న్యాయం కావాలి..!

చెట్టు ఎక్కుతూ ఒక ఉడుత అమాంతం జారి పక్కనే ఉన్న బురద గుంతలో పడింది. అది భయంతో ‘కాపాడండీ! కాపాడండీ!’ అంటూ అరవసాగింది. ఆ బురద గుంత లోతెక్కువ. అటుగా వెళుతున్న ఒక నక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఉడుతను చూసింది. చటుక్కున వెళ్లి ఒడుపుగా ఉడుత ప్రాణాలు కాపాడింది. అప్పుడే అక్కడకు వచ్చిన కుందేలు, ఏనుగు, జింక మొదలైన జంతువులన్నీ ప్రాణాపాయం నుంచి బయటపడిన ఉడుతను చూశాయి.

Published : 02 Jun 2022 01:11 IST

చెట్టు ఎక్కుతూ ఒక ఉడుత అమాంతం జారి పక్కనే ఉన్న బురద గుంతలో పడింది. అది భయంతో ‘కాపాడండీ! కాపాడండీ!’ అంటూ అరవసాగింది. ఆ బురద గుంత లోతెక్కువ. అటుగా వెళుతున్న ఒక నక్క ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఉడుతను చూసింది. చటుక్కున వెళ్లి ఒడుపుగా ఉడుత ప్రాణాలు కాపాడింది. అప్పుడే అక్కడకు వచ్చిన కుందేలు, ఏనుగు, జింక మొదలైన జంతువులన్నీ ప్రాణాపాయం నుంచి బయటపడిన ఉడుతను చూశాయి.

‘పెద్ద ప్రమాదం తప్పింది’ అంటూ ఉడుతను ఓదార్చసాగాయి. ఉడుతతో సహా ఏ జంతువూ నక్కను అసలు పట్టించుకోలేదు. దాంతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎవ్వరూ పలకరించక పోవడంతో నక్క అక్కణ్నుంచి వెళ్లిపోయింది.
మృగరాజు గుహ ముందు వేలాడుతున్న గంటను నక్క గణగణమని మోగేలా కొట్టసాగింది. గుహ లోపల ఉన్న మృగరాజు.. ‘ఎవరికి ఏ కష్టం కలిగిందో?’ అనుకుంటూ బయటకు వచ్చింది. గంటను కొడుతున్న నక్కను చూసి..., ‘ఎందుకు గంట మోగిస్తున్నావు?’ అని అడిగింది.

‘మృగరాజా! నాకు న్యాయం కావాలి!’ అని నక్క దీనంగా అడిగింది. ‘నీకు ఎవరు అన్యాయం చేశారు?’ అక్కడే ఉన్న గద్దె మీద కూర్చుంటూ అడిగింది సింహం. ‘అడవిలో నివసించే జంతువులన్నింటినీ ఒక్కసారిగా పిలిపిస్తే, తప్పకుండా చెబుతాను మృగరాజా!’ అంది నక్క.

సింహం, నక్క అభ్యర్థనను మన్నించింది. అక్కడే చెట్టుపై ఉన్న కాకితో.. ‘అడవి జంతువులన్నింటినీ సమావేశానికి పిలుచుకుని రా!’ అంటూ ఆజ్ఞాపించింది. వెంటనే కాకి ఎగురుకుంటూ వెళ్లింది.

కాకి కబురు విన్న కుందేలు, ఏనుగు, జింక, ఉడుత వంటివన్నీ మృగరాజు దగ్గరకు వచ్చాయి. మృగరాజుకు ఎదురుగా ఉన్న నక్క వంక అవి విచిత్రంగా చూడసాగాయి. ‘ఉదయం ఉడుతను కాపాడిన నక్కే కదూ! అప్పుడు బాగానే ఉందిగా! ఎందుకొచ్చిందో?’ అని ఏనుగు, జింకతో గుసగుసలాడింది. ‘ష్‌! గుసగుసలు ఆపండి. నక్కా! నీకు జరిగిన అన్యాయం ఏంటో ఇక ఇప్పుడు చెప్పుకో!’ అంది మృగరాజు. 

‘నక్క ఏం చెప్పబోతుందో’ అని కుందేలు, ఏనుగు, జింక, ఉడుత వంటి జీవులన్నీ ఆసక్తిగా ఎదురు చూడసాగాయి. ‘మృగరాజా! ఈ రోజు ఉదయం ఉడుత బురద గుంటలో పడి చిక్కుకుపోతే కాపాడాను. కనీసం నాకు అది కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. కాసేపు అది తప్పు కాదనుకుందాం. కానీ ఏనుగు, జింక, కుందేలు వంటి జంతువులన్నీ అక్కడున్నప్పటికీ మాటవరుసకైనా నన్ను పలకరించలేదు. సాటి జంతువునైన నన్ను పట్టించుకోనందుకు బాధేసింది. ఎవరైనా మంచి పని చేస్తే తోటి వారు అభినందనలు తెలియజేస్తారు. అది వారికి ప్రోత్సాహం అవుతుంది. మరిన్ని మంచి పనులు చేయడానికి ఊతం ఇస్తుంది. మా నక్క జాతిలో ఏవో కొన్ని జిత్తుల మారి వేషాలు వేసి తోటి జీవులను మోసం చేసి ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం మా జాతినే వెలివేసినట్టు చూడటం న్యాయమా.. మృగరాజా!’ అని నక్క వాపోయింది.

‘నక్క చెబుతోంది నిజమేనా?’ అని కుందేలు, ఉడుత, ఏనుగు, జింకలను చూస్తూ అడిగింది మృగరాజు. అవి సింహం వైపు నిజమే అన్నట్టుగా చూశాయి. ‘బురదలో పుట్టినా కమలాన్ని చూసి బావుందని మెచ్చుకుంటామే కానీ, అసహ్యించుకోం కదా. చీమల్లో అన్నీ మంచివీ ఉండవు. దోమల్లో అన్నీ చెడ్డవీ ఉండవు. కాబట్టి మా జాతి పేరును బట్టి కాకుండా మా తీరును బట్టి ప్రవర్తించండి. సాటి జీవినన్న మమకారాన్ని చూపించండి. ఇది నా విన్నపం. తప్పులుంటే మన్నించాలి!’ అంటూ నక్క వినయంగా అక్కడే కూర్చుంది.

‘అమ్మ జన్మనిస్తుంది. కానీ పునర్జన్మ ఇచ్చిన వారు దైవంతో సమానం. ఇప్పుడు ఉడుత, నక్క కాపాడటం వల్ల ప్రాణాలు దక్కించుకుంది. కాపాడిన నక్కను ఉడుత గుర్తించాలి. అక్కడున్న కుందేలు, ఏనుగు, జింకలు, సాహసం చేసిన నక్కను తప్పక అభినందించాలి. కానీ మీరు అంత ఉదాసీనంగా ఎందుకు ప్రవర్తించారో నాకు తెలియాలి. తెలిసి తీరాలి!’ అంటూ మృగరాజు గర్జిస్తూ వాటి వంక చూసింది.

అప్పుడు ఏనుగు, కుందేలు, జింక, ఉడుత నక్క దగ్గరికి వెళ్లాయి. ‘మా తప్పు తెలిసింది. నీ విలువ అర్థమైందంటూ స్నేహపూర్వకంగా పలకరించాయి. మృగరాజా! మరొక్కసారి ఇలా ఒకరిని బాధ పెట్టేలా ప్రవర్తించం. తీరును బట్టి తోటి జీవిని ఆదరిస్తాం!’ అన్నాయి. ‘శెభాష్‌! మీ తప్పు మీరు తెలుసుకున్నారు. నక్కను ఆదరించారు.’ అని వాటిని అభినందించింది మృగరాజు.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని