పరిశీలనే పాఠం!

మాస్టారు తొమ్మిదో తరగతి పాఠం చెప్పిన తరవాత సమయం మిగలడంతో కాసేపు పిల్లలతో మాట్లాడారు. ‘సృష్టిలో ప్రతి జీవికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే, చిన్న ప్రాణుల నుంచి కూడా నేర్చుకోవడానికి మంచి లక్షణాలు చాలా కనిపిస్తాయి’ అన్నారు. నరేంద్ర అనే విద్యార్థి ‘మాస్టారూ.. నిజంగానా?’ అడిగాడు సందేహంగా. ‘అనుమానమెందుకు?

Published : 11 Jun 2022 01:49 IST

మాస్టారు తొమ్మిదో తరగతి పాఠం చెప్పిన తరవాత సమయం మిగలడంతో కాసేపు పిల్లలతో మాట్లాడారు. ‘సృష్టిలో ప్రతి జీవికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే, చిన్న ప్రాణుల నుంచి కూడా నేర్చుకోవడానికి మంచి లక్షణాలు చాలా కనిపిస్తాయి’ అన్నారు. నరేంద్ర అనే విద్యార్థి ‘మాస్టారూ.. నిజంగానా?’ అడిగాడు సందేహంగా. ‘అనుమానమెందుకు? రేపు ఎలాగూ ఆదివారమే కదా.. ప్రయత్నించి చూస్తే మీకే తెలుస్తుంది’ నవ్వుతూ అన్నారు మాస్టారు.

సోమవారం పాఠశాల ప్రారంభం కాగానే, సైన్సు మాస్టారు నరేంద్రను నిలబెట్టి.. ‘నువ్వడిగిన ప్రశ్నకు జవాబు దొరికిందా?’ అనడిగారు. ‘ఇంటికి వెళ్లగానే ఆ విషయం మరచిపోయాను సార్‌’ అన్నాడు నరేంద్ర. ఇంతలో అతడి పక్కనే కూర్చున్న కార్తిక్‌ చెయ్యెత్తాడు. ఏంటో చెప్పమన్నారు మాస్టారు. ‘మా ఇంట్లో పంచదార కింద పడింది. కాసేపటికి ఒక చీమ వచ్చి పంచదార పలుకుని తీసుకుపోయింది. మరికాసేపటికి అక్కడికి చీమల దండు వచ్చింది. ఒక్కో పలుకు చొప్పున, చూస్తుండగానే దాదాపు మొత్తం పంచదారను మోసుకెళ్లాయి. వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వరస క్రమాన్ని పాటించాయవి. అయితే, అవి వెళ్లే దారిలో నేను ఓ గిన్నె అడ్డుపెట్టాను. దాంతో అవి పక్క నుంచి వెళ్లిపోయాయి తప్ప, ప్రయాణం మాత్రం ఆపలేదు’ వివరించాడు కార్తిక్‌.

‘దాన్నిబట్టి నీకేం అర్థమైంది?’ అనడిగారు మాస్టారు. పిల్లలంతా కార్తిక్‌ వైపు ఆసక్తిగా చూశారు. ఆహారం ఎక్కడుందో చీమలు త్వరగా గుర్తిస్తాయనీ, ఎక్కడికైనా వరస పద్ధతి పాటిస్తాయనీ, దారిలో ఏదైనా అడ్డం వస్తే ఆగిపోవనీ, ఐకమత్యంగా ఉంటాయని తెలిసింది’ చెప్పాడు కార్తిక్‌. ‘బాగా గమనించావు. చాలా విషయాలు తెలుసుకున్నావు’ అని మెచ్చుకున్నారు మాస్టారు. ‘ఇంకెవరైనా?’ అని మాస్టారు అడగ్గానే.. రాము నిలబడి, ‘మా దొడ్లో జామచెట్టు ఉంది. కాయలు కోద్దామని వెళ్లేసరికి ఒక సాలీడు గూడు అల్లుతూ కనిపించింది. గూడు కట్టే ప్రయత్నంలో అది చాలాసార్లు జారి కింద పడిపోయింది. ఒకసారి పెద్దగా గాలి వీచింది. దాంతో దారం తెగిపోయింది. మరోసారి చిన్న కొమ్మ విరగడంతో గూడు పూర్తి చేయలేకపోయింది. అలా ఆటంకాలు ఎన్ని ఎదురైనా పట్టు వదల్లేదా సాలీడు. ప్రయత్నం వదలకుండా చక్కని గూడు కట్టుకుని దర్జాగా అందులో ఇమిడిపోయింది’ అన్నాడు రాము.

‘నీకేం అర్థమైందో చెప్పు?’ అడిగాడు మాస్టారు. ‘ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వచ్చినా ఆగిపోకూడదనీ, ఎన్ని ప్రయత్నాలు చేసైనా సరే పని పూర్తి చేయాలని’ వివరించాడు రాము. బాగా చెప్పావని రామును మెచ్చుకున్నారు మాస్టారు. ఈసారి ఆయన అడగక ముందే రవి నిలబడ్డాడు. ‘నేనూ ఒకటి చెబుతాను మాస్టారూ’ అంటూ మొదలుపెట్టాడు. ‘మా పెరట్లో పూలమొక్కలే కాకుండా జామ, దానిమ్మ, వేప చెట్లున్నాయి. వేప చెట్టు కొమ్మల్లో తేనెటీగలు తేనెపట్టును పెట్టాయి. అక్కడ నుంచి తేనెటీగలు వచ్చి పువ్వుల మీద వాలాయి. ఒక్కో పువ్వు నుంచి మకరందాన్ని సేకరించి.. ఎగురుతూ తేనెపట్టులో దాచేసి మళ్లీ వెళ్లేవి. ఇంకో పువ్వు మీద వాలేవి. అలా రోజంతా విశ్రాంతి లేకుండా ఎగురుతూనే ఉన్నాయి. మకరందం తీసుకెళ్తూనే ఉన్నాయి’ అన్నాడు.

‘నీకేం అర్థమైంది?’ అని అడిగారు మాస్టారు. ‘తేనెటీగలకు బద్ధకం లేదని తెలిసింది. నిరంతరం శ్రమించడం వల్లే అంత తియ్యనైన తేనెను అందిస్తున్నాయి. మనం కూడా రోజంతా కష్టపడి ఉత్సాహంగా పనిచేసినప్పుడే.. ఫలితాలూ ఆ తేనెలాగా తియ్యగా ఉంటాయని బోధపడింది’ అన్నాడు రవి. ‘పిల్లలూ! నరేంద్ర అడగబట్టే కదా వీళ్ల ముగ్గురూ తెలుసుకున్న విషయాలను మనతో పంచుకున్నారు. దీన్నిబట్టి ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని తెలిసింది కదా. మీ స్నేహితులు చెప్పినట్టు మనుషులు కూడా చీమల్లా ఐకమత్యంగా ఉండాలి. కష్టపడి పని చేయాలి. తలో దారిలో వెళ్లకుండా ఒకే మాట, ఒకే బాటలా సాగాలి. పనిలో అడ్డంకులు వచ్చినా వదిలేయకుండా మరోసారి ప్రయత్నించాలి. అది పూర్తయ్యేవరకు సాలీడులా పట్టు విడవకూడదు. రేయింబవళ్లూ కష్టపడి తేనెటీగలు ఉత్పత్తి చేసిన తేనెను మనమే వాడుకుంటాం. అలాగే.. మనం కూడా ఎప్పుడూ మనకోసమే కాకుండా ఇతరులకూ ఉపయోగపడే పనులు చేస్తుండాలి. మీరు శ్రద్ధగా గమనిస్తే ప్రతి సంఘటనలోనూ మంచి విషయాలెన్నో కనిపిస్తాయి’ అంటూ అర్థమయ్యేలా చెప్పారు మాస్టారు. పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టి.. ‘అర్థమైంది మాస్టారూ.. మేము కూడా మాలో మంచి లక్షణాలు పెంచుకుంటాం’ అన్నారు.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు