వడ్రంగి పిట్టలు

డు వడ్రంగి పిట్టలు శేషాచల అరణ్యంలోని దట్టమైన ప్రాంతానికి వచ్చాయి. అక్కడ ఒక అనువైన చెట్టును ఎంచుకున్నాయి. మగ వడ్రంగి పిట్ట తన ముక్కుతో చెట్టు బెరడును పొడుస్తూ, గూడు తయారు చేసే ప్రయత్నం మొదలు పెట్టింది. పరిసరాల్లోని ఇతర పక్షులు, అది చేసే పనిని ఆసక్తిగా గమనించసాగాయి.వడ్రంగి పిట్టల జంట దేనితోనూ మాట్లాడడం లేదు. కనీసం పలకరించలేదు కూడా!

Published : 14 Jun 2022 01:35 IST

రెండు వడ్రంగి పిట్టలు శేషాచల అరణ్యంలోని దట్టమైన ప్రాంతానికి వచ్చాయి. అక్కడ ఒక అనువైన చెట్టును ఎంచుకున్నాయి. మగ వడ్రంగి పిట్ట తన ముక్కుతో చెట్టు బెరడును పొడుస్తూ, గూడు తయారు చేసే ప్రయత్నం మొదలు పెట్టింది. పరిసరాల్లోని ఇతర పక్షులు, అది చేసే పనిని ఆసక్తిగా గమనించసాగాయి.

కానీ వడ్రంగి పిట్టల జంట దేనితోనూ మాట్లాడడం లేదు. కనీసం పలకరించలేదు కూడా! వాటి ప్రవర్తన వీటికి ఆశ్చర్యం కలిగించింది. పక్షులన్నీ కాస్త దూరంగా ఒకచోట చేరి... ‘మామూలుగా అయితే ఇవి కలివిడిగా ఉండే పక్షులే! కొత్త ప్రదేశానికి వచ్చాయి కాబట్టి, కాస్త సిగ్గుపడడం సహజం. అవి సరిగా మాట్లాడటం లేదని ఎవరూ కోపగించుకోకూడదు. రెండు, మూడు రోజులకు అవి మామూలుగా మారతాయి. అప్పటికీ అలాగే ఉంటే వాటి ప్రవర్తనకు ఏదో కారణం ఉందని అనుకోవచ్చు. అప్పుడు కాస్త మెల్లగా అడిగి అదేంటో తెలుసుకుందాం. అవి పలకరించకపోయినా మనం మామూలుగానే ఉందాం’.. ఇలా పక్షులన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. 

పక్షులు.. వడ్రంగి పిట్టలకు కాస్త ఆహారం తెచ్చిపెట్టాయి. వడ్రంగి పిట్టలు తొలుత వద్దన్నా... బతిమాలాక తీసుకున్నాయి. కొద్దిరోజులకల్లా మగ వడ్రంగి పిట్ట బెరడును తొలచి గూడును తయారు చేసింది. ఆడ వడ్రంగి పిట్ట ఆ గూట్లో గుడ్లను పెట్టింది. పక్షులన్నింటికీ ఎంతో ఆనందం కలిగింది. మగ పిట్ట ఆహారానికి వెళ్లినప్పుడు... పక్షులు వంతులవారీగా ఆడ వడ్రంగి పిట్టకు, గుడ్లకు కాపలాగా ఉన్నాయి. పక్షులతో స్నేహం పెరిగాక, తాము అక్కడికి వచ్చిన కారణాన్ని చెప్పాయి వడ్రంగి పిట్టలు. 

‘ఇంతకు మునుపు ఉన్న చోట మాకు శత్రువుల బాధ ఎక్కువ. అక్కడ ఉండలేమని నిర్ణయించుకున్నాకే చాలా దూరం ప్రయాణించి ఇదిగో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా శత్రు భయం ఉంటుందేమోనన్న అనుమానంతో, తొలుత మీతో అంటీముట్టనట్లుగా ఉన్నాం. అయితే మీరెంత స్నేహశీలురో మాకు అర్థమైంది. మీలాంటివారు స్నేహితులుగా లభించడం మా అదృష్టం’ అని వడ్రంగి పిట్టలు అన్నాయి.

వాటి మాటల్లో ఎంతో సంతోషం కనిపించింది. పక్షులకు కూడా మొదట్లో అవి మౌనంగా ఉండడానికి కారణం తెలిసింది. ‘మీరు ఇక్కడ ఎంతకాలమైనా ఉండొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు’ అని పక్షులు మరింత భరోసాను ఇచ్చాయి.
కొద్దిరోజులకు గుడ్ల నుంచి బుల్లి వడ్రంగి పిట్టలు బయటకు వచ్చాయి. పక్షులకు ఎంతో సంతోషం వేసింది. వీనులవిందుగా పాటలు కూడా పాడాయి. ఆప్తులైన పక్షులకు ఏదైనా బహుమతినివ్వాలని వడ్రంగి పిట్టలు అనుకున్నాయి. బహుమతి గురించి ఆలోచించినప్పుడు.. గూడు కట్టుకోవడం చేతగాక, ఎండకు, వానకు, చలికి దొరికిన చోట తల దాచుకునే కొన్ని పక్షులు వాటికి గుర్తొచ్చాయి.

వడ్రంగి పిట్టలు కొత్తగూడును తయారు చేసుకుని... ‘మా పాత గూడును ఇక మీరు వాడుకోండి. మేము కొత్తదానిలోకి వెళతాం’ అని పాతగూడును వాటికి ఇచ్చాయి. అలా ప్రతి సంవత్సరం.. వడ్రంగి పిట్టలు తాము ఉండే గూడును పక్షులకిచ్చి, కొత్తది తయారు చేసుకుంటూ... అన్నింటితో కలిసిమెలిసి ఆనందంగా ఉన్నాయి.

- హర్షిత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని