నది మునిగింది!

దాహం తీర్చుకోవడానికి అడవిని ఆనుకొని ఉన్న నది దగ్గరకు వచ్చిన కుందేలుకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అక్కడ ఉండాల్సిన నది కనపడలేదు. కేవలం ఇసుక మాత్రమే ఉంది.

Updated : 13 Jul 2022 01:09 IST

దాహం తీర్చుకోవడానికి అడవిని ఆనుకొని ఉన్న నది దగ్గరకు వచ్చిన కుందేలుకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అక్కడ ఉండాల్సిన నది కనపడలేదు. కేవలం ఇసుక మాత్రమే ఉంది.

‘నిన్న కూడా కనిపించిన నది, ఈరోజు ఎలా మాయమైందబ్బా..!’ అంటూ ఆలోచనలో మునిగిపోయింది కుందేలు. ఇంతలో రివ్వున ఎగురుతూ ఓ కాకి అక్కడకు వచ్చింది.

‘అయ్యో.. నది మునిగిపోయింది’ అంటూ అది అరిచింది. కుందేలు కంగారుగా అడవిలోకి పరిగెత్తింది. కనపడ్డ ప్రతి జంతువుకు ‘నది మునిగింది’ అని చెప్పుకొంటూ.. మృగరాజైన సింహం గుహ దగ్గరకు చేరింది.

రొప్పుతూ వచ్చిన కుందేలును చూసి మంత్రి కోతి, ‘ఏమైంది కుందేలూ... ఎవరైనా నిన్ను భయపెట్టారా!? ఎందుకిలా పరుగెత్తుకుంటూ వస్తున్నావు?’ అంటూ ప్రశ్నించింది.

‘నది మునిగిపోయింది’ అని చెప్పింది కుందేలు. కోతి ఆశ్చర్యపోయింది. ఈ మాటలన్నీ గుహ లోపల నుంచే వింటున్న సింహం కంగారుగా బయటకు వచ్చింది. ‘నది ఎలా మునిగింది? ఎప్పుడు మునిగింది? దీని వెనక ఏదైనా కుట్ర ఉందా?’ అంటూ కోపంతో గర్జించింది.

అందుకు మంత్రి కోతి, ‘రాజా.. నిద్ర మత్తులో ఉండి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతోందా? కుందేలు చెప్పడం. మీరు నమ్మడం. నది ఎక్కడైనా మునిగి పోతుందా..! విచిత్రం కాకపోతే’ అంది.

‘మరి నది ఎక్కడకు పోయింది. ఒకసారి చూద్దాం పద..’ అంటూ సింహం చూడటానికి బయలుదేరింది. కోతి, కుందేలు దాన్ని అనుసరించాయి. నది దగ్గరకు చేరగానే అడవిలోని జంతువులన్నీ అక్కడే కనిపించాయి.

‘అయ్యో.. ఘోరం జరిగిపోయింది. మహారాజా..! నది మునిగి పోయింది. మనకు దాహం తీర్చుకోవడం కష్టమే. మనం నీళ్లు లేకుండా ఎలా బతకాలి...?’ అంటూ జంతువులన్నీ సింహాన్ని ప్రశ్నించాయి.

సింహం నది దగ్గరకు వెళ్లి పరిశీలించింది. నిజంగానే నది లేదు. సింహానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అడవంతా ప్రచారం చేసిన కాకి, సింహం దగ్గరకు వచ్చి ఇలా అంది. ‘రాజా... మన అడవికి ఏదో కీడు సోకింది. మనం గుడ్లగూబతో శాంతి చేయిస్తే మంచిది..’ సింహం అయోమయంగా చూస్తుండగా మంత్రి కోతి అక్కడకు వచ్చింది.

‘ఏయ్‌..పిల్ల కాకి.. రాజు గారికి లేని పోని సలహాలు ఇవ్వకు. ఆయన నీ మాట విన్నా వింటాడు. అసలు నది మునిగిపోవడం అనేది ఎక్కడా జరగదు. ఎండలు బాగా ఉండటం వల్ల క్రమంగా నది ఎండిపోయింది. మళ్లీ వర్షాలు పడితే నది ప్రత్యక్షమవుతుంది’ అంది.  పెద్దగా లోకజ్ఞానం లేని సింహం ఏం మాట్లాడాలో అర్థం గాక తల గోక్కుని జూలు సవరించుకుంది.

‘సరే... వర్షాలు పడ్డాక మళ్లీ వద్దాం పదండి’ అంటూ సింహం అడవిలోకి కదిలింది. జంతువులన్నీ సింహాన్ని అనుసరించాయి. కానీ జంతువుల్లో చర్చ మొదలైంది. ‘ఏంటీ కోతి పెత్తనం.. రాజు గారిని మరీ తీసి పారేస్తోంది.’  
‘కాకి చెప్పింది నిజమే.. శాంతి పూజ చేయిస్తేనే మంచిది’ అనీ.. ‘కోతి చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది’ అనీ.. జంతువులన్నీ చర్చించుకుంటూ తమ స్థావరాలకు చేరుకున్నాయి. ఆ రాత్రి అడవిలో పెద్ద వర్షం పడింది. అలా మూడు రోజుల పాటు వర్షం అడవిని తడిపేసింది. వర్షం ఆగిపోగానే కాకి నది దగ్గరకు వెళ్లింది.

ఆశ్చర్యం, అక్కడ నది ప్రవహిస్తూ కనపడింది. ఇంకేముంది... ఏ విషయాన్నీ కడుపులో దాచుకోలేని కాకి అడవిలోకి వెళ్లి... ‘మునిగిపోయిన నది, బయటకు తేలింది’ అంటూ జంతువులన్నింటికీ సమాచారం అందించింది.

అడవిలోని జంతువులన్నీ నదిని చూడటానికి పరుగెత్తుకెళ్లాయి. సింహం కూడా వాటితో పాటు పరిగెత్తింది. కోతి మాత్రం తల పట్టుకు కూర్చుంది.

- వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని