తామరాకుపైన నీటిబొట్టు!

పూర్వం దివికోన అనే ఒక అందమైన అడవి ఉండేది. అసలే వేసవి కాలం. అప్పటివరకూ సూర్యుడు నిప్పులు కురిపించాడు. అంతలోనే మధ్యాహ్నం వేళ ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. దూరం నుంచి చల్లని గాలి వీచింది. కొద్దిసేపటికే చిటపట చినుకులతో మొదలైన వర్షం చూస్తుండగానే జోరందుకుంది.

Published : 05 Jun 2022 00:19 IST

పూర్వం దివికోన అనే ఒక అందమైన అడవి ఉండేది. అసలే వేసవి కాలం. అప్పటివరకూ సూర్యుడు నిప్పులు కురిపించాడు. అంతలోనే మధ్యాహ్నం వేళ ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. దూరం నుంచి చల్లని గాలి వీచింది. కొద్దిసేపటికే చిటపట చినుకులతో మొదలైన వర్షం చూస్తుండగానే జోరందుకుంది. వాన వెలిసిన తర్వాత చెట్ల ఆకులూ, కొమ్మలకు పట్టిన దుమ్మూ ధూళి కొట్టుకుపోయి పచ్చగా మెరిసిపోసాగాయి. వాతావరణం ఒక్కసారిగా అందంగా, ఆహ్లాదంగా మారిపోయింది.

ఆ అడవిలో ఉన్న చెరువులోని తామరాకుల్లో ఒకదానిపై నిలిచిన వాన చినుకు మెల్లిగా కళ్లు విప్పింది. ఆవిరి రూపంలో మేఘాల్లో దాగిన తాను, చల్లని గాలి తగిలి నీటి చుక్కగా మారి భూమి మీదకు జాలువారడం, ఆ వేగానికి భయంతో కళ్లు మూసుకోవడం దానికి గుర్తొచ్చింది. ఎక్కడ ఉన్నానా అని చుట్టూ చూసింది. తన స్వచ్ఛమైన రూపాన్ని చూసుకొని మురిసిపోయింది. చుట్టుపక్కల గమనిస్తే తనతో పాటు భూమిని చేరిన ఇంకొన్ని చినుకులు కాలిబాటపైన పడి బురదనీళ్లుగా మారాయి. చెరువులో పడిన మరికొన్ని చినుకులు మురికిగా ఉన్నాయి. కనుచూపు మేరలో ఉన్న పల్లెలోని చెట్లపైన, చేల గట్లపైన, మెట్లపైన చినుకులు దుమ్ము ధూళిమయమై జారుతూ కనిపిస్తున్నాయి. ఇళ్లపైన కురిసిన చినుకులు మట్టి రంగులో చూరు నుంచి కారుతున్నాయి.

వాటన్నింటినీ చూసి.. తామరాకుపైన నీటిబొట్టు అసహ్యించుకుంది. వాటివైపు ఈసడింపుగా చూస్తూ ‘ఎందుకలా ఒళ్లంతా దుమ్ముకొట్టుకుని ఉన్నారు.. మీకు శుభ్రత లేదా! ఇదిగో.. నన్ను చూడండి. ఎంత స్వచ్ఛంగా శుభ్రంగా తళతళలాడుతున్నానో!’ అంది గర్వంగా. దాని పొగరుబోతు మాటలకు చెరువులో, నేలపైన ఉన్న చినుకులు అవాక్కయ్యాయి. అవి జవాబు చెప్పడానికి నోరు తెరిచేలోగా.. తామరాకుపైన చినుకు ‘అన్నట్లు.. చాలా చినుకు మిత్రులు కనిపించట్లేదేం?’ అంది అసహనంగా, అనుమానంగా. కొలను ఒడ్డునున్న ఒక చెట్టు మెల్లిగా, చల్లగా ‘నేల వేడెక్కి ఉండటంతో మొదట రాలిన చినుకులు కొన్ని ఇంకిపోయాయి. వేడి రాళ్లపైన పడినవి వెంటనే ఆవిరైపోయాయి’ అంది. ‘ఆ చినుకులకు తప్పించుకోవడం తెలియదు.. తాజాగా ఉండటం కూడా నేర్వని అసమర్థులు’ అంటూ చులకనగా మాట్లాడింది తామరాకుపైన నీటిబొట్టు.

వర్షం పూర్తిగా తగ్గిపోవడంతో పల్లెటూరు నుంచి ఒక మనిషి చెరువువైపే రావడాన్ని గమనించింది తామరాకు పైనున్న నీటిబొట్టు. అతడు నేరుగా తనతో తెచ్చుకున్న తెప్ప సహాయంతో చెరువులోకి దిగాడు. దిగీదిగగానే మంచి మంచి తామరాకులను కోయసాగాడు. ద్రాక్షపళ్లు, చామంతి పువ్వులూ తదితరాలను అమ్మడానికి ఆ ఆకులనే ఉపయోగిస్తారని చెరువు చెప్పింది. అది విన్న చినుకు ఒక్కసారిగా హడలిపోయింది. తామరాకుపైన నీటి బొట్లు కొన్ని తెంపుతుండగానే జారి చెరువు నీటిలో కలిసిపోయాయి. ఈ చినుకు అదృష్టవశాత్తూ అప్పటికి తప్పించుకున్నా.. ఒడ్డుకు చేరిన మనిషి.. తెప్ప నుంచి ఆకులను బయటకు తీయగానే రాలి నేలపైన పడింది. చూస్తుండగానే క్షణాల్లో బురద అంటుకొని స్వచ్ఛతను కోల్పోయింది. ఏడుపు ముఖం పెట్టిన నీటి బొట్టుకు ఆలస్యంగానైనా జీవిత సత్యం బోధపడింది. తాను స్వచ్ఛంగా ఉండటంలో తన ఘనత ఏమీ లేదనీ, ఆకాశం నుంచి భూమి మీదకు పడిన ప్రదేశంతోపాటు అది తామరాకు గొప్ప అనీ తెలుసుకుంది. తన అవివేకానికి సిగ్గుపడుతూ.. అప్పటివరకూ చిన్నచూపు చూసిన చినుకులను క్షమాపణలు కోరింది.

- గుడిపూడి రాధికారాణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని