతి బావా.. ఈ కొలనులో దుంపలు చాలా రుచిగా ఉంటాయి. బలానికి మంచి మందు కూడా. నీకు కొన్ని తెచ్చిపెట్టనా?’ అడిగింది మొసలి. దాని మాటలకు కోతి నవ్వి.. ‘దుంపల సంగతి నాకు తెలిసిందే మొసలి బావా! అసలు నీ మనసులో ఏముందో చెప్పు?’ అని అడిగింది. ‘చల్లకొచ్చి ముంత దాచలేను. తిండి లేక డొక్క ఎండిపోతోంది. వర్షాకాలం వరకూ ప్రతి రోజు నువ్వు ఈ కొలను దగ్గరికొచ్చి.. ఓ నాలుగు మామిడి పండ్లను నా ముందు పడేస్తే చాలు’ మొహమాట పడకుండా అడిగింది మొసలి. ‘మొసలి బావా.. ఇచ్చిపుచ్చుకోవడం తెలిసిన నీతో స్నేహం నాకు ఇష్టమే కానీ.. ఇప్పుడు నాకు విపరీతమైన దాహం వేస్తుంది. నీట్లోకి దిగితే నువ్వేం చేస్తావోనన్న భయం ఉంది. అందుకే.. ముందు దాహం తీర్చుకొన్నాక, నీ ఆకలి తీరుస్తాను’ తెలివిగా చెప్పింది కోతి.

ఆ మాటతో మొసలి కాస్త దూరంగా వెళ్లింది. కోతి దాహం తీర్చుకుని చకచకా మామిడి చెట్టు ఎక్కింది. కొన్ని పండ్లు తెంపి మొసలి ముందు వేసింది. అది కడుపు నిండా తిని కోతికి కృతజ్ఞతలు చెప్పింది. అప్పటి నుంచి ఆ రెండింటి మధ్యలో స్నేహం బలపడింది. అలా అలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు కోతి.. ‘మొసలి బావా.. చెట్టు మీద పండ్ల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. మిత్రుడిగా నీ ఆకలి తీర్చడం నా ధర్మం. ఇకనుంచి ఈ పండ్లను నీకు విడిచిపెట్టి.. నా పొట్ట నింపుకొనేందుకు అడవి బాట పడతాను’ అంటూ వెళ్లిపోయింది. మరుసటి రోజు చెరువు దగ్గరకు వచ్చిందో గున్న ఏనుగు. ఎంతో ఉత్సాహంతో నీటిలోకి దిగింది. ఎండల ధాటికి ఉక్కపోత భరించలేక.. నీటిని బురద చేస్తూ, కేరింతలు కొడుతూ అందులో ఆడసాగింది. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న మొసలి, తల బయటకు పెట్టి.. ‘ఏనుగు మిత్రమా.. వేసవి కావడంతో చెరువులోని నీరు అంతకంతకూ తగ్గిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నీటిని వృథా చేయడమంటే.. కష్టాలను కొనితెచ్చుకున్నట్లే. నీరు లేని కొలనులో నేను బతకలేను’ అంటూ దానివైపు దీనంగా చూసింది. సమయానికి కోతి అక్కడ లేకపోవడంతో బాధ పడింది.

మొసలి మొరను ఏనుగు వినిపించుకోలేదు, సరికదా.. ‘ఈ చెరువేమైనా నీ సొంతమా.. నా ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటా. నీటిని పారబోస్తా.. నీకెందుకు? ఉంటే ఉండు. లేకపోతే చావు’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ‘కొద్ది రోజుల కిందట ఈ చెట్టు నిండుగా మామిడికాయలు ఉండేవి. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. ఎవరు కోసుకెళ్తున్నారో నీకు తెలుసా?’ అంటూ మొసలిపైన ఘీంకరించింది ఏనుగు. ఈ గున్న ఏనుగుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది మొసలి. ‘ఇందాక కోతిబావ సంచితో పండ్లు మొత్తం కోసం మామిడిచెట్టు పక్కనున్న ఉసిరి చెట్టుపైన దాచింది. కావాలంటే చూడు’ అంటూ చెట్టుకు వేలాడుతున్న ఓ సంచిని చూపించింది. ఆవేశంతో అటుగా వెళ్లిన ఏనుగు.. ఆ సంచిని తొండంతో లాగింది. అది చెట్టుకి వేలాడుతున్న తేనెపట్టు. సంచి అనుకొని లాగడంతో, తేనెటీగలన్నీ ఒక్కసారిగా చెల్లాచెదురయ్యాయి. పరిస్థితిని గమనించిన మొసలి నీళ్లలోకి జారుకుంది. తేనెటీగలన్నీ కుట్టిన చోట కుట్టకుండా ఏనుగు భరతం పట్టాయి. కొన్ని తొండంలో దూరి హంగామా చేశాయి. పరుగు పరుగున చెరువులోకి దిగి.. తన ప్రాణాలను రక్షించుకుంది ఏనుగు. సాయంత్రం కోతి రాగానే, మొసలి జరిగిందంతా చెప్పడంతో.. రెండూ నవ్వుకున్నాయి.

- బెహరా మోక్షజ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని