తెలివైన కాకి!

రెక్కలకొండ అడవిలో సింబా అనే కాకి ఉండేది. అది ఆ అడవిని వదిలి ఎక్కడికీ పోయేది కాదు. బావిలో కప్పలా జీవనం సాగించేది.దాని నేస్తం డింకి మాత్రం వేరే ఇతర అడవులు, కొండలు, నదులు చుట్టి వచ్చేది. ప్రపంచం తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు దేశమంతా తిరిగి రావాలని సింబాతోనూ చెప్పేది. తనతో రమ్మని అడిగేది కూడా.

Published : 10 Jul 2022 00:26 IST

రెక్కలకొండ అడవిలో సింబా అనే కాకి ఉండేది. అది ఆ అడవిని వదిలి ఎక్కడికీ పోయేది కాదు. బావిలో కప్పలా జీవనం సాగించేది.

దాని నేస్తం డింకి మాత్రం వేరే ఇతర అడవులు, కొండలు, నదులు చుట్టి వచ్చేది. ప్రపంచం తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు దేశమంతా తిరిగి రావాలని సింబాతోనూ చెప్పేది. తనతో రమ్మని అడిగేది కూడా.

అయితే సింబా.. ‘ఆ ..ఎక్కడైనా ఏముంటుంది? ఎక్కడ కొట్టినా.. కుక్క కాలు కుంటే కదా’ అని సామెత ఒకటి చెప్పి తప్పించుకునేది. డింకితో వెళ్లేందుకు అస్సలు ఆసక్తి చూపించేది కాదు.

ఒకసారి డింకి ఆరునెలల పాటు ఎక్కడెక్కడో తిరిగి రెక్కలకొండకు వచ్చి వాలింది. రెండు కాకులూ ఓ రావి చెట్టు మీద కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నాయి.

ఇంతలో వాటికి చెట్టు కింద, పచ్చటి ఆకులపైన ఓ బిస్కెట్‌ పడి ఉండటం కనిపించింది. వెంటనే సింబా.. ‘తెల్లారి నుంచి నేను ఏమీ తినలేదు. ఆ బిస్కెట్‌ను నేను తీసుకుంటాను, నీకేమీ అభ్యంతరం లేదు కదా?’ అని వినయంగా అడిగింది.
‘అయ్యో, దానికేముంది. ఇప్పుడే నేను కడుపు నిండా నేరేడు పండ్లు తిని, నీళ్లు తాగాను. నాకు ఆకలిగా లేదు. ఆ బిస్కెట్‌ను నువ్వే తీసుకో!’ అని అభిమానంగా డింకి బదులిచ్చింది.

సింబా సంతోషంగా ఎగురుకుంటూ వెళ్లి బిస్కెట్‌ను తీసుకుని నోటిలో పెట్టుకోబోయింది. కానీ బిస్కెట్‌ గట్టిగా ఉండటంతో దానికి ఏమి చేయాలో అర్థం కాలేదు.
ముక్కుతో చాలా సార్లు పొడిచి చూసింది. రాతి నేల మీద కొట్టి, తినే యత్నం చేసింది. కానీ దాని ప్రయత్నం ఏదీ ఫలించలేదు.

నిరాశగా... ‘ఇది అయ్యేపనిలా లేదు, దీన్ని ఇక్కడే వదిలేస్తాను... ఈ రోజు ఏదో ఒక ఆహారం దొరక్క పోతుందా..!’ అని దాన్ని అక్కడే వదిలి పెట్టి మిత్రురాలి దగ్గరికి వచ్చింది.
తినకుండా వచ్చిన మిత్రురాలితో డింకి ఆకలిగా ఉన్న దానివి, తినకుండా వచ్చేశావేమి? బిస్కెట్‌ రుచిగా లేదా?’ అని అడిగింది.

‘నాకేమో బిస్కెట్‌ తినాలనే ఉంది. చూడటానికి అది ఎంతో రుచిగా కూడా ఉన్నట్లు తోస్తోంది. అయితే అది గట్టిగా ఉండటంతో తినలేకపోతున్నాను’ అని బాధగా చెప్పింది.
‘అలాగని చెప్పి వదిలేస్తే ఎట్లా?’ అని చెప్పిన డింకి ఎగురుకుంటూ వెళ్లి బిస్కెట్‌ను నోట పట్టుకుంది. అటూఇటూ చూసి దగ్గరలో నీరు నిల్వ ఉన్న ప్రదేశానికి వెళ్లింది.

బిస్కెట్‌ను నీటిలో వేసింది. కాస్త మెత్తబడిన తర్వాత సింబాను పిలిచి తినమంది. సింబా సంతోషంగా రెక్కలాడిస్తూ ఎగురుకుంటూ వెళ్లింది. బిస్కెట్‌ను తృప్తిగా తింది.
‘నాకు రాని ఆలోచన నీకు వచ్చిందంటే, అది... నువ్వు నాలుగు చోట్ల తిరగడం వల్లే సాధ్యమై ఉంటుంది. ఇకపై నేను కూడా నీతో వస్తాను. లోకజ్ఞానం తెలుసుకుంటాను’ అని చెప్పింది.

‘ఓ తప్పకుండా.. నాకు అంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది. పైగా నాక్కూడా కాస్త తోడు ఉన్నట్లుంటుంది. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఎక్కువ దూరం వెళ్లి రావొచ్చు’ అని డింకి అంది.
తర్వాత కాసేపు అవి రెండూ, సరదాగా మాట్లాడుకున్నాయి. డింకి తాను గతంలో చూసిన విశేషాలు, ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పింది. మరుసటిరోజు ఉదయాన్నే రెండు కాకులూ... ‘కావ్‌ఁ... కావ్‌ఁ...’ అని అరుస్తూ వేరే ప్రదేశాలు చుట్టి రావడానికి బయలుదేరాయి.

- ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు