చేపల సాయం!

అదో పెద్ద చెరువు. ఏడాది పొడవునా అది జలకళను సంతరించుకొని ఉంటుంది. ఎన్నో రకాల చేపలకు ఆవాసం ఆ చెరువు. చిన్నా చితకా మినహా అందులో ఇతర జలచరాలు లేకపోవటంతో చేపలు, వాటి సంతానంతో కలిసి ఎటువంటి ప్రాణభయం లేకుండా ఆనందంగా జీవించసాగాయి. ఒకరోజు ఎక్కడి నుంచో కొంగల గుంపు ఒకటి చెరువు వద్దకు వచ్చింది. చెరువునూ...

Published : 24 Jun 2022 00:31 IST

దో పెద్ద చెరువు. ఏడాది పొడవునా అది జలకళను సంతరించుకొని ఉంటుంది. ఎన్నో రకాల చేపలకు ఆవాసం ఆ చెరువు. చిన్నా చితకా మినహా అందులో ఇతర జలచరాలు లేకపోవటంతో చేపలు, వాటి సంతానంతో కలిసి ఎటువంటి ప్రాణభయం లేకుండా ఆనందంగా జీవించసాగాయి. ఒకరోజు ఎక్కడి నుంచో కొంగల గుంపు ఒకటి చెరువు వద్దకు వచ్చింది. చెరువునూ, అందులోని చేపలతోపాటు వాటి పిల్లలను చూడగానే కొంగలకు నోరూరింది. కొద్ది రోజుల వరకు తమ ఆహారానికి ఇబ్బంది లేదని భావించాయి. దాంతో ఆ కొంగల గుంపు చెరువు పరిసరాలనే తమ నివాస ప్రాంతంగా మార్చుకుంది.

తరవాత కొంగలన్నీ ఒక్కొక్కటిగా చెరువులోకి దిగాయి. నీటిలోకి వెళ్లిన కొంగలు కదలకుండా, మెదలకుండా ఒంటికాలిపై నిలబడ్డాయి. పాపం.. అవేమీ తెలియని చేపలు, కొంగల దగ్గరకు వచ్చి వాటి చుట్టూ తిరగటం ప్రారంభించాయి. చిన్న చేపలు కొత్తగా కనిపించిన కొంగల కాళ్ల దగ్గర ఆడుకోసాగాయి. తమ దగ్గరకు వచ్చిన చేపలను, ఒడుపుగా నోటితో పట్టుకుని తినసాగాయి పెద్ద కొంగలు. కొన్ని చేపలను పిల్లలకు ఆహారంగా తీసుకువెళ్లసాగాయి. అలా కొంతసేపటి తర్వాత చేపలకు వాటి బంధువులు, మిత్రులు కనబడకపోవటం ఆశ్చర్యం కలిగించింది. చెరువులో ఎంత వెతికినా ఫలితం లేదు.

దాంతో చేపలు చెరువుపైకి వచ్చి చూడగా కొంగల గుంపు ఒకటి కనిపించింది. అవి హాయిగా నీటిలో తమతో పాటు ఆడుతూ పాడుతూ తిరిగిన చేపలను చంపి తింటున్నాయి. కొంగల బారినపడి చనిపోతున్న చేపలను చూసి అవి బాధపడ్డాయి. పెద్ద చేపలు మిగతా వాటిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇంతకాలం ఈ చెరువు మనకు చాలా సురక్షితమైన ప్రదేశం.. పిల్లాపాపలతో ఏ కష్టం లేకుండా సంతోషంగా జీవించాం.. అలాంటిది ఇప్పుడు ఎక్కడి నుంచో కొంగలు వచ్చి పడ్డాయి.. పరిస్థితి ఇలానే కొనసాగితే, మన జాతి అంతరించే ప్రమాదం ఉంది’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాయి. ‘అవును.. మనం తక్షణం మేల్కొనకపోతే చాలా కష్టం’ అన్నాయి మిగతా చేపలు.

ఒకరోజు కొన్ని కొంగలు చెరువులో దిగి చేపలను పట్టి తింటున్నాయి. అదే సమయంలో పిల్ల కొంగలూ నీళ్లలోకి దిగి సరదాగా ఆడుకుంటున్నాయి. మధ్యమధ్యలో చిన్నచిన్న చేపలను నోట పట్టి తినసాగాయి. ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్న కొంగలు తెలియకుండానే చెరువు మధ్యలోకి వెళ్లాయి. పెద్ద కొంగలు హెచ్చరిస్తున్నా.. అవి పట్టించుకోకుండా మరింత ముందుకు వెళ్లడంతో సుడిగుండంలో చిక్కుకున్నాయి. చిన్న కొంగలు భయంతో విలవిల్లాడాయి. సుడిగుండంలోని నీటితోపాటు గుండ్రంగా తిరుగుతూ.. అవి కూడా కొంచెంకొంచెంగా లోపలకు వెళ్లిపోసాగాయి. కళ్లముందే బిడ్డలు మునిగిపోతున్నా.. ఏమీ చేయలేని పరిస్థితి పెద్ద కొంగలది.

ఇదంతా గమనిస్తున్న చేపలకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని మిగతా వాటితో పంచుకున్నాయి. ‘మన పిల్లలను చంపుతున్న కొంగలనూ, వాటి పిల్లలను ఎందుకు రక్షించాలి?’ అని ప్రశ్నించాయి. ‘మన చేపలను చంపుతున్నది పెద్దవే కానీ చిన్నవి కాదు కదా! అయినా, కొంగలు చేసిన తప్పే మనమూ చేస్తే.. వాటికీ మనకూ తేడా ఏముంది?’ అని చర్చించాయవి. చివరకు పిల్ల కొంగలను సుడిగుండం నుంచి రక్షించాలని నిర్ణయించాయి. కొంగలతో మాట్లాడగా.. అవి కూడా సహకరిస్తామన్నాయి. చెరువు ఒడ్డున చెట్టు కిందున్న చిరిగిన వలను తెమ్మని కొంగలకు చెప్పాయి చేపలు. కొంగలు ఎగురుకుంటూ వెళ్లి తీసుకొచ్చాయి. అప్పుడు పెద్ద చేపలు కొంగలతో ‘మీరంతా ధైర్యంగా వలను నాలుగు వైపులా గట్టిగా నోటితో పట్టుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టొద్దు. ఆ వలను సుడిగుండాల మీద పరవాలి. మీరు కూడా వలతో పాటు గుండ్రంగా తిరుగుతారు. అయినా వదలకూడదు’ అన్నాయి చేపలు.

‘అలాగే మా చేపలు కూడా చిరిగిన వలలోంచి పిల్ల కొంగలు జారి మళ్లీ సుడిగుండంలోకి వెళ్లిపోకుండా అడ్డుగా నిలుస్తాయి. ఆ తర్వాత వల మీదకు చేరిన పిల్ల కొంగలను.. ఒకేసారి సుడిగుండం నుంచి తప్పించాలి’ అని పథకాన్ని వివరించాయవి. కొంగలు, చేపల ఆలోచనను స్వాగతించాయి. చేపలూ, కొంగలూ విజయవంతంగా పిల్ల కొంగలను రక్షించి ఒడ్డుకు చేర్చాయి. తమ బిడ్డలను తీసుకొని ముద్దాడాయి తల్లి కొంగలు. ‘మేము మీ పిల్లలను చంపినా, మీరు మా పిల్లలను కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా చెరువును విడిచిపెట్టి వెళ్లిపోతాం’ అన్నాయి కొంగలు. చేపలు వీడ్కోలు పలకగా.. కొంగలు ఆకాశంలోకి ఎగిరాయి.  

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు