బుడతల బడిబాట

వాళ్లంతా మనలాంటి చిట్టిపొట్టి చిన్నారులు. భుజాన పుస్తకాల సంచీ, చేతిలో గొడుగు, యూనిఫాం, టై, ఐడీ కార్డుతో చకచకా నడుచుకుంటూ వస్తున్నారు. ‘ఆ.. ఇందులో వింత ఏముంది. ప్రతి

Updated : 01 Jul 2022 07:06 IST

వాళ్లంతా మనలాంటి చిట్టిపొట్టి చిన్నారులు. భుజాన పుస్తకాల సంచీ, చేతిలో గొడుగు, యూనిఫాం, టై, ఐడీ కార్డుతో చకచకా నడుచుకుంటూ వస్తున్నారు. ‘ఆ.. ఇందులో వింత ఏముంది. ప్రతి ఊర్లోనూ జరిగేది ఇదే కదా’ అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ చిన్నారులు ఉండేది మయన్మార్‌లో వాళ్ల బడులు ఉండేది మాత్రం ఇండియాలో!

అప్పుడు సమయం సరిగ్గా ఉదయం 7:50 నిమిషాలు. మంగూలీ అనే కిండర్‌గార్టెన్‌ చదివే చిన్నారి స్కూలుకు బయలు దేరింది. ఆమెతోపాటే వాళ్ల అమ్మ వస్తోంది. ఈ క్రమంలో వాళ్లు హన్వా నదిపై ఉన్న వంతెన దాటాల్సి ఉంటుంది. ఆ వంతెన భారతదేశం, మయన్మార్‌ మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా ఉంది. కేవలం మంగూలీ మాత్రమే కాదు.. అలాంటి పిల్లలు మరో 500 మంది వరకు రోజూ ఈ బ్రిడ్జి మీదుగా భారతదేశంలోని మిజోరాం రాష్ట్రంలోని చంఫై జిల్లాలోని సరిహద్దు పట్టణమైన జోఖాన్‌తార్‌కు వచ్చి చదువుకుంటున్నారు. మళ్లీ సాయంత్రం కాగానే వాళ్ల దేశానికి వాళ్లు వెళ్లిపోతున్నారు. వాళ్ల గ్రామాలైన ఖాన్మావి, రిఖావ్‌దార్‌కు చేరుకుంటున్నారు.

ఎందుకిలా..
2021లో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఆ దేశంలో పరిస్థితులు బాగాలేవు. ముఖ్యంగా భారత సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లు కూడా తెరుచుకోవడం లేదు. అందుకే అక్కడి చిన్నారులు మనదేశంలో స్కూళ్లలో చదువుకోవడానికి బడిబాట పడుతున్నారు. కరోనా తర్వాత మన దగ్గర బడులు ప్రారంభమైన వెంటనే మయన్మార్‌ పిల్లలు ఇక్కడికి వస్తున్నారు.

ఉదయం తొమ్మిదికి ముందే..
మయన్మార్‌కు చెందిన చిన్నారులు సుమారు అరగంట నడిచి తమ, తమ స్కూళ్లకు చేరుకుంటున్నారు. సరిహద్దుల్లో ఇమ్మిగ్రేషన్‌ పోలీసులు ఒక ఔట్‌ పోస్టును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉదయం 7 నుంచి 9 వరకు గేట్‌ను బడిపిల్లల కోసం తెరిచి ఉంచుతున్నారు. సరిగ్గా 9 కాగానే అక్కడ గేట్‌ మూసివేస్తారు. అందుకే ఆ మయన్మార్‌ పిల్లలందరూ 9కి ముందే ఈ గేట్‌ను దాటి తమ తమ బడులకు చేరుకుంటారు. మళ్లీ సాయంత్రం కాగానే ఈ గేట్‌ గుండానే పిల్లలు తమ దేశానికి చేరుకుంటున్నారు.  
చూశారు కదా నేస్తాలూ.. చదువుకోవడం కోసం మయన్మార్‌ పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో! మనం మాత్రం మన ఇంటి ముందుకు వచ్చే స్కూలు వ్యాన్‌ ఎక్కి బడికి వెళ్లాలన్నా కొన్నిసార్లు బద్ధకిస్తుంటాం. మయన్మార్‌ పిల్లల కష్టాలు చదివాక మీకు విద్య విలువ తెలుస్తోంది కదూ! ఇకపై డుమ్మాలు కొట్టకుండా స్కూలుకు వెళ్లండి మరి.. సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని