నెరవేరని కోరిక!

సహ్యాద్రిపురాన్ని భీమశంకరుడు అనే రాజు పాలిస్తుండేవాడు. అతనికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఎప్పటికైనా సరే పక్షుల మాదిరి గాల్లో ఎగరాలి అనుకునేవాడు. ఇదే విషయాన్ని రాజగురువుతో చెప్పాడు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పినా రాజు వినిపించుకోలేదు.

Published : 13 Jun 2022 01:07 IST

సహ్యాద్రిపురాన్ని భీమశంకరుడు అనే రాజు పాలిస్తుండేవాడు. అతనికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఎప్పటికైనా సరే పక్షుల మాదిరి గాల్లో ఎగరాలి అనుకునేవాడు. ఇదే విషయాన్ని రాజగురువుతో చెప్పాడు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పినా రాజు వినిపించుకోలేదు.

తన కోరికను నెరవేర్చుకోవడం కోసం చాలా ధనాన్ని వృథా చేశాడు. కానీ తన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అయినా వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా సరే గాలిలో ఎగరాలనే బలమైన కోరికతో మంత్రి ద్వారా రాజ్యంలో దండోరా వేయించాడు. ‘ఎవరైతే రాజుగారిని గాల్లో పక్షి మాదిరిగా ఎగరగలిగేలా చేస్తారో.. వారికి రాజ్యంలో కొంత ప్రాంతం రాసిస్తాం’ అని దాని సారాంశం.

అది విన్న వారు ఎంతో ఆశ్చర్యపోయారు. ‘అయినా ఎవరు గాల్లోకి ఎగరగలరు? మనమే గాల్లోకి ఎగరలేం, ఇంకా ఆయన్ను ఎగిరేలా చేయడం సాధ్యం కాదులే’ అని ఊరుకున్నారు.

ఇలా కొంతకాలం గడిచింది. ఎవరూ ముందుకు రాకపోయేసరికి ఇక లాభం లేదని రాజు అనుకున్నాడు. మహామంత్రి మీద రాజ్యభారం ఉంచి కొంత మంది అనుచరులతో కలిసి భీమశంకరుడు హిమాలయాలకు బయలుదేరాడు. అక్కడున్న కొంతమంది సాధువులు తపస్సు ద్వారా గాలిలో ఎగరగలరని ఎవరి ద్వారానో తెలుసుకుని, తాను కూడా అలా చేయాలనుకోవడమే దానికి కారణం.

మార్గమధ్యలో ఎన్నో అవరోధాలు అధిగమించాడు. తనతోపాటు వచ్చిన వారందరినీ కోల్పోయి, చివరకు తానొక్కడే అతికష్టం మీద హిమాలయాలకు చేరాడు.

అక్కడ మహా వృక్షం కింద తపస్సు చేస్తున్న ఓ సాధువును కలిసి తన కోరికను చెప్పాడు. ‘నువ్వు చాలా కార్యదీక్ష గలవాడవు నాయనా! అందుకే ఇంతదూరం ఎంతో కష్టపడి వచ్చావు. నీలోని కోరిక బలంగా ఉంది.. అయితే అది నెరవేరడం చాలా కష్టం. అయినా సరే నేను చెప్పినట్లు చేసిచూడు. నువ్వు నీ మనసులో ఉన్న అన్ని కోరికలు త్యజించి ప్రశాంతంగా దేవుణ్ని ధ్యానించు. కొన్ని రోజుల్లోనే నువ్వు గాల్లో ఎగరగలవు’ అని తను ధ్యానంలో మునిగిపోయాడు. సాధువు చెప్పిన విధంగానే కోర్కెలు లేని మనసుతో ధ్యానించసాగాడు భీమశంకరుడు. కొంతకాలం గడిచింది.

ఒక రోజు గాల్లో చుట్టూ అనేక పక్షుల మధ్య తాను కూడా ఒక పక్షిలాగా ఎగురుతున్నట్లు మధురమైన అనుభూతిని పొందాడు. తర్వాత తన ధ్యానం ముగించుకుని, తనకు సహాయం చేసిన సాధువు వద్దకు వెళ్లాడు.

‘నేను మీ దయ వల్ల గాలిలో ఎగర గలిగాను. నా కోరిక తీరింది ధన్యవాదాలు’ అన్నాడు. ‘ఓ రాజా! కోరికలు ప్రతి ఒక్కరికీ ఉండాలి, అవి లేకపోతే మనిషి జీవితమే ఉండదు. కానీ, అవి మన జీవన కొనసాగింపునకు తోడ్పడాలి. అవి మనల్ని దహించి వేసి, మన మనుగడను ప్రశ్నార్థకం చేసేవిగా ఉండొద్దు. కోరికలు ఏవైనా సరే వాటి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకునే వివేకం ఉండాలి. ఒకవేళ మనకు ఆ వివేకం లేకపోతే ఎవరైనా చెప్పినా ఒకసారి ఆలోచించగలగాలి. అంతేగాని మూర్ఖంగా ఉండరాదు. నువ్వు నీ రాజగురువు చెప్పినా వినకుండా ఇక్కడ దాకా వచ్చావు. మార్గ మధ్యలో నీ వెంట వచ్చిన వారందరి మరణానికి కారకుడవయ్యావు’ అన్నాడు ఆ సాధువు.

‘మన్నించండి.. సాధుపుంగవా! నేను, నా తప్పు తెలుసుకున్నాను. ఇక నుంచి సాధ్యం కాని కోర్కెలతో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా రాజ్యపాలన చేస్తాను. చివరగా నాకో సందేహం. గాలిలో ఎలా ఎగిరానో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. మళ్లీ ప్రయత్నం చేస్తుంటే నావల్ల సాధ్యపడటం లేదు. నా అనుమానాన్ని నివృత్తి చేయండి స్వామీ’ అన్నాడు భీమశంకరుడు. ‘నాయనా! నిజానికి నువ్వు గాలిలో ఎగరలేదు. ధ్యానంలో ఉన్న నీ మనస్సు గాలిలోకి ఎగిరింది. దానివల్ల నువ్వే గాల్లో విహరించిన అనుభూతిని పొందావు.. అంతే’ అన్నాడు సాధువు. రాజు ఒక్కసారి నివ్వెరపోయాడు. సాధువు తిరిగి ధ్యానంలో మునిగిపోయాడు. చేసేది లేక రాజు తన రాజ్యం దిశగా అడుగులు వేశాడు.

- ఏడుకొండలు కళ్లేపల్లి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని