అదిగో.. అదే శాంతిపురం!

రామయ్య తన ఊరిలో బంధువుల మోసాలకు గురయ్యాడు. చివరికి అప్పులపాలై ఉన్నదంతా అమ్ముకున్నాడు. ఊరిలో ఇతరులకు తన ముఖం చూపించలేక వేరే గ్రామానికి వలస వెళదామని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తాను వెళ్లబోయేది చాలా మంచి గ్రామం అయితే బాగుండు అనుకుంటూ కాలినడకన బయలుదేరాడు. ఊర్లను చూస్తూ, వాటి గురించి తెలుసుకుంటూ వెళుతున్నాడు.

Published : 26 Jun 2022 01:22 IST

రామయ్య తన ఊరిలో బంధువుల మోసాలకు గురయ్యాడు. చివరికి అప్పులపాలై ఉన్నదంతా అమ్ముకున్నాడు. ఊరిలో ఇతరులకు తన ముఖం చూపించలేక వేరే గ్రామానికి వలస వెళదామని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తాను వెళ్లబోయేది చాలా మంచి గ్రామం అయితే బాగుండు అనుకుంటూ కాలినడకన బయలుదేరాడు. ఊర్లను చూస్తూ, వాటి గురించి తెలుసుకుంటూ వెళుతున్నాడు.

అతడు అలా వెళ్తూ వెళ్తూ.. ఒకచోట చాలా ఆశ్చర్యకరమైన సంఘటనను చూశాడు. ఓ పిల్లి.. కుక్కను తరుముతోంది. అతడు ఆశ్చర్యంతో ఆ గ్రామంలోని వ్యక్తితో ‘అయ్యా! ఎక్కడైనా పిల్లిని కుక్క తరుముతుంటే చూశాను. కానీ ఇక్కడ కుక్కను పిల్లి తరమడం ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని అడిగాడు.

అప్పుడు ఆ వ్యక్తి ‘ఇందులో మీరు ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. మా ఊరిలో కుక్కలు, పిల్లులు చిన్నప్పటి నుంచి ఒకే చోట కలసి ఉన్నాయి. అందువల్ల వాటిలో శత్రుభావం లేదు. అవి జాతివైరాన్ని మరచి కలిసిమెలిసి ఉంటాయి. ఆ పిల్లి మీరనుకున్నట్లు కుక్కను తరమడం లేదు. అవి ఎంచక్కా ఆటలాడుకుంటున్నాయి’ అని అన్నాడు. ఈ మాటలు విన్న రామయ్య మళ్లీ ఆశ్చర్యపోయాడు.

ఇంతలో ఆ గ్రామంలోని దానయ్య అనే వ్యక్తి వచ్చి.. రామయ్యకు పండ్లు, మంచినీళ్లు అందించాడు. అప్పుడు రామయ్య ఆశ్చర్యపోయి.. ‘మీరు ఇచ్చిన పండ్లకు నా వద్ద డబ్బు లేదు. మన్నించండి. నాకు ప్రస్తుతం వీటి అవసరం లేదు’ అని అంటూ వాటిని తిరిగి ఇవ్వబోయాడు. అప్పుడు దానయ్య అతడిని వారిస్తూ ‘లేదండీ! నేను వాటిని మీకు ఉచితంగానే ఇచ్చాను. మీరు మా గ్రామం గుండా వెళ్తున్నారంటే మిమ్మల్ని మేము మా అతిథులుగా భావిస్తాం. మీరు ఎండకు నడుస్తుంటే మీకు ఆకలిదప్పుల బాధ లేకుండా మేము ఈ పండ్లను, మంచినీటిని అందరికీ అందిస్తాం. అది మా గ్రామంలోని సంప్రదాయం’ అని అన్నాడు. అప్పుడు రామయ్య ఆ పండ్లను తీసుకొని తిని, మంచినీటిని తాగాడు.

తర్వాత రామయ్యకు ఆ గ్రామంలోకి వెళ్లి ఇంకా ఏమి విశేషాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. అతడు ఆ గ్రామంలోకి ప్రవేశించి చూశాడు. అక్కడ ప్రతి ఇంటి ఆవరణలో కూరగాయలు, పండ్ల చెట్లు ఉన్నాయి. ఆ గ్రామ ప్రజలు తమకు నచ్చిన పండ్లు, కూరగాయలు ఇతరుల ఇంటికి వెళ్లి కూడా తెంపుకొంటున్నారు. అప్పుడు రామయ్య అక్కడ ఉన్న చలమయ్యతో ‘అయ్యా! ఇదేమిటి? అందరూ ఇతరులను అడగకుండానే ఆ కాయగూరలు, పండ్లను తీసుకొని పోతున్నారు. వాటికి డబ్బులు చెల్లించరా?’ అని ప్రశ్నించాడు.
అప్పుడు చలమయ్య నవ్వి ‘అదేం లేదు! మా గ్రామవాసులకు అన్నీ ఉచితమే. ఎవరికి ఇష్టమైనవి వారు ఏ ఇంటి ఆవరణలో ఉన్నా తీసుకొని వెళ్లవచ్చు. ఆ ఇంటి వారిని కూడా అడిగే పనిలేదు’ అని అన్నాడు.

‘మరి అందరూ వాటిని పండించరా?’ అని అడిగాడు రామయ్య. ‘వారి ఇంట్లో పండినవి ఇతరులు తీసుకుని పోతే అవి బహుశా అయిపోయి ఉంటాయి’ అని అన్నాడు చలమయ్య. ‘మరి మీరు ఇతర గ్రామాల వారికి వాటిని అమ్మడం లేదా?’ అని తిరిగి ప్రశ్నించాడు రామయ్య. అప్పుడు చలమయ్య... ‘మా గ్రామ పొలిమేరలను దాటి వాటిని ఇతర గ్రామాల వారికి కూడా మేము సరసమైన ధరలకు అమ్ముతాం. వాటిని అమ్మేటప్పుడు మాత్రం ఒకరి ఇంటివి మరొకరు కోసుకొని అమ్మడానికి వీలు లేదు. ఈ గ్రామంలోని వారు వాటిని ఎన్నైనా తినవచ్చు. కానీ ఇతరులవి మాత్రం అమ్మడానికి వీలు లేదు’ అన్నాడు.

‘మరి మీ ఊరిలో ఫిర్యాదులు కానీ, తగాదాలు కానీ ఉండవా!’ అని చలమయ్యను తిరిగి ప్రశ్నించాడు రామయ్య. అప్పుడు అతడు ‘ఉండవు.. ఈ గ్రామ సంపద సమష్టిగా అనుభవించడానికి అందరికీ అధికారముంది. దాన్ని ఎవరైనా సొంతానికి వాడుకోవచ్చు.. కానీ అమ్మరాదు’ అన్నాడు.

‘మరి మీ ఊరికి కోతులు, అడవి పందులు వచ్చి మీ పంటలు నాశనం చేయవా!’ అని తిరిగి ప్రశ్నించాడు రామయ్య. అతడు ‘లేదు.. లేదు.. అలాంటి అవకాశమే లేదు. మా ఊరి పొలిమేరల్లో అనేక రకాల పండ్ల చెట్లను మేము పెంచుతున్నాం. అక్కడే వాటికి ఆహారం దొరికిన తర్వాత అవి మా గ్రామానికి ఎందుకు వస్తాయి?’ అని తిరిగి ప్రశ్నించాడు చలమయ్య.

అప్పుడు రామయ్య... ‘ఆహా! ఇది ఎంత మంచి గ్రామం. దీని పేరు ఏమిటి?’ అని అడిగాడు. చలమయ్య ‘శాంతిపురం’ అని చెప్పాడు. ‘ఆహా! ఈ గ్రామం నిజంగా శాంతిపురమే! మిగతా గ్రామాలన్నింటికీ ఇది ఆదర్శంగా ఉంది. నేను కూడా ఈ గ్రామంలోనే స్థిరనివాసం ఏర్పరుచుకుంటాను. అవును... స్థిర నివాసం ఏర్పరచుకుంటాను’ అంటూ గట్టిగా అరవసాగాడు.

‘ఏమైందండీ! నిద్రలో ఏమేమో కలవరిస్తున్నారు. మనం మరో గ్రామానికి వెళ్లాలి. మరిచారా! త్వరగా లేవండి... తెల్లవారింది’ అని అంది అతని భార్య.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని