అడవే ఆధారం!

అనగనగా చింతల కొండ అనే కారడవి ఉండేది. తన కుటుంబంతో అక్కడికి కొత్తగా బస చేయటానికి గిరి వచ్చాడు. అతడి వయసు పదిహేను సంవత్సరాలు. ఆ రోజు మధ్యాహ్నం తన తండ్రి సీతన్నతో అడవికి వెళ్లిన గిరికి ఒక చిట్టి చిలుక కనిపించింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా కొమ్మ మీద దిగాలుగా కూర్చున్న ఆ చిలుకను గమనించాడు గిరి. వెంటనే దగ్గరకు వెళ్లాడు.

Updated : 12 Jul 2022 00:28 IST

నగనగా చింతల కొండ అనే కారడవి ఉండేది. తన కుటుంబంతో అక్కడికి కొత్తగా బస చేయటానికి గిరి వచ్చాడు. అతడి వయసు పదిహేను సంవత్సరాలు. ఆ రోజు మధ్యాహ్నం తన తండ్రి సీతన్నతో అడవికి వెళ్లిన గిరికి ఒక చిట్టి చిలుక కనిపించింది.

మండుటెండను సైతం లెక్క చేయకుండా కొమ్మ మీద దిగాలుగా కూర్చున్న ఆ చిలుకను గమనించాడు గిరి. వెంటనే దగ్గరకు వెళ్లాడు. అప్పటి వరకు మనిషి మొహం ఎరుగని ఆ చిట్టి చిలుక ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

అది చూసి ‘భయపడకు మిత్రమా!’ అన్నాడు. అప్పుడు ఆ చిట్టి చిలుక.. ‘ఇంతకీ నువ్వు ఎవరు?’ అని అడిగింది. ‘నా పేరు గిరి. మేము ఈ అడవికి కొత్తగా వచ్చాం. నువ్వు ఎందుకలా దిగులుగా ఉన్నావ్‌?’ అని అడిగాడు. అప్పుడు ఆ చిట్టి చిలుక ‘గత కొద్ది రోజులుగా మా జంతు మిత్రులు కొన్ని ఉండటానికి సరైన నీడ లేక, తాగటానికి సరిగ్గా నీళ్లు లేక, భయంతో అడవిని విడిచి వెళ్లిపోయాయి’ అని గిరితో ఏడుస్తూ చెప్పింది.

ఈ పరిచయంతో.. కొన్ని రోజులకు చిలుకకు గిరితో స్నేహం బాగా బలపడింది. ఓ రోజు చిట్టి చిలుక, గిరిని అడవిలో తిప్పడానికి తీసుకెళ్లింది. అప్పుడు దూరంగా చెట్ల కొమ్మల్లో కూర్చున్న కోతులు గాబరా పడుతూ శబ్దాలు చేశాయి. జింకలు ఆ శబ్దాలు విని పరుగులు తీశాయి. అప్పుడు చిలుక.. ‘ష్‌... ! మాట్లాడకు. అది మృగరాజు ఆగమన సంకేతం’ అంటూ గిరిని చెట్టు కొమ్మల్లో దాక్కోమని చెప్పింది. అక్కడే పక్కన ఉన్న పెద్ద మర్రి చెట్టు కిందకు వచ్చిన సింహం చాలా బిగ్గరగా గర్జించింది. వెంటనే జంతువులన్నీ హుటాహుటిన ఒక్కొక్కటిగా అక్కడకు చేరుకున్నాయి.

మృగరాజు గంభీరంగా... ‘మనలో కొంతమంది మిత్రులు అడవిలో జరుగుతున్న వింత మార్పులపై ఆవేదన వ్యక్తం చేశాయి. అందుకే ఈ సమావేశం’ అంది. ఏనుగులకు నాయకుడైన గజరాజు ముందుకొచ్చి  ‘మహారాజా! సుభిక్షంగా ఉండే మన అడవిలో కొన్ని రోజులుగా వింత వింత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రి చెట్లు మాయం అవుతున్నాయి. పదుల సంఖ్యలో కోతులు నివాసం కోల్పోయి పక్క అడవికి పారిపోయాయి. మిగిలిన ఇంకొన్ని కూడా నేడో రేపో వెళ్లిపోతాయి. అడవిలో చెట్లు తగ్గిపోతున్నాయి. జింకలు ఆకలితో మరణిస్తున్నాయి. మాకు తాగటానికి పెద్ద చెరువులో నీళ్లూ దొరకట్లేదు’ అంది. అప్పుడు మృగరాజు ‘సరే! ఈ పరిణామాలకు కారణం తెలుసుకుని దానికి పరిష్కార మార్గం చెప్తాను’ అంటూ సమావేశాన్ని ముగించింది.

ఇది జరిగిన రెండు రోజులకు, అడవిలోంచి కర్రలు తెస్తున్న సీతన్నతో.. ‘గూడెంలోకి రాత్రి సింహం వచ్చి మేకల మంద నుంచి మేకలను తీసుకెళ్లింది’ అని అక్కడి వాళ్లు చెప్పటం విన్నాడు గిరి. ఆ మరుసటి రోజు సాయంత్రం పోడు భూమి తయారు చేయటానికి కొండపైన అడవికి నిప్పంటించాడు సీతన్న. అదే రోజు అర్ధరాత్రి ఏనుగుల గుంపు వచ్చి కోపంతో పంట చేలను అంతా తొక్కడమే కాకుండా కొన్ని ఇళ్లను కూడా కూల్చే ప్రయత్నం చేశాయి. అప్పుడు బాణాలు చేత పట్టి బయటకు వచ్చాడు సీతన్న. అది చూసిన ఏనుగులు వెనక్కి తగ్గాయి. అయినా మృగరాజు, మేక పిల్లను నోటితో పట్టుకుని, ఏనుగులకు అడ్డంగా నిలబడింది. సీతన్న వెంటనే ఆ జంతు సమూహానికి అగ్గి చూపించి భయపెట్టే ప్రయత్నం చేశాడు. మృగరాజుకు మరింత కోపమొచ్చింది.

అప్పుడు అక్కడే ఉన్న తన స్నేహితుడు గిరిని చూసిన చిలుక, మృగరాజుతో... ‘మహారాజా! శాంతించండి, మీరు అనుమతిస్తే మీ ఆగ్రహానికి కారణం ఏంటో ఈ గ్రామస్థులకు చెప్పే ప్రయత్నం చేస్తాను’ అంది. అది విన్న సింహం కనురెప్పలు వేయకుండా చూస్తూ కోపంగా కూర్చుంది. ఈలోగా సీతన్న.. ‘మా గూడేన్ని ధ్వంసం చేయాలని చూస్తే నేను ఊరుకోను’ అంటూ అరిచాడు. వెంటనే చిలుక తన స్నేహితుడు గిరి భుజంపై వాలి... ‘మిత్రమా! ఆ రోజు మనం అడవిలో ఆడుతున్నప్పుడు మా జంతు నేస్తాలు వ్యక్తపరిచిన ఆవేదనకు కారకులు మీ గ్రామస్థులే. మీరు ఉంటున్న ఈ ప్రదేశం మా రాజా వారి సామ్రాజ్యం. ఇక్కడ మీరు నరికిన చెట్లు మా కోతి నేస్తాలు, పక్షి మిత్రుల నివాసాలు. మీరు పంటకు, వంటకు వాడుతున్న పెద్ద చెరువు నీరు మా జంతు మిత్రులకు దప్పిక తీర్చే ఒకే ఒక్క జల రాశి. నీరు, నీడ కరవై చాలా జంతు మిత్రులు అడవిని విడిచి వెళ్లిపోతున్నాయి. ఇదే మా జంతు మిత్రుల ఆవేదన’ అంటూ మృగరాజు కోపానికి కారణం చెప్పింది.

అది విన్న గిరి... ‘మిత్రమా! పట్నంలోని మా భూములను, ఇళ్లను కోల్పోవడంతో ఇక్కడికి వచ్చాం. మరి ఇక్కడ మీరు కూడా మమ్మల్ని ఉండనీయకపోతే మేం ఎక్కడ బతకాలి?’ అని ఏడుస్తూ.. తన తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు.

తాము చేస్తున్న పొరపాటు ఏంటో సీతన్నతోపాటు అక్కడి వారికీ అర్థమైంది. ‘మనమంతా అడవి తల్లి బిడ్డల్లా కలసి మెలసి ఉందాం. చెట్లను నాటుదాం. అడవిని కాపాడుదాం. జంతువులను బతకనిద్దాం’ అన్నాడు సీతన్న. అది విన్న సింహం.. ‘అయినా మేం మీ మనుషులంత క్రూరం కాదు. మీరు ఇక్కడే ఉండొచ్చు, కానీ మా స్థావరాలను తాకొద్దు. మనమంతా ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టకుండా అందరం కలిసి మెలసి ఇక్కడే ఉందాం’ అంటూ అడవిలోకి వెళ్లిపోయింది.

- ఆదిత్య పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని