మనమంతా అతిథులమే!

హిందూ మహాసముద్రంలో హరిత ద్వీపం అనే ఒక దీవి ఉండేది. పేరుకు తగినట్టుగానే అది చెట్లు, పొదలు, తీగజాతి మొక్కలతో ఆకుపచ్చ రంగులో మెరిసిపోతుండేది. వివిధ రకాల పక్షులు, పలు రకాల చిన్న చిన్న జంతువులు ఆ హరిత దీవిలో హాయిగా జీవిస్తుండేవి.

Published : 14 Jul 2022 00:52 IST

హిందూ మహాసముద్రంలో హరిత ద్వీపం అనే ఒక దీవి ఉండేది. పేరుకు తగినట్టుగానే అది చెట్లు, పొదలు, తీగజాతి మొక్కలతో ఆకుపచ్చ రంగులో మెరిసిపోతుండేది. వివిధ రకాల పక్షులు, పలు రకాల చిన్న చిన్న జంతువులు ఆ హరిత దీవిలో హాయిగా జీవిస్తుండేవి.

ఆ దీవిని చూసి ముచ్చటపడి ఒక మునీశ్వరుడు అక్కడే ఉండిపోయాడు. ఆయన ఎప్పుడూ ఆలోచనలతోనే గడిపేవాడు. అతడు హాని తలపెట్టకపోవడం చూసి అక్కడుండే జంతువులు, పక్షులు ఆయనతో చనువుగా ప్రవర్తించసాగాయి. ఉడుతలు, కుందేళ్లు ఆయన చుట్టూ తిరుగుతుండేవి. చిన్న చిన్న పిట్టలు ఆయన భుజాలపై వాలుతుండేవి. సీతాకోక చిలుకలైతే ఆయన ముందు ఎగురుతూ కనువిందు చేస్తుండేవి. నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తుండేవి. మునీశ్వరుడికి ఆ దీవి స్వర్గమే అయింది. ఆ ప్రశాంత వాతావరణంలో ఆయన ప్రకృతి గురించి లోకానికి చెప్పడానికి ఒక మంచి గ్రంథం రాయాలనుకున్నాడు.

రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కొందరు రాజకుమారులు నౌకా విహారం చేస్తూ దారి తప్పి ఆ హరిత దీవిని చేరుకున్నారు. మానవ సంచారం కనబడక పోవడంతో మొదట భయపడినా అక్కడి ప్రకృతి సౌందర్యం చూసి భయం మరిచిపోయారు. ఉత్సాహంతో ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ దీవిలో తిరగసాగారు. అక్కడితో ఆగితే బాగుండేది. కానీ, వారిలోని చపలచిత్తం, దుడుకుతనాన్ని ప్రదర్శించారు.

ఆకలిని తీర్చుకోవడానికి వాళ్లు చెట్ల మీద పడ్డారు. పండ్ల కోసం ఏకంగా చెట్ల కొమ్మలనే విరవసాగారు. మొక్కలు, పొదలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా జంతువులు, పక్షులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అంతే, దీవిలో అలజడి ఆరంభమైంది. కమ్మగా వినిపించే పక్షుల కూతలు ఆందోళనతో నిండిపోయాయి. హాయిగా, స్వేచ్ఛగా తిరిగే జంతువులు భయంతో వికారంగా అరవసాగాయి.

ఏకాగ్రతతో గ్రంథం రాసుకుంటున్న మునీశ్వరుడి ఆలోచనలకు భంగం కలిగింది. రాయడం ఆపి పరిసరాలు పరిశీలించాడు. భయంతో దిక్కుతోచని జంతువులు, ఆందోళనతో ఎగురుతున్న పక్షులు కనిపించాయి. ఆయన మనసు చివుక్కుమంది. ‘దీవిలోకి ఎవరో ప్రవేశించి ఉంటారు.. అందుకే ఈ అలజడి!’ అని మునీశ్వరుడు అనుకున్నాడు. అంతలో రాజకుమారులు అక్కడకు వచ్చారు. మునీశ్వరుడు కనిపించే సరికి వారు బిత్తరపోయారు. ‘ఎవరు మీరు?’ అని వారిని ప్రశ్నించాడు మునీశ్వరుడు. తాము రాజకుమారులమనీ, సమరభేరి దీవిలో గల యుద్ధవిద్యా కేంద్రంలో శిక్షణ పొందుతున్నామని చెప్పారు. సముద్ర విహారానికి వచ్చిన తాము దారి తప్పి ఈ దీవికి చేరామన్నారు. అప్పుడు మునీశ్వరుడు ఓడను ఎక్కడుంచారో అక్కడకు తీసుకు వెళితే దారి చూపించగలనని వారితో అన్నాడు.

మునీశ్వరుని మాటలతో రాజకుమారులు ‘హమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకున్నారు. ఓడను నిలిపిన చోటుకు ఆయన్ను తీసుకు వెళ్లసాగారు. దారంతా చిందరవందరగా ఉండటం చూసిన మునీశ్వరుడు.. ఇది కచ్చితంగా రాజకుమారుల పనే అనుకున్నాడు. చాలా బాధ పడ్డాడు. ఆ బాధ క్రమంగా కోపంగా మారింది. కాసేపు ఒక చెట్టు నీడలో నిలబడిపోయాడు. కోపం చల్లారాక అతడు రాజకుమారులతో ‘ఇలా చిందరవందర చేసింది మీరేనా?’ అని ప్రశ్నించాడు. రాకుమారులు మౌనంగా తల దించుకున్నారు.
అప్పుడు మునీశ్వరుడు వారితో... ‘మీరు కాబోయే పాలకులు. బాధ్యత మీ ఊపిరవ్వాలి. మీరు వేసే ప్రతి అడుగు ముందు తరాలకు మంచి దారి చూపించగలగాలి. కంచే చేను మేస్తే, ఆ చేనుకు రక్షణ ఎక్కడుంటుంది?’ అని ప్రశ్నించాడు. అంతటితో ఆగక... ‘మన భారం మోసే భూగోళం శాశ్వతం. దాని మీద బతికే జంతువులు, పక్షులు, మనం అశాశ్వతం’ అన్నాడు.

‘అతిథులుగా ఎవరింటికైనా వెళితే మనం ఆ ఇంటిని పాడు చేసి వస్తామా? అలా చేయం కదా.. అది మర్యాదనిపించుకోదు! ఈ భూమి మీదకు కొంత కాలం మాత్రమే ఉండడానికి వచ్చిన మనం, ఈ భూగోళానికి అతిథుల్లాంటి వారం. అందువల్ల మనం భూగోళంపై ఉన్న వనరులకు నష్టం కలిగించరాదు. వాతావరణానికి ముప్పు తీసుకురాకూడదు. భూమాతకు చేటు తెచ్చే పనులు చేయరాదు. తెలివితేటల్లో మన కంటే తక్కువని అనుకున్న పక్షులు, జంతువులు ఏనాడు కూడా భూగోళానికి హాని కలిగించే పనులు చేయవు. కానీ, తెలివిగలవారమని గర్వపడే మనం మాత్రం మనకన్నీ సమకూర్చి పెట్టే భూగోళం పాడు చేయడానికి పూనుకుంటాం. ఇదెక్కడి ధర్మమో మీరే ఆలోచించండి! ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడినట్టు.. ఈ భూమిని, దీనిపై ఉన్న వనరులను కాపాడితేనే అవి సమస్త జీవులను కాపాడతాయి. మనం ఈ భూమిని, దీనిపై ఉన్న వనరులను పాడు చేసుకుంటూ పోతే మనం, ఈ భూమిపై గల జీవులు బతకడానికి అవకాశాలు మరి ఉండవు. కాబోయే పాలకులారా, నా మాటలు మరువకండి! మీ పరాక్రమాన్ని శత్రు సంహారం కోసం ఉపయోగించండి, కానీ ప్రకృతి వినాశనానికి మాత్రం వినియోగించకండి. ప్రకృతి నాశనమైతే ఈ భూమి నివాసయోగ్యంగా ఉండదు. అప్పుడు మీ రాజ్యాలు ఉండవు, మీ అధికారాలూ ఉండవు!’ అని బోధించాడు.
రాకుమారులు తమ తప్పును అంగీకరించారు. ప్రకృతికి ఏనాడూ హాని చేయమని, చేయనివ్వమని మునీశ్వరుడికి మాటిచ్చి.. ఆయన చూపిన దిక్కుగా ఓడలో బయలుదేరారు.

- బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని