అల్లరి కోతి... చిట్టి ఉడుత!

కొబ్బరి చెట్టు మీద నుంచి ‘ధడేల్‌’మంటూ ఒక కొబ్బరికాయ పడింది. తన తోకను రాసుకుంటూ.. అది పడటంతో ఉలిక్కిపడింది అప్పుడే చెట్టు ఎక్కబోతున్న చిట్టి ఉడుత. భయంతో గట్టిగా అరిచి, గబగబా కిందకు దిగేసింది. ‘హఠాత్తుగా కొబ్బరికాయ ఎందుకు పడిందా’  అనుకుంటూ పైకి చూసింది. ఒక కోతి కనిపించింది దానికి.

Published : 12 Jun 2022 03:16 IST

కొబ్బరి చెట్టు మీద నుంచి ‘ధడేల్‌’మంటూ ఒక కొబ్బరికాయ పడింది. తన తోకను రాసుకుంటూ.. అది పడటంతో ఉలిక్కిపడింది అప్పుడే చెట్టు ఎక్కబోతున్న చిట్టి ఉడుత. భయంతో గట్టిగా అరిచి, గబగబా కిందకు దిగేసింది. ‘హఠాత్తుగా కొబ్బరికాయ ఎందుకు పడిందా’  అనుకుంటూ పైకి చూసింది. ఒక కోతి కనిపించింది దానికి.

‘కొబ్బరికాయ కిందపడటం నీ పనేనా?’ కోపంగా కోతిని అడిగింది ఉడుత. ‘కాయ పండింది.. దానంతటదే నేల రాలింది.. ఇందులో నా తప్పేముంది?’ అంటూ దురుసుగా జవాబిచ్చిందే కాకుండా చెట్టు పైన దర్జాగా కూర్చుంది కోతి. ‘చెట్టు మీద నేలరాలిపోయే కాయలు లేవని నాకు తెలుసు.. నువ్వే కావాలని కాయను నా మీద పడేశావని అనుమానం కలుగుతోంది.. నా తోకను తాకుతూ పడింది కనుక ప్రాణాపాయం తప్పింది. ఇతరులను ఇబ్బంది పెట్టడం అల్లరి అనిపించుకోదు’ అంటూ అల్లరి కోతికి హితవు చెప్పింది ఉడుత.

‘చెట్టు మీద నేనున్నాను కనుక నేనే కాయను పడేశానని నిందలు వేయడం న్యాయం కాదు. అనవసరంగా నా మీద అభాండాలు వేస్తే ఊరుకోను’ లోలోపల నవ్వుకుంటూనే, లేని కోపం నటిస్తూ అంది కోతి.

‘నిజం చెప్పేవారితో మాట్లాడవచ్చు కానీ.. అబద్ధాన్ని నిజం చేయాలనుకునే వారితో వాదించి ప్రయోజనం లేదు’ అని ఊరుకుంది ఉడుత. ‘హమ్మయ్యా.. పథకం ప్రకారం కొబ్బరికాయను పడేసి భలేగా తప్పించుకున్నానులే!’ అని మనసులో అనుకుంటూ మురిసిపోయింది కోతి. కొంత సమయం గడిచింది. అల్లరి కోతి కొబ్బరి చెట్టు మీద నుంచి వెళ్లిపోబోతుండగా.. ‘కోతి బావా.. ఎక్కడకు వెళ్తున్నావు?’ తన సహజ రీతిలో ఆప్యాయంగా అడిగింది ఉడుత.

‘పక్క ఊరిలో ఉన్న మా బంధువుల దగ్గరకు వెళ్తున్నా’ అంటూ సమాధానమిచ్చింది కోతి. ‘అంటే.. చాలా దూరమే వెళ్తున్నావు.. దారిలో ఆకలి వేస్తే ఇది తిను’ అంటూ ఒక చిన్న మూటను దాని చేతికి అందించింది ఉడుత.
ఉడుత ఇచ్చిన మూటను అనుమానాస్పదంగానే తీసుకుంది కోతి. ఉడుత కళ్లెదుటే దాన్ని విప్పసాగింది. ‘ఇప్పుడెందుకు మూటను విప్పుతున్నావు?’ ఆశ్చర్యపోతూ అడిగింది ఉడుత. ‘కంగారు పడకు మిత్రమా.. చెబుతా’ అంటూ మూటను పూర్తిగా విప్పింది కోతి. ఆ మూటలో ఉన్న జామ పండ్లను చూసి.. దానికి ఆశ్చర్యంతోపాటు ఆనందం కూడా కలిగింది. ‘నా అల్లరిలో భాగంగా నేను నీ మీద కొబ్బరికాయను పడేశాను.. ఆ విషయం నీకూ అర్థమైందని నాకు తెలుసు. ఆ కోపంతో నువ్వు నాకు ఇచ్చిన మూటలో ఆహారానికి బదులు, రాళ్లు ఏమైనా పెట్టావేమోనని అనుమానంతో నీ ముందే విప్పాను’ అంటూ నాలుక్కరుచుకుంది కోతి.

‘‘చూశావా.. కోతి బావా! ‘పాతి పెట్టిన బీజం, దాచిపెట్టిన నిజం దాగవు’ అని పెద్దలంటుంటారు. నీ తప్పును నువ్వే ఒప్పుకొన్నావు. అది చాలు నాకు. నువ్వు నన్ను ఏడిపించావనీ.. నేనూ నిన్ను ఏడిపిస్తే, అది మన మధ్య శత్రుత్వానికి దారి తీస్తుంది. అప్పుడు నీకూ, నాకూ తేడా ఏముంటుంది.. ఒకరిని ఏడిపించడం గొప్ప కాదు. మంచి మనసుతో, నిస్వార్థ పనులతో ఆకట్టుకోవడం నిజమైన గొప్పతనం. అందులోనే అసలైన ఆనందం ఉంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను. తరవాత ఇక నీ ఇష్టం. చెట్టు మీదకు కొత్తగా వచ్చావని నీకు అతిథి మర్యాదలు చేశాను. నాకు తృప్తిగా ఉంది. మీ బంధువుల ఇంటికి వెళ్తున్న నువ్వు.. తిరిగి ఇక్కడకు ఎప్పుడైనా.. ఏ పరిస్థితుల్లోనైనా రావచ్చు. జాగ్రత్తగా వెళ్లిరా’ అని చెప్పింది ఉడుత.

బుజ్జి ఉడుత మాటలతో కోతికి కనువిప్పు కలిగింది. తాను చేసిన తప్పేమిటో తెలుసుకుంది. సిగ్గుతో తలదించుకుంది. ‘ఇబ్బంది పెట్టినా.. నన్ను ఆదరించి ఆహారం పెట్టావు. నా కళ్లు తెరిపించావు. ఇంకెప్పుడూ ఒకరు ఇబ్బంది పడేలా ప్రవర్తించను. బంధువులతో నీ గురించి, నీ మంచితనం గురించి చెబుతాను. తిరిగి ఇక్కడికే వస్తాను’ అంటూ కృతజ్ఞతా భావంతో ఉడుత వైపు చూస్తూ.. అక్కడి నుంచి కదిలింది కోతి.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని