బడి ఇచ్చిన బహుమతి

ఆడపిల్లల కబడ్డీ పోరు జోరుగా సాగుతోంది. ఆటను ఆసక్తిగా చూస్తూ మధ్య మధ్య తన కాళ్లను తడుముకుంటోంది సింధు. అది చూసిన శారద టీచరుకు చాలా బాధ కలిగింది. మొన్న మొన్నటి వరకు లేడిపిల్లలా గంతులేస్తూ అన్నింటిలో ప్రథమ బహుమతులు సాధించేది.

Published : 15 Jul 2022 00:58 IST

ఆడపిల్లల కబడ్డీ పోరు జోరుగా సాగుతోంది. ఆటను ఆసక్తిగా చూస్తూ మధ్య మధ్య తన కాళ్లను తడుముకుంటోంది సింధు. అది చూసిన శారద టీచరుకు చాలా బాధ కలిగింది. మొన్న మొన్నటి వరకు లేడిపిల్లలా గంతులేస్తూ అన్నింటిలో ప్రథమ బహుమతులు సాధించేది. ఆదివారం సెలవులు వచ్చాయంటే చాలు... సింధు ఇంట్లో ఉండేది కాదు. తల్లి, తండ్రితో కలిసి కూలి పనులకు వెళ్లేది. వచ్చిన డబ్బులతో తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా అవసరమైన పుస్తకాలు, పెన్నులు కొనుక్కునేది. పిల్లలు చాలా మంది.. బడి ముందు సైకిల్‌ తాత తెచ్చిన పండ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు కొనుక్కుని తినేవారు.

వాళ్లు తింటూ, సింధుకు ఇవ్వబోతే అస్సలు వద్దనడం గమనించింది. వాళ్లు... ‘ఓ పిసినారి సింధూ! నిన్నేం, కొనివ్వమని అడగంలే’ అని వెక్కిరిస్తుంటే, సింధు ఏమంటుందో అని ఓ చెవి అటువేసి వినేది శారద టీచర్‌. ఎంతో శాంతంగా.. ‘మీరేమన్నా ఫరవాలేదు. మీరెంత అడిగినా కొనివ్వను. ఉంటే ఇంట్లోవే తెచ్చి పెడతా!’ అని నవ్వుతూ చదువుకోవడం, రాసుకోవడంలో మునిగిపోయేది.

ఓరోజు ఖాళీ పీరియడ్‌లో టీచర్‌కు సింధుతో మాట్లాడాలనిపించింది. పిలిపించడంతోనే బుద్ధిగా చేతులు కట్టుకుని వచ్చి నిల్చుంది. ‘సింధూ! నిన్నో మాట అడగాలని ఉంది. సమాధానం చెబుతావా?’ అంది. ఏం తప్పు చేశానోనని మనసులో అనుకుంటూ భయం భయంగా.. ‘ఏం మాట మేడం?’ అంది. ‘ఏయ్‌! పిచ్చి పిల్లా! భయపడుతున్నావా?’ అని భుజం తట్టడంతో ధైర్యం వచ్చింది సింధుకు.

‘అందరూ ఇంటర్‌వెల్‌ సమయంలో ఏదో ఒకటి కొనుక్కుని తింటుంటే చూస్తున్నాం. నువ్వు మాత్రం ఒక్కనాడన్నా కొనగా చూడలేదు. డబ్బులు లేవా..? ఇదిగో ఈ యాభై తీసుకో! ఏదైనా తినాలని అనిపిస్తే తిను. నేను ఎవరికీ చెప్పనులే..’ అంటున్న శారద మేడం మాటలకు కళ్లలో నీళ్లు తిరిగాయి సింధుకు.

‘మేడం! మాకు ఏ ఆస్తీ లేదు. అమ్మానాన్నా కూలికి పోతేనే ఇల్లు గడుస్తుంది. నానమ్మ, తమ్ముడు ఏ పనీ చేయలేరు. అందుకే అమ్మను, నాన్నను డబ్బులు అడగను. ఎప్పుడన్నా ఇస్తే, భవిష్యత్తులో పనికి వస్తాయని కిడ్డీ బ్యాంకులో దాచిపెడతా’ అని ఎంతో ముందుచూపుతో మాట్లాడిన సింధు మాటలకు, వయసుకు మించిన పరిణితికి టీచర్‌ ఆశ్చర్యపోయారు. ఇస్తున్న నోటును సున్నితంగా తిరస్కరించింది. అవన్నీ గుర్తుకు రావడంతో శారదా టీచర్‌ కళ్లు చెమర్చాయి.

ఓ ఆదివారం సింధు, అమ్మానాన్నలతో కలిసి పనికి వెళ్లింది. వచ్చేటప్పుడు వాళ్లు ఎక్కిన ఆటో బోల్తాపడింది. సింధు ఎడమ మోకాలు కింది భాగం నలిగిపోతే అంతవరకు తీసేశారు. అప్పుడు డబ్బు అవసరం ఉంటుందేమోనని టీచర్లు తలా కొంత జమ చేశారు. కొంతైనా సహాయం చేద్దామని వెళ్లారు. సింధు అమ్మానాన్న తమ అమ్మాయి గురించి చెబుతుంటే స్టాఫ్‌ అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ల అమ్మానాన్నలను బతిమిలాడి నెలనెలా డబ్బులు పోస్టాఫీసు పొదుపు పథకంలో వేయించేదని, అవే ప్రమాదం జరిగినప్పుడు అక్కరకు వచ్చాయని చెబుతుంటే అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. సింధు ముందు చూపునకు సంతోషం, మరోపక్క జరిగిన సంఘటనకు బాధా కలిగాయి. సింధు నెమ్మదిగా కోలుకుంది.

ఒకరోజు ఆటను తదేకంగా వీక్షిస్తున్న సింధును చూస్తూ, ఓ దృఢ నిశ్చయానికి వచ్చారు శారద. సింధు కాలు కొలత తీసుకుని జైపూర్‌ కృత్రిమ కాలు కోసం ప్రయత్నం చేశారు. స్కూల్‌ స్టాఫ్‌ అంతా శారద మేడం చొరవకు మెచ్చుకుని తమ వంతు సహకారం అందించారు.

ఆరోజు ఆగస్టు పదిహేను. ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలు వచ్చిన బహుమతులు అందుకోవడానికి హుషారుగా వేదిక మీదకు వస్తూ పోతున్నారు. ఇంతలో ప్రధానోపాధ్యాయులు సింధును స్టేజీ మీదకు పిలిచారు. అందరికీ ఆశ్చర్యం. ‘ఎందులో గెలిచిందని పిలిచారబ్బా!’ అంటూ గుసగుసలాడుకోసాగారు పిల్లలు. పిలుపు వినగానే ఉలిక్కిపడింది సింధు. ఊత కర్ర సవరించుకుని బెంచీ మీద నుంచి లేచి నిలబడింది. శారద మేడం తన దగ్గరకు వెళ్లి, నెమ్మదిగా నడిపించుకుంటూ స్టేజీ మీదకు తీసుకెళ్లారు. అప్పుడే వచ్చిన డాక్టర్ల బృందం సింధుకు కృత్రిమ కాలు తొడిగి, వేదిక మీద అటూ ఇటూ నడిపించారు. ఆమెలో ఆనందం.. కన్నీళ్ల  రూపంలో బయటకొచ్చింది. ‘నీలాంటి తెలివైన అమ్మాయి అలా ఏడవకూడదు. నీకు తెలియకుండా మీ అమ్మానాన్నా పస్తులుండి, ఈ కాలు పెట్టించాలని డబ్బు దాస్తున్నారు. అదేమో నీ ఉన్నత చదువులకు. ఇది మన బడి నీకు ఇస్తున్న బహుమతి. ఇక నుంచి నువ్వు చక్కగా నడవొచ్చు. నువ్వు అనుకున్నది సాధించవచ్చు’ అంటున్న ప్రధానోపాధ్యాయుడి మాటలకు పిల్లలంతా ఆనందంతో గట్టిగా చప్పట్లు కొట్టారు.

అప్పుడే అక్కడికి చేరుకున్న సింధు తల్లిదండ్రులు అంతా శారదమ్మ గారి చలువ అంటూ ఆమె చేతులను కళ్లకు అద్దుకున్నారు. సముద్రమంత జ్ఞానాన్ని గురువుల నుంచి గ్రహించిన సింధు సింధువే అయ్యింది. అనుకున్నది సాధించి ఊరికే గర్వకారణమైంది.

- వురిమళ్ల సునంద


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని