టక్కరి నక్క.. చిక్కు లెక్క!

తెలివితేటల్లో తనను మించిన జంతువు లేదని మృగరాజు ముందు డప్పు కొట్టుకునేది నక్క. సమయం దొరికినప్పుడల్లా తనను మంత్రిని చేయమని ఒత్తిడి చేసేది. నీ తెలివితేటలు నిరూపించుకుంటేనే మంత్రి పదవి ఇస్తాననేది సింహం. దాంతో మృగరాజు వెంటే తిరుగుతూ.. తన తెలివితేటలను ప్రదర్శించేందుకు తంటాలు పడుతుండేది

Updated : 18 Jun 2022 06:47 IST

తెలివితేటల్లో తనను మించిన జంతువు లేదని మృగరాజు ముందు డప్పు కొట్టుకునేది నక్క. సమయం దొరికినప్పుడల్లా తనను మంత్రిని చేయమని ఒత్తిడి చేసేది. నీ తెలివితేటలు నిరూపించుకుంటేనే మంత్రి పదవి ఇస్తాననేది సింహం. దాంతో మృగరాజు వెంటే తిరుగుతూ.. తన తెలివితేటలను ప్రదర్శించేందుకు తంటాలు పడుతుండేది నక్క. ఒకరోజు మృగరాజుతోపాటు వెనకే నడుస్తున్న నక్కకు, కొండల పక్కనున్న దట్టమైన పొదల్లోకి ఒక కుందేళ్ల గుంపు దూరడం కనిపించింది. ‘మృగరాజా! వేటాడకుండా కుందేళ్లు నోటికి ఆహారమయ్యే ఉపాయం నా దగ్గర ఉంది. అవి మీ నోటికి అందాక, నాకు మంత్రి పదవిని కానుకగా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి’ అంటూ ఒకింత దర్పం ప్రదర్శించింది నక్క. అయితే, ‘నీ తెలివితేటలు నాకు చూపిస్తానంటావు’ నవ్వుకుంటూ అంది మృగరాజు. ‘చిత్తం, మీరు కుందేళ్లకు కనిపించకుండా చెట్టు నీడన విశ్రాంతి తీసుకోండి. నా బుర్రతో వాటిని బయటకు రప్పించి, మీకు పసందైన విందు ఏర్పాటు చేస్తాను’ అని నక్క మాటివ్వడంతో సింహం సరేనంది.

‘ఒక కుందేలు నా నోటికి చిక్కిందోచ్‌..’ అంటూ పొదల దగ్గర హంగామా చేయసాగింది నక్క. పాపం కుందేళ్లు.. తమలో ఎవరికి మూడిందోనని బాధపడ్డాయి. ఘటికుడైన కుందేళ్ల నాయకుడు గుంపులో సభ్యులను లెక్కించింది. సంఖ్య సరిపోవడంతో, అవి నక్కజిత్తులని దానికి అర్థమైంది. ఎలాగైనా తన గుంపును రక్షించుకోవాలనుకుంది. మిగిలిన కుందేళ్లకు విషయం చెప్పి.. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దంది. తరవాత నక్కకు దూరంగా, పొదల నుంచి తల బయట పెట్టి ‘ఓ నక్క బావా! వలస వచ్చిన బక్క ప్రాణులం. పరాచికాలతో భయపెట్టొద్దు. ఇక్కడ మృగరాజు ఆదరిస్తారని ఆశతో వచ్చాం. అందుకోసం నీ సాయం కోరుతున్నాను’ అంటూ ప్రాధేయపడినట్టు అడిగింది. ‘నాలాంటి తెలివైన వారి సాయం ఊరికే దొరకదు’ మెలిక పెట్టింది నక్క. ‘అయితే ఏం చేయాలో చెప్పు?’ అడిగింది కుందేళ్ల నాయకుడు. మీరెంత మంది ఉన్నారో, అందులో సగం నాకు లొంగిపోవాలని షరతు పెట్టింది నక్క. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మూతి ముడుచుకుంది కుందేలు.

‘మౌనంగా ఉంటే పనులు జరగవు. ఈ అడవి మాకు మాత్రమే సొంతం. ఇతరులు ప్రవేశిస్తే మృగరాజు కచ్చితంగా శిక్షిస్తారు. ఇంతకీ మీరెంత మందో చెబితే నా తెలివితేటలతో మిమ్మల్ని రక్షిస్తాను. నా వాటాలో మార్పు లేదు’ అంటూ తేల్చేసింది నక్క. చిక్కు లెక్కతో నక్క ఎత్తులను తిప్పికొట్టాలనుకుంది కుందేలు. ‘మేమా.. వరసకు అయిదుగురు నిలబడితే ఒకరు మిగులుతారు. నలుగురైతే మళ్లీ ఒక్కరే మిగులుతారు. ముగ్గురు నిలబడితే ఏ ఒక్కరూ మిగలరు. తెలివైనదానివి కాబట్టి మా సంఖ్య నువ్వు చిటికెలో చెప్పేయగలవు’ అంది. అది విన్న సింహం, నక్క ఎంత తెలివిగలదో చూద్దామనుకుంది. నక్క లెక్కలేయడం మొదలు పెట్టింది.. ఏమంత సులువనిపించలేదు.. ఏదో ఒకటి చెప్పేద్దామంటే సింహం ముందు తన బండారం బయటపడుతుంది.. ఇక సులువైన మార్గంలో కుందేళ్ల సంఖ్య తెలుసుకోవాలనుకుంది.. దాంతో ‘తిక్క లెక్కలతో నన్ను బురిడీ కొట్టించలేరు. మీరంతా ఒక్కొక్కరుగా గట్టిగా అరవండి. నా లెక్కలు నేను చూసుకోగలను’ అంటూ దబాయించింది నక్క.

అలాగేనంటూ.. ఒక్కో కుందేలును గొంతుమార్చి రెండుసార్లు అరవమని ఆదేశించాడు వాటి నాయకుడు. నాయకుడితో సహా కుందేళ్లన్నీ వరసగా అరిచాయి. లెక్కలేస్తున్న నక్క, గుంపులో నలభై రెండు కుందేళ్లున్నట్లు తేల్చింది. ‘నక్క బావా! నలభై రెండులో సగం ఇరవయ్యొక్కటని నీకు తెలియంది కాదు. ముందుగా ఇరవయ్యొక్కరం బయటకు వెళ్లిపోతాం. పొదల్లో మిగిలిన ఇరవయ్యొక్కరిని నువ్వు ఫలహారంగా స్వీకరించు’ అంది కుందేళ్ల నాయకుడు. నక్క లొట్టలేసుకుంటూ సరేనంది. ఇరవయ్యొక్క కుందేళ్లు ఒక్క ఉదుటున బయటకు వచ్చి పారిపోయాయి. తరవాత నక్క పొదల్లోకి వెళ్లి చూడగా.. ఒక్కటీ కనిపించలేదు. కుందేళ్ల నాయకుడు తనను మోసం చేశాడని నక్కకు అర్థమైంది. ఏం చేయాలో తెలియక బేల ముఖంతో సింహం ముందు నిల్చుంది. ‘నీ తెలివి ఏపాటిదో అర్థమైందా.. కుందేళ్ల నాయకుడిది మోసం కాదు. అదే నిజమైన తెలివి. కుందేళ్ల అరుపులను నలభై రెండు అని తప్పుగా లెక్కపెట్టావు’ అంది మృగరాజు. మంత్రి పదవి అందని ద్రాక్షే అయ్యిందని, తనను తాను తిట్టుకుంటూ కూలబడింది నక్క.

- బెహరా మోక్షజ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని