పులిలో ఫ్లూటో!

‘పులి ఏంటి..? ఫ్లూటో ఏంటి?’ అని ఆశ్చర్యపోతున్నారు కదూ. ఫ్లూటో అనేది ఓ పెంపుడు కుక్క పేరు. ‘అది సరే.. పులిలో కుక్క ఏంటి మరి?’ అని మీకు మరో అనుమానం వచ్చింది కదా... ఆ

Published : 29 Jun 2022 01:06 IST

‘పులి ఏంటి..? ఫ్లూటో ఏంటి?’ అని ఆశ్చర్యపోతున్నారు కదూ. ఫ్లూటో అనేది ఓ పెంపుడు కుక్క పేరు. ‘అది సరే.. పులిలో కుక్క ఏంటి మరి?’ అని మీకు మరో అనుమానం వచ్చింది కదా... ఆ సంగతులేంటో తెలుసుకోవాలనుకుంటే.. నేస్తాలూ.. మీరు ఈ కథనం చదవాల్సిందే!

గుజరాత్‌ రాష్ట్రం వడోదరకు చెందిన గరిమా మల్వంకర్‌ శాంక్‌ అనే అక్కకు ఓ పెంపుడు కుక్క ఉండేది. దాన్ని ఫ్లూటో అని పిలిచేది. అదంటే ఆమెకు చాలా ఇష్టం. దాన్ని కంటికి రెప్పలా చూసుకునేది. అల్లారుముద్దుగా పెంచుకునేది. కానీ పాపం అది ఓ సంవత్సరం క్రితం జబ్బు పడింది. వైద్యులూ ఏమీ చేయలేకపోయారు. దురదృష్టవశాత్తు అది చనిపోయింది.

వీడని జ్ఞాపకాలు...
గరిమాను ఫ్లూటో జ్ఞాపకాలు వదల్లేదు. తన కుటుంబసభ్యుల్లో ఒకరిగా ఉన్న ఫ్లూటో చనిపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. దీన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ... వీధి కుక్కలకు రోజూ ఆహారాన్ని అందించడం అలవాటుగా మార్చుకుంది. ఫ్లూటో గుర్తుగా ఇంకా ఏదైనా చేయాలనుకుంది. కానీ మరో కుక్కను తెచ్చి పెంచుకోవడం తనకు ఎందుకో నచ్చలేదు. అందుకే ఏదైనా వినూత్నంగా చేయాలనుకుంది.

అదే రోజున...
ఫ్లూటో జూన్‌ 24వ తేదీన జన్మించింది. అదేరోజున గరిమా స్థానిక సాయాజీ బాగ్‌ జూలోని ఓ చిరుతపులిని దత్తత తీసుకుంది. దాని బాగోగులు, ఆహారానికయ్యే ఖర్చూ గరిమానే భరిస్తోంది. అలా పులిలో తన ఫ్లూటోను చూసుకుంటోంది. ఎంతైనా ఈ అక్క నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని