జంతు ప్రేమ!

‘భలే ఉందమ్మా.. దీన్ని ఇంటికి తీసుకెళ్లి పెంచుకుందాం’ చెట్టు కింద దెబ్బతిని పడి ఉన్న ఉడుత పిల్లను వాళ్లమ్మకు చూపిస్తూ గోముగా అడిగాడు అయిదేళ్ల చరణ్‌. ‘దాన్ని వాళ్ల అమ్మ దగ్గర నుంచి విడదీయకూడదు. అదీకాక, అది మనకు మచ్చిక అవదు. అందుకే అలా వదిలెయ్యి.

Published : 15 Jun 2022 00:29 IST

‘భలే ఉందమ్మా.. దీన్ని ఇంటికి తీసుకెళ్లి పెంచుకుందాం’ చెట్టు కింద దెబ్బతిని పడి ఉన్న ఉడుత పిల్లను వాళ్లమ్మకు చూపిస్తూ గోముగా అడిగాడు అయిదేళ్ల చరణ్‌. ‘దాన్ని వాళ్ల అమ్మ దగ్గర నుంచి విడదీయకూడదు. అదీకాక, అది మనకు మచ్చిక అవదు. అందుకే అలా వదిలెయ్యి. వాళ్లమ్మ వచ్చి తీసుకెళ్తుంది’ వారించింది తల్లి. ‘మరి మనింట్లోకి టామీని బుజ్జిగా ఉన్నప్పుడేగా తీసుకొచ్చాం. ఇప్పుడు అలవాటైపోయింది.. అలాగే ఇదీ అవుతుందిలే!’ ఎలాగైనా తన మాట నెగ్గించుకోవాలని అడిగాడు చరణ్‌.  
‘తల్లి పాలతో పాటు బయటి పాలూ తాగే శక్తి వచ్చాకే దాన్ని మనింటికి తీసుకొచ్చాం. ఇళ్లలో పెంచుకునే జీవులు కొన్ని మాత్రమే ఉంటాయి. మిగిలిన వాటిని అలా స్వేచ్ఛగా విడిచిపెట్టడమే మంచిది’ అని తల్లి వివరించడంతో.. ‘ఎందుకు?’ అంటూ ప్రశ్నించాడు చరణ్‌. ‘మనం వాటికి సరిపడే ఆహారం, వసతిలాంటివి కల్పించలేం’ జవాబిచ్చిందామె. ‘ఎందుకు కల్పించలేం? వాటికి కావాల్సింది గింజలు, గడ్డి లాంటివే కదా. పడేస్తే సరి. అవే ఉంటాయి. కావాలనుకున్నపుడు ఆడుకోవచ్చు. వద్దంటే వదిలేయవచ్చు’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు చరణ్‌.

‘జంతువులే కదా.. వాటికి మాటలు కూడా రావని అలా చులకనగా మాట్లాడకూడదు. వాటినీ గౌరవించాలి. ఆహారాన్ని అలా విసిరేయడం సరికాదు. కాస్తయినా భూతదయ ఉండాలి’ మందలించింది తల్లి. ‘భూతాలంటే..?’ భయంగా అడిగాడు కొడుకు. ‘భూతాలు అంటే ప్రాణులు అని అర్థం. మనం ఇతర ప్రాణుల పట్ల దయతో ఉండటాన్ని భూతదయ అంటారు’ వివరించింది తల్లి. ‘ఇతర ప్రాణుల మీద దయ చూపించడం ఎందుకు?’ అడిగాడు కొడుకు. ‘అవీ మనలాంటి ప్రాణులే కాబట్టి వాటినీ ప్రేమగా చూడాలి. వాటంతట అవే బతుకుతున్నా.. జీవ వైవిధ్యాన్ని రక్షించగలిగే శక్తి మనుషులకే ఉంది. అందుకే ఇతర ప్రాణులకు అవసరమైన సాయంతోపాటు రక్షణా అందించాలి’ చెప్పింది తల్లి.

‘అంటే ఏం చేయాలి?’ మళ్లీ అడిగాడు కొడుకు. ‘వాటి మనుగడకు మనం ముప్పు కలిగించకూడదు. అవి ఇబ్బందులు, ఆపదల్లో ఉంటే చేతనైన సాయం చేయాలి’ అని తల్లి వివరించింది. ‘అంటే.. వేసవి కాలంలో పక్షుల కోసం గింజలు, కప్పుల్లో నీళ్లు ఉంచడం, వీధి కుక్కలకూ, పిల్లులకూ ఆహారం వేయడంలాంటివి చేస్తున్నాం కదా.. అలాగేనా?’ తనకు తెలిసినవి చెప్పాడు చరణ్‌. ‘సరిగ్గా చెప్పావు. అంతే కాకుండా, ఆయా ప్రాణులు అంతరించి పోకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యతా మనదే’ అని తల్లి అనడంతో ‘అంతరించిపోవడం అంటే..?’ మరో సందేహం అడిగాడు. ఆ ప్రాణి పుట్టుక భూమి మీద లేకుండా పోవడమనీ తల్లి చెప్పడంతో ‘అదెలా జరుగుతుంది.. అయినా ఇంత చిన్న ప్రాణులు అంతరించిపోతే నష్టం ఏంటి?’ అడిగాడు చరణ్‌.
‘చాలా ఉంది. ఉదాహరణకు వానపాముల లాంటివి భూమిని గుల్లగా చేసి రైతులకు మేలు చేస్తున్నాయి. కానీ రసాయన మందులు, ఎరువుల వల్ల అవి నశించిపోతున్నాయి. అలాగే ప్రపంచంలో అన్ని ప్రాణులూ ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంటాయి. కాబట్టి వాటిని రక్షించుకోవాలి’ చెప్పింది తల్లి. ‘మనం ఎలా రక్షించగలం?’ అని కొడుకు అడగడంతో ‘మనింట్లో ఉపయోగించిన నీటిని ఏం చేస్తున్నాం.. అందరిలా డ్రైనేజీలోకి కాకుండా, పెరట్లోని మొక్కలకు వెళ్లేలా చేశాం. అలాగే.. నేలమీద పడిన గింజలు, ఇతర ఆహార పదార్థాలను చెత్తకుప్పలో వేయకుండా జంతువులకు అందించాలి’ అని వివరించింది తల్లి.

‘వాడిన నీటిని మొక్కలకు మళ్లించడం వల్ల తాజా కూరగాయలు పండుతున్నాయి. కానీ ఈ జీవులకు అవన్నీ వేస్తే మనకేంటి లాభం?’ అని అమాయకంగా అడిగాడు చరణ్‌. ‘పిచ్చుకల లాంటి ప్రాణులు మనం చూపించే ఆదరణ, పెట్టే ఆహారం కోసం ఇంటి పరిసరాలకు వస్తాయి. వాటి వల్ల మన మనసుకు ఆనందం, మంచి కాలక్షేపం. దాంతోపాటు అన్ని ప్రాణులనూ ప్రేమించే గుణం అలవాటవుతుంది’ అంది తల్లి. ‘మరి పులి, సింహం, ఏనుగులాంటి క్రూర జంతువులను రక్షించక్కర్లేదా?’ అని కొడుకు ప్రశ్నించగా.. ‘వాటినీ కాపాడాల్సిందే. అవి అడవుల్లో నివసిస్తాయి కాబట్టి చెట్లను కొట్టేయకుండా రక్షణగా నిలుస్తాయి. పచ్చదనం బాగా ఉంటేనే వర్షాలు సక్రమంగా కురుస్తాయి’ చెప్పింది తల్లి.

‘అమ్మో! చిన్న ప్రాణులంటే ఏమో అనుకున్నాను కానీ వాటి గురించి ఇన్ని విషయాలు ఉన్నాయా?’ ఆశ్చర్యంగా అడిగాడు చరణ్‌. మరేమిటనుకున్నావు.. అందుకే, నువ్వు నిజంగా దేనినైనా ప్రేమిస్తే.. దాన్ని స్వేచ్ఛగా వదిలేయమని పెద్దవాళ్లు చెబుతుంటారని ముగించింది తల్లి.

- ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు