సర్కారు బడిలో కిడ్డీ బ్యాంకు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు ఇంట్లో ఇచ్చే పాకెట్‌ మనీతో ఇష్టమైన చాక్లెట్లో, బిస్కెట్లో, లాలీపాప్‌లో కొనుక్కుంటాం. కొందరైతే ఆ డబ్బుల్లో కొంత మొత్తాన్ని.. ఇంట్లోని కిడ్డీ బ్యాంకులో దాచుకుంటారు. అయితే,  

Published : 15 Jun 2022 00:29 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు ఇంట్లో ఇచ్చే పాకెట్‌ మనీతో ఇష్టమైన చాక్లెట్లో, బిస్కెట్లో, లాలీపాప్‌లో కొనుక్కుంటాం. కొందరైతే ఆ డబ్బుల్లో కొంత మొత్తాన్ని.. ఇంట్లోని కిడ్డీ బ్యాంకులో దాచుకుంటారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒకలాంటి కిడ్డీ బ్యాంకే. కానీ, దానికో ప్రత్యేకత ఉంది. అబ్బా.. అన్నీ ఇక్కడే చెప్పేస్తారు మరి! ఆ వివరాలు తెలుసుకోవాలంటే, గబగబా ఇది చదివేయండి.

కర్నాటక రాష్ట్రంలో ముల్లూరు అనే ఒక పల్లెటూరు ఉంది. అక్కడి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కోసం.. విద్యార్థుల చేత.. విద్యార్థులే నిర్వహిస్తున్న ఓ కిడ్డీ బ్యాంకు ఉంది. పిల్లలకు చిన్నతనం నుంచే పొదుపు ఆవశ్యకతతో పాటు బ్యాంకుల పనితీరునూ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ బడిలోని ఉపాధ్యాయులే ఇటీవల దాన్ని ప్రారంభించారు.

సొంతంగా పాస్‌బుక్‌, చెక్‌బుక్‌  
ఈ పాఠశాలలోని విద్యార్థుల్లో ప్రస్తుతం దాదాపు 37 మంది ఈ కిడ్డీ బ్యాంకులో పొదుపు ఖాతాలను ప్రారంభించారు. వారిలో ఒక్కొక్కరికీ ఒక్కో లాకర్‌ను కేటాయించిన ఉపాధ్యాయులు.. వాటిపైన ఆయా విద్యార్థుల పేర్లూ రాయించారు. అలాగనీ, అదేదో అల్లాటప్పాగా అని అనుకోకండి ఫ్రెండ్స్‌.. పిల్లలు దాచుకునే డబ్బుల వివరాలన్నీ పాస్‌బుక్‌లో నమోదు చేస్తారు. చెక్‌బుక్‌ కూడా వీళ్లే సొంతంగా తయారు చేసుకున్నారు. ఆ విద్యార్థుల్లోనే ఒకరు ఈ బ్యాంకుకు క్యాషియర్‌గా, మరొకరు మేనేజర్‌గా వ్యవహరిస్తుంటారట.

ఎంత దాస్తే.. అంత మేలు
‘స్కూల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ముల్లూరు (ఎస్‌బీఎం)’గా పిలిచే ఈ కిడ్డీ బ్యాంకులో ఎంత ఎక్కువ పొదుపు చేస్తే అంత లాభం ఉందని టీచర్లు చెబుతున్నారు. రూ.100 పొదుపు చేసిన వారికి పెన్సిళ్లూ, రూ.200 దాస్తే పెన్నులూ ఇస్తారట. అదే, దాచుకున్న మొత్తం రూ.500 దాటితే.. అయిదు శాతం వడ్డీ కూడా చెల్లిస్తారట. అలా రూ.1000 పొదుపు చేస్తే, ఆ మొత్తాన్ని సదరు విద్యార్థి అసలైన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు. ఒకవేళ ఏ అవసరానికైనా పొదుపు చేసిన డబ్బుల్లోంచి కొంత తీసుకోవాలంటే.. చలాన్‌లో ఏ అవసరమో రాసి, చెక్‌ ద్వారా విత్‌డ్రా చేసుకోవాలి. ఇప్పటినుంచే విద్యార్థులకు పొదుపు అలవాటు చేస్తే.. పెద్దయ్యాక డబ్బుల విషయంలో తెలివిగా వ్యవహరించగలరని ఈ బడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇవండీ ఈ కిడ్డీ బ్యాంకు సంగతులు! మనం కూడా ఈరోజు నుంచే పొదుపును ప్రారంభిద్దాం ఫ్రెండ్స్‌..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని