బద్ధకమే అసలు శత్రువు!

సత్యమంగళం అనే అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. అది బాగా తెలివైంది.. కానీ చాలా బద్ధకస్తురాలు. ఏ పనీ చేసేది కాదు. కనీసం తన కడుపు నింపుకోవడానికి కావలసిన ఆహార వేటకు కూడా వెళ్లేది

Updated : 11 Jul 2022 06:44 IST

సత్యమంగళం అనే అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. అది బాగా తెలివైంది.. కానీ చాలా బద్ధకస్తురాలు. ఏ పనీ చేసేది కాదు. కనీసం తన కడుపు నింపుకోవడానికి కావలసిన ఆహార వేటకు కూడా వెళ్లేది కాదు. ఎప్పుడూ మృగరాజు సింహం వద్దే ఉంటూ.. దాన్ని పొగుడుతూ, అది తినగా మిగిలింది తింటూ ఉండేది. ‘ముందు నువ్వు బద్ధకం వదిలెయ్‌.. సొంతంగా వేటాడి ఆహారాన్ని సంపాదించుకో. లేకపోతే ఆ బద్ధకమే నిన్ను ఇబ్బంది పెడుతుంది’ అని సింహం ఎంత చెప్పినా.. నక్క వినేది కాదు. ప్రతిరోజూ అడవిలో ఉండే జంతువుల స్వభావం, వాటి లోపాలను సింహానికి చెబుతూ కాలక్షేపం చేసేది. నక్క అలా చెప్పడం సింహానికి నచ్చేది కాదు.

ఒకసారి నక్క అడవి దారి వెంట వెళుతుండగా, దూరంగా వేటగాడు వేసిన ఒక వలను చూసింది. దాన్ని గమనించని కొన్ని కుందేలు పిల్లలు అటుగా వెళ్లసాగాయి. నక్క తన బద్ధకంతో గట్టిగా అరిచి వాటిని ఆపే ప్రయత్నం చేయకుండా, అలాగే కూర్చుంది. ఆ చిన్న జీవులన్నీ పాపం ఆ వలలో వేటగాడికి చిక్కాయి. పైన ఆకాశంలో ఎగురుతున్న కొంగ ఇదంతా గమనించింది. ‘నక్క ఎందుకిలా చేస్తుంది?’ అని అనుకుంటూ.. విషయాన్ని మృగరాజు దగ్గరకు తీసుకెళ్లింది. సింహం నక్కను పిలిచి.. ‘అడవిలో ఉండే జంతువుల కోసం వేటగాళ్లు కాచుకొని కూర్చుంటారు. మన నిబంధనల ప్రకారం జాతి వైరాన్ని పక్కనపెట్టి, ఆపదలో ఉన్న వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ. నీ బద్ధకం వల్ల కుందేలు పిల్లలు వలలో చిక్కుకున్నాయని నాకు తెలిసింది. ఇదేం పని?’ అంటూ మందలించింది. దాంతో నక్క ‘అది.. అది..’ అని సరైన సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలింది. ‘ఇంకోసారి ఇలా జరిగితే నిన్ను చంపటం ఖాయం’ అని హెచ్చరించింది సింహం.

కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహం దగ్గరికి వచ్చిన నక్క.. ‘మహారాజా.. మన అడవిలో కొత్తగా కొన్ని జంతువులు వచ్చాయి. వాటి ప్రవర్తన ఏమీ బాగాలేదు. వాటి వల్ల మన మిత్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు వాటిని ఒకసారి మందలించాలి’ అంది. నక్క చెప్పిన మాటలు విని ఊరుకుంది సింహం. కాసేపటికి తన దగ్గరకు వచ్చిన ఏనుగుతో, నక్క చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది సింహం. అప్పుడు ఏనుగు ‘మహారాజా.. నక్క మాటలు నిజం కాదు. అవి కూడా మనలాంటి జంతువులే. వాటి ఆవాసం పూర్తిగా కాలిపోవడంతో ఇక్కడికి వచ్చాయి. మిమ్మల్ని కలవాలని ప్రయత్నం చేయగా, నక్కే వాటిని అడ్డుకుంది. పైగా వాటి మీద నిందలు వేసి మీకు అబద్ధాలు చెప్తుంది’ అంది. ‘నాకది అర్థమైంది మిత్రమా.. కానీ ఒకసారి నిర్ధారించుకుందామని నిన్ను అడిగా’ చెప్పింది మృగరాజు. ‘మనం చేసే పనిలో నిజాయతీ ఉన్నప్పుడే, మనం చెప్పే మాటలకు విశ్వసనీయత ఉంటుంది. నక్కకు అవేమీ లేవు. అందుకే దాని మాటలు ఎప్పుడూ నమ్మను’ అంది సింహం.              
ఒకరోజు వేటగాడు అడవిలో ఒక పెద్ద గొయ్యి తవ్వాడు. అది కనపడకుండా దానిపైన ఆకులు, కొమ్మలు వేశాడు. నక్కతోపాటు మరికొన్ని జంతువులు కూడా ఆ దారిన వెళుతూ.. ఆ గుంతలో పడిపోయాయి. వాటిలో కొన్ని జంతువులు వేటగాడు వచ్చేలోపు కష్టపడి ఎలాగోలా బయటపడ్డాయి. నక్క మాత్రం ‘ఇప్పుడు పైకి వెళ్లి చేసేది ఏముంది? వేటగాడు వచ్చేటప్పుడు చూసి, అప్పుడు పైకి వెళ్లొచ్చు. ఈలోపు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను’ అని కునుకు తీసింది. తీరా కళ్లు తెరిచి చూసేసరికి.. తాను ఒక వలలో ఉండటం గమనించింది. ‘ఏంటి ఇలా జరిగింది? నా బద్ధకం వల్లే ఇలా ఇరుక్కుపోయాను’ అనుకొని బాధపడింది. ఎలాగైనా సరే వేటగాడి నుంచి తప్పించుకోవాలనుకుంది. దానికో ఉపాయాన్ని ఆలోచించింది.

వేటగాడు భుజాన వేసుకొని తీసుకెళ్తుండగా.. ఒక్కసారిగా నాలుక బయటకు పెట్టి.. కాళ్లూ చేతులూ గిలగలా కొట్టుకోసాగింది నక్క. గమనించిన వేటగాడు వెంటనే దాన్ని వల నుంచి బయటకు తీసి, సపర్యలు చేస్తుండగా.. ఎలాగోలా పరుగెత్తి తప్పించుకుంది. తర్వాత సింహం వద్దకు చేరి, జరిగిన విషయాన్ని చెప్పింది. అప్పుడు సింహం.. ‘నువ్వు జిత్తులమారివి కాబట్టే వేటగాడి దగ్గర్నుంచి చకచక్యంగా బయటపడ్డావు. కానీ నీ బద్ధకమే నీ ప్రాణాల మీదకు తెచ్చిందని ఇప్పటికైనా గుర్తించు. నేను చాలా సార్లు చెప్పాను అయినా సరే నువ్వు పట్టించుకోలేదు’ అని హితబోధ చేసింది. అప్పటి నుంచి నక్క బద్ధకాన్ని వదిలేసింది. నిజాయతీగా ఉంటూ, ఇతరుల లోపాలను మృగరాజుకు చెప్పడం కూడా మానేసింది. అందరికీ సాయం చేయసాగింది. నక్కలో వచ్చిన మార్పునకు జంతువులన్నీ సంతోషించాయి.

- కళ్ళేపల్లి ఏడుకొండలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని