మంచిపేరు ఊరికే రాదు

అనగనగా ఓ అడవి. అందులో ఒక సింహం, ఒక నక్క ఉండేవి. వాటి మధ్య మంచి స్నేహం ఉండేది. సింహానిది భుజబలం. నక్కది బుద్ధిబలం. ఆ రెండూ తోడైతే ఇక తిరుగే ఉండదని వాటి ధైర్యం. అయితే వాటికి ఒక దిగులు ఉండేది. అన్ని జంతువులు సింహంతోనూ, నక్కతోనూ అంటీముట్టనట్లు ఉండేవి.

Published : 30 Jun 2022 01:03 IST

అనగనగా ఓ అడవి. అందులో ఒక సింహం, ఒక నక్క ఉండేవి. వాటి మధ్య మంచి స్నేహం ఉండేది. సింహానిది భుజబలం. నక్కది బుద్ధిబలం. ఆ రెండూ తోడైతే ఇక తిరుగే ఉండదని వాటి ధైర్యం. అయితే వాటికి ఒక దిగులు ఉండేది. అన్ని జంతువులు సింహంతోనూ, నక్కతోనూ అంటీముట్టనట్లు ఉండేవి.

సింహం క్రూరమైందని, నక్క జిత్తులమారిదని వాటి స్థిర అభిప్రాయం. అలాంటి వాటితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదమని ఆ రెండు జంతువులకు దూరంగా ఉండడానికి ప్రయత్నించేవి. రాను, రాను ఈ విషయం సింహానికి, నక్కకు బాగా బోధ పడింది.

తాము కనపడ్డప్పుడల్లా ఇతర జంతువులన్నీ మొహం తిప్పుకొని పోతూఉంటే సింహానికి, నక్కకు చిన్నతనంగా అనిపించింది. దీనికి విరుగుడు ఏమిటా అని ఆలోచించాయి. కానీ తమకు ఏ ఉపాయమూ తోచక ఏనుగును కలిశాయి.

‘ఎవరైనా మంచివారితో స్నేహంగా ఉండాలనుకుంటారు. మీలో ఒకరు క్రూరస్వభావం కలవారు. మరొకరు జిత్తులమారి. మిమ్మల్ని ఎవరైనా ఎలా నమ్ముతారు?’ అంది ఏనుగు.

‘అయితే మేం ఏం చేయాలి?’ అన్నాయి సింహం, నక్క. ‘మీరు, మీలోని చెడు స్వభావాలను వదలాలి. అప్పుడే అందరూ మీతో కలవడానికి ఇష్టపడతారు’ అంది ఏనుగు.

సింహం తన క్రూర స్వభావాన్ని వీలున్నంత వరకు తగ్గించుకోవాలనుకుంది. మరీ ఆకలైతేనే తప్ప జంతువులను వేటాడకూడదనుకుంది. అలాగే నక్క, తన జిత్తులమారితనాన్ని వదిలేయాలని నిశ్చయించుకుంది.

ఆ విషయాన్ని అడవిలో జంతువులన్నింటితో చెప్పమని ఏనుగును ప్రాధేయపడ్డాయి. ఏనుగు మాటలు విన్న కొన్ని జంతువులు.. ‘మంచిదే, కొంతకాలం వేచి చూద్దాం. అప్పుడు నమ్ముదాం’ అనుకున్నాయి.

‘ఇదేదో కొత్త ఎత్తులాగుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి’ అని మరికొన్ని జంతువులు అనుకున్నాయి. ఇలా కొంతకాలం గడిచింది. ఆపైన కూడా సింహం, నక్కతో ఇతర జంతువులు కలుపుగోలుగా ఉండలేదు. ‘ఏమిటిది.. మనం ఇంతగా మారాక కూడా మనకు మంచి పేరు రాలేదు?’ అనుకుని నిట్టూర్చాయి సింహం, నక్క. ఇలా మరికొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు బాగా కండపట్టిన జింక ఒకటి నక్క కంట పడింది. దానికి మాయమాటలు చెప్పి సింహం దగ్గరకు తీసుకుపోవాలనుకుంది. అలా చేస్తే దాని ఆకలి తీరుతుంది, తన కడుపూ నిండుతుందని అనుకుంది. మాయమాటలతో దాన్ని బుట్టలో వేసి సింహం దగ్గరకు తీసుకుపోసాగింది.

ఇదంతా గమనించిన ఏనుగు వాటి వెనకే బయలుదేరింది. చివరకు సింహం ఉండే చోటుకు వచ్చింది. అప్పటికే నక్క, సింహంతో... ‘మనం ఎంతమారినా మనకు మంచిపేరు రావడం లేదు. మనల్ని ఇతర జంతువులు నమ్మడం లేదు. కాబట్టి మోసంతో జింకను తీసుకొచ్చాను.. ఆరగిద్దాం’ అంది.

జింక మీదకు ఉరకబోతున్న సింహాన్ని ఏనుగు వారించింది. ‘మేం మారామని చెప్పినంత మాత్రాన ఎవరూ నమ్మరు. దానికి కొన్ని రుజువులు కావాలి, కొంత సమయమూ కావాలి. మంచిపేరు, నమ్మకం ఇలాంటివి కోరుకుంటే వచ్చేవి కావు. మన ప్రవర్తనను బట్టి వచ్చేవి. సమయం దొరకగానే మీ బుద్ధి బయట పెట్టుకున్నారు. అవకాశవాదులు మీరు. ఇలాంటివారిని ఎవరు నమ్ముతారు? ఎవరు స్నేహం చేయడానికి ముందుకొస్తారు? నిజంగా మిమ్మల్ని మంచివారని అందరూ అనుకోవాలంటే మీలో నిజంగా నిజాయతీ ఉండాలి. పరీక్షలకు తట్టుకుని నిలబడాలి. అంతేగానీ అవకాశం రాగానే బుద్ధి చూపకూడదు’ అని ఏనుగు వాటికి బాగా గడ్డి పెట్టింది. సింహం, నక్క పశ్చాత్తాపపడ్డాయి. ‘జింక బతుకు జీవుడా!’ అని అడవి లోపలికి పరిగెత్తింది.

‘మంచి నీతి చెప్పావు. అందుకే ఏనుగులు తెలివైనవని అందరూ అంటారు. మా కళ్లు తెరిపించావు. ఇక మీదట జాగ్రత్తగా మెలిగి అడవిలో మంచి పేరు తెచ్చుకుంటాం’ అన్నాయి సింహం, నక్క. ఏనుగు సంతోషంగా తొండాన్ని పైకెత్తి తన ఆనందాన్ని తెలియజేసింది. ఆ తరవాత సింహం, నక్క ఏనుగు చెప్పినట్లే నడుచుకుని మంచిపేరు తెచ్చుకున్నాయి.

- గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని