చకాచక్‌.. పిక్నిక్‌!

విహారయాత్ర.. అదే నేస్తాలూ... పిక్నిక్‌ అంటే మనకు చాలా ఇష్టం కదూ. అయినా అదంటే నచ్చనివారు ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు ఈ పిక్నిక్‌ గురించి ఎందుకంటే.. ఈ రోజు ప్రపంచ పిక్నిక్‌

Updated : 18 Jun 2022 06:51 IST

విహారయాత్ర.. అదే నేస్తాలూ... పిక్నిక్‌ అంటే మనకు చాలా ఇష్టం కదూ. అయినా అదంటే నచ్చనివారు ఎవరుంటారు చెప్పండి. ఇప్పుడు ఈ పిక్నిక్‌ గురించి ఎందుకంటే.. ఈ రోజు ప్రపంచ పిక్నిక్‌ దినోత్సవం మరి! ఏటా జూన్‌18న ‘ఇంటర్నేషనల్‌ పిక్నిక్‌ డే’ జరుపుకొంటారు. ఆ సంగతులేంటో తెలుసుకుందామా..!

మన దగ్గర పిక్నిక్‌ అంటే.. విహారయాత్ర అనుకుంటారు కానీ.. ఒక రకంగా ఇది ఆహారయాత్ర! అవును నేస్తాలూ.. కుటుంబసభ్యులతో కానీ, స్నేహితులతో కానీ కలిసి బయటప్రాంతాలను సందర్శించి అక్కడ ఆహారం తినడాన్నే పిక్నిక్‌ అంటారు.

ప్రపంచమంతా...
పిక్నిక్‌ అనే పదం ఫ్రెంచ్‌ భాష నుంచి పుట్టింది. ఫ్రెంచ్‌ విప్లవం తర్వాత ఈ పిక్నిక్‌ సంస్కృతి పెరిగింది. ఇది ఫ్రాన్స్‌లో పుట్టినప్పటికీ తర్వాత కాలంలో దాదాపు ప్రపంచమంతా విస్తరించింది. ఇప్పుడు పిక్నిక్‌ అంటే తెలియని ప్రజలు లేరంటే అతిశయోక్తి కాదు.

గిన్నిస్‌ రికార్డూ ఉందోచ్‌!
పోర్చుగల్‌లోని లిస్బన్‌లో 2009లో జరిగిన ఓ పిక్నిక్‌ ‘గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించుకుంది. ఈ విహారయాత్రలో ఏకంగా 20 వేల మంది పాలుపంచుకున్నారట. అంటే ఒక్కసారి ఊహించుకోండి ఆ పిక్నిక్‌ ఎంత సందడి సందడిగా, కోలాహలంగా జరిగి ఉంటుందో! ఈ కథనం చదివాక మీకు ఇష్టమైన ఆహారపదార్థాలు గుర్తుకు వచ్చి మీకూ నోరూరుతోంది కదూ! ప్చ్‌ ఏం చేస్తాం.. మనకు ఇప్పుడిప్పుడే స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి కదా! అందుకే మనం ఇప్పుడప్పుడే పిక్నిక్‌కు వెళ్లలేం. వీలుంటే మాత్రం ఈ రోజు మీ కుటుంబసభ్యులతో దగ్గర్లోని పార్క్‌కైనా పిక్నిక్‌కు వెళ్లండి. మీ స్కూల్‌ తరఫున జరుపుకొంటున్నప్పుడు మాత్రం ఈ విశేషాలన్నీ మీ స్నేహితులు, ఉపాధ్యాయులతో పంచుకోండి. వాళ్లంతా తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తారు. సరేనా..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని