కుడితిలో పడ్డ ఎలుక!

శనివారం సాయంత్రం రంగనాథం అంగడికి వెళ్లిన సోమసుందరం.. ‘అయ్యా రంగనాథం గారూ.. నాకు యాభై కిలోల బియ్యం రేపు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావాలి’ అన్నాడు. ‘అలాగే.. రేపు ఉదయం సిద్ధం చేసి ఉంచుతా’ అన్నాడు రంగనాథం. పైకం చెల్లించి రశీదు జేబులో పెట్టుకుని వెళ్లిపోయాడు సోమసుందరం.

Published : 31 May 2022 00:43 IST

నివారం సాయంత్రం రంగనాథం అంగడికి వెళ్లిన సోమసుందరం.. ‘అయ్యా రంగనాథం గారూ.. నాకు యాభై కిలోల బియ్యం రేపు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావాలి’ అన్నాడు. ‘అలాగే.. రేపు ఉదయం సిద్ధం చేసి ఉంచుతా’ అన్నాడు రంగనాథం. పైకం చెల్లించి రశీదు జేబులో పెట్టుకుని వెళ్లిపోయాడు సోమసుందరం.

ఆదివారం ఉదయం తొమ్మిదిగంటలకు మునుపే, న్యాయాధికారితో కలిసి సోమసుందరం రంగనాథం అంగడికి కారులో వెళ్లాడు. న్యాయాధికారిని చూస్తూనే పనివాళ్లతో రెండు కుర్చీలు తెప్పించి వేసి.. వినయంగా నమస్కరిస్తూ.. ‘అయ్యగారూ.. కబురు చేస్తే, నేనే మీ ఇంటికి కావాల్సిన సరకులు పంపేవాడిని కదా.. మీరు ఇంత దూరం రావాలా?’ అన్నాడు రంగనాథం.

‘అదేం లేదయ్యా.. మా మిత్రుడు నీ దగ్గర బియ్యం బస్తా కొన్నాడటగా.. కారు డిక్కీలో పెట్టించు’ అన్నాడు న్యాయాధికారి. ఇంతలో రైతులు ధాన్యం బస్తాలతో ఎడ్లబండ్లు తోలుకుని వచ్చారు. ఆదే సమయంలో తూనికలు, కొలతల శాఖాధికారి రంగయ్య అంగడికి వచ్చాడు.

‘మీరు తప్పుడు తూకాలతో అమ్మకం చేస్తున్నారని, మీ దగ్గర యాభై కిలోలు కొంటే నలభై అయిదు కిలోలే ఉంటున్నాయని ఫిర్యాదు అందింది. అందుకే మీరు ఉపయోగించే తూనికరాళ్లను పరిశీలనకు తీసుకువెళుతున్నాం’ అని అక్కడ ఉన్న వాటన్నింటినీ పట్టుకుపోయాడు.

‘అయ్యో ఇప్పుడు ఎలా.. రైతులంతా ధాన్యంతో వచ్చారే. వాళ్ల ధాన్యం యాభైకిలోల బరువు తూచి తీసుకోవాలి. ఇప్పుడు ఎలా? రైతులూ.. మీరంతా ఇప్పుడు వెళ్లిపోండి. నేను మళ్లీ కబురు చేసిన రోజు రండి’ అన్నాడు రంగనాథం.
‘భలే వాడివయ్యా నువ్వు.. పాపం వాళ్లంతా ఎన్నో గ్రామాల నుంచి వచ్చారు. వాళ్లను తిప్పి పంపుతావా?’ అన్నాడు న్యాయాధికారి. ‘ఇప్పుడు ఎలాగండి.. తూనికరాళ్లు లేకుండా ఎలా ధాన్యం కొనుగోలు చేయమంటారు?’ అన్నాడు రంగనాథం.
‘నేను తమ వద్ద కొన్న బియ్యం బస్తా యాభై కిలోల బరువేగా దాన్ని తూనికరాళ్లుగా వాడుకుంటే సరి’ అన్నాడు సోమసుందరం. ‘నిజమే.. అలాగే చేసి మీ నిజాయతీ నిరూపించుకోవచ్చు. మీ పైన పడిన అపవాదు కూడా తొలగిపోతుంది’ అన్నాడు న్యాయాధికారి.

న్యాయాధికారి మాటకు ఎదురు చెప్పలేక కుడితిలో పడ్డ ఎలుక రీతిన, యాభై కిలోల బస్తాలో నలభై అయిదు కిలోల బియ్యం ఉన్న విషయం బయట పడితే తనకు జైలేనని తలచి.. ‘అలాగే’ అంటూ బియ్యం బస్తా తూనికరాళ్ల స్థానంలో ఉంచి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయసాగాడు రంగనాథం.

‘అయ్యా.. తమరి బియ్యం బస్తా రేపు పంపుతాను’ అని సోమసుందరంతో అన్నాడు రంగనాథం. ‘అలాగే పంపించండి. మీ అందరి ధాన్యం ఈ రోజు రంగనాథం కొంటారు. అలా కాని పక్షంలో నాకు తెలియజేయండి’ అని సోమసుందరంతో కలిసి వెళ్లాడు న్యాయాధికారి.

మరునాడు అయిదుకిలోల బియ్యం సోమసుందరం బస్తాలో పోసి వారి ఇంటికి పంపాడు రంగనాథం. తప్పుడు తూకం వేస్తున్నందుకు తూనికలు, కొలతల శాఖవారు రంగనాథానికి లక్షరూపాయల జరిమానా విధించారు.

ధాన్యం కొనుగోలులో లక్షల నష్టం, జరిమానాతో జరిగిన అవమానానికి మరెన్నడూ జీవితంలో అవినీతికి పాల్పడకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు రంగనాథం. తనకు బుద్ధి వచ్చేలా న్యాయాధికారే ఇలా చేశాడన్న విషయం రంగనాథానికి ఎన్నటికీ తెలియలేదు.

- బెల్లంకొండ నాగేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని