పిల్ల చిలుక... మూడు ఈకలు!

ఒక ఊరు చివర చెట్టు మీదున్న చిలుకకు రెండు పిల్లలున్నాయి. అవి ఇప్పుడిప్పుడే సొంతంగా ఎగురుతున్నాయి. ఒక పిల్ల బయట తిరిగొస్తానని తల్లితో చెప్పింది. అది విన్న తల్లి.. ‘అలాగే.. కానీ ముందు చెప్పేది విను. మన శరీరం చిన్నది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే కష్టాలు వస్తాయి.

Updated : 08 Jul 2022 06:50 IST

ఒక ఊరు చివర చెట్టు మీదున్న చిలుకకు రెండు పిల్లలున్నాయి. అవి ఇప్పుడిప్పుడే సొంతంగా ఎగురుతున్నాయి. ఒక పిల్ల బయట తిరిగొస్తానని తల్లితో చెప్పింది. అది విన్న తల్లి.. ‘అలాగే.. కానీ ముందు చెప్పేది విను. మన శరీరం చిన్నది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేకపోతే కష్టాలు వస్తాయి. మనకేదైనా గాయమై ఎగరలేకపోతే మనుషులకు దొరికిపోతాం. మనల్ని చంపడమో, పంజరంలో బంధించడమో చేస్తారు. మనలాంటి పక్షులకు రెక్కలు ముఖ్యం. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి’ అని చెప్పింది.

సరేనంటూ గాల్లోకి ఎగిరింది పిల్ల చిలుక. మొదటిసారి ఒంటరిగా ఎగురుతున్న ఆనందంలో ఉంది. ఇళ్లు, చెట్ల మీదుగా ఎగురుతూ వింత అనుభూతి పొందింది. చాలాసేపు ఎగిరిన తరువాత ఆకలి వేసింది దానికి. తిండి కోసం కిందకు చూడగా ఒకచోట ముళ్ల పొదల దగ్గర గింజలు కనబడ్డాయి. వెంటనే అక్కడ వాలింది. గింజలను మింగింది. ఎవరో వస్తున్న అలికిడి వినగానే ఒక్క ఉదుటున గాలిలోకి లేచింది పిల్ల చిలుక.

పైకి ఎగురుతుండగా ముళ్లపొద తగిలి రెక్కల నుంచి మూడు ఈకలు రాలి పడ్డాయి. చిలుకకు అమ్మ మాటలు గుర్తొచ్చాయి. ‘రెక్కల నుంచి ఈకలు రాలితే ప్రమాదమేమో. ఇప్పుడెలా? వాటిని తీసుకెళ్లి అమ్మకిచ్చి అతికించమంటాను’ అనుకుందది. అప్పుడే వీచిన గాలికి ఈకలు ఎగిరి మూడు వేర్వేరు చోట్ల పడ్డాయి. అవి పడిన ప్రదేశాలను గుర్తు పెట్టుకుంది పిల్ల చిలుక.

మొదటి ఈక కోసం ఎగురుతూ వెళ్లింది. అదొక చెరువు గట్టు. అక్కడ మనుషులు చెరువులో దిగి స్నానాలు చేస్తున్నారు. కొందరు బిందెలతో నీళ్లు పడుతున్నారు. ఈక కనబడగానే కింద వాలింది. ఈకను ముక్కుతో అందుకుని ఎగురుతుండగా దాన్ని పిల్లలు చూశారు.

‘అదిగో చిలుక’ అని అరుస్తూ ఒడ్డు ఎక్కబోయారు. వాళ్లతో ఉన్న పెద్దవాళ్లు పిల్లలను ఆగమన్నారు. ‘స్నానం ఆపేసి మధ్యలో వెళ్లొద్దు. శరీరాన్ని శుభ్రంగా తుడుచుకున్నాకే దుస్తులు వేసుకోండి. మీరెళితే చిలుక భయపడుతుంది. దూరం నుంచే చూడండి’ అన్నారు.

ఈకను అందుకుని ఎగిరిన పిల్ల చిలుక దాన్నొక చోట పెట్టింది. అది గాలికి వెళ్లకుండా చిన్న రాయిని బరువు పెట్టి.. రెండో ఈక కోసం బయలుదేరింది. అది గుడి దగ్గర పడింది. చిలుక వెళ్లేసరికి పండ్లూ, పాలు పట్టుకుని వరుసలో నిలబడ్డ భక్తులు కనిపించారు. గుడికి వచ్చిన పిల్లలు చిలుకను చూసి సంతోషంతో ‘అదిగో చిలుక’ అంటూ పరిగెత్తబోయారు. వాళ్ల అమ్మానాన్నలు వాళ్లను ఆపారు.

‘మనం దేవుడికి దండం పెట్టడానికి వచ్చాం. అలా పరిగెత్తకూడదు. దేవుడిని మొక్కండి. మీరెళితే అది భయపడుతుంది. ఇక్కడి నుంచే చూడండి’ అన్నారు. దాంతో చిలుకకు పిల్లల వల్ల భయం లేదని అర్థమైంది.

ఈకను అందుకుని మొదటి ఈకను ఉంచిన చోటుకు వెళ్లింది. తర్వాత మూడో ఈక కోసం వెళ్లింది పిల్ల చిలుక. మూడోది బడి దగ్గర పడింది. చిలుక వెళ్లే సరికి వరుసలో నిలబడిన పిల్లలు ప్రార్థన చేస్తూ కనిపించారు. పూర్తి కాగానే గురువు మాట్లాడుతూ... ‘మీరంతా క్రమశిక్షణతో మెలగాలి. పాఠాలు శ్రద్ధగా వినాలి. ఇంటికి వెళ్లి, ఇచ్చిన పని చేయాలి. బుద్ధిగా చదువుకున్నారంటే గొప్పవారవుతారు’ అని మంచి మాటలు చెప్పారు.

అంతలో ఒక కుర్రాడి దృష్టి గోడ మీద ఉన్న పిల్ల చిలుక మీద పడింది. అతను గట్టిగా అరిచి చిలుకను చూపించాడు. దాంతో పిల్లలంతా చిలుకను చూడడానికి తలలు తిప్పారు. అది గమనించిన గురువుగారు పిల్లలను బడి లోపలకు వెళ్లమని హెచ్చరించారు. ఎక్కువసేపు అక్కడ ఉండడం క్షేమం కాదనుకుంది పిల్ల చిలుక. ఈకను పట్టుకుని గాల్లోకి లేచింది. అక్కడ నుంచి వెళ్లి మూడు ఈకల్ని పట్టుకుని గూడుకు వెళ్లింది. అప్పటికే తల్లి చిలుక ఎదురు చూస్తోంది.

మూడు ఈకల్ని తెచ్చిన పిల్లను చూసి ఏం జరిగిందని అడిగింది తల్లి చిలుక. జరిగిందంతా చెప్పింది పిల్ల చిలుక. ‘ఈకల్ని అతికించలేం. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు’ అంది. ఇంకా... ‘మూడు చోట్లా తిరిగావు కదా. నీకేం తెలిసిందో చెప్పు?’ అని అడిగింది తల్లి.

‘ఉదయాన్నే స్నానం చేయాలనీ, గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకోవాలని, అక్కడ నుంచి బడికి వెళ్లి చదువుకోవాలని, అప్పుడే గొప్పవారవుతారని తెలిసింది’ అంది.

‘అవన్నీ నీకెలా తెలిశాయి’ అడిగింది తల్లి చిలుక. పిల్లలతో పెద్దలు చెప్పగా విన్నానంది పిల్ల చిలుక. ‘చూశావా! తెలివి ఉన్న మనుషులే అమ్మానాన్నల మాట విని బుద్ధిగా నడుచుకుంటున్నారు. మరి పక్షులమైన మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో తెలిసిందా. నువ్వు కూడా అమ్మ మాట విని బుద్ధిగా ఉంటావు కదూ’ అంది తల్లి చిలుక. అలాగే అని మాట ఇచ్చింది పిల్ల చిలుక.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని