ప్లాస్టిక్‌ ఇవ్వండి.. పుస్తకాలు తీసుకెళ్లండి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. కూరగాయలకు వెళ్లినా, స్టేషనరీ కొన్నా.. మనలో చాలామంది ఆయా దుకాణాల్లో ఇచ్చే ప్లాస్టిక్‌ కవర్లలోనే సామగ్రిని తీసుకెళ్తుంటారు. ఇంటికొచ్చాక ఆ కవర్లను చెత్త బుట్టలో పడేస్తారు.

Published : 15 Jul 2022 00:58 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. కూరగాయలకు వెళ్లినా, స్టేషనరీ కొన్నా.. మనలో చాలామంది ఆయా దుకాణాల్లో ఇచ్చే ప్లాస్టిక్‌ కవర్లలోనే సామగ్రిని తీసుకెళ్తుంటారు. ఇంటికొచ్చాక ఆ కవర్లను చెత్త బుట్టలో పడేస్తారు. ఒక్కసారి వాడి పడేసే ఇటువంటి ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలు అన్నీఇన్నీ కావు. అందుకే, ఓ నేస్తం వాటి కట్టడికి కృషి చేస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఆ వివరాలే ఇవీ..

మణిపూర్‌కు చెందిన పదేళ్ల లిసిప్రియ పర్యావరణ ప్రేమికురాలు. చిన్నతనం నుంచే ప్రకృతికి హాని కలిగించొద్దనీ, ప్లాస్టిక్‌ తదితర వ్యర్థాల కట్టడికి వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందీ బాలిక. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటీవల ‘ప్లాస్టిక్‌ మనీ షాప్‌’ అనే సరికొత్త ఆలోచనతో వార్తల్లో నిలిచింది. ఈ వినూత్న ప్రయోగానికి అందరూ తనను అభినందిస్తున్నారు.

కేజీ ప్లాస్టిక్‌ ఇస్తే..  
ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లేలా, సౌరశక్తితో పనిచేసే ఓ మొబైల్‌ వాహనాన్ని దిల్లీ యూనివర్సిటీ ముందు ఏర్పాటు చేసింది లిసిప్రియ. ఆ బండి ఉద్దేశం ఏంటంటే.. ఎవరైనా సరే, ఒక్కసారి మాత్రమే వాడి పడేసే ప్లాస్టిక్‌ను కేజీ తీసుకెళ్లి ఇస్తే.. దానికి బదులుగా బియ్యం లేదా నోటు పుస్తకాలు పట్టుకెళ్లొచ్చు. సరకులేవీ వద్దనుకున్న వారు.. ఎంచక్కా అక్కడే ఉండే మొక్కలను ఇంటికి తీసుకెళ్లి నాటొచ్చు. ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాలను యువతకు, చిన్నారులకు తెలియజేయాలనే.. మొబైల్‌ వాహనాన్ని దిల్లీ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసినట్లు చెబుతుందీ బాలిక.

రీసైకిల్‌ చేసి..
అలా తాను సేకరించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఉన్న రీసైక్లింగ్‌ ప్లాంట్లకు తరలిస్తుందట. ఇదివరకే ఆయా ప్లాంట్ల యాజమాన్యాలతోనూ లిసిప్రియ మాట్లాడింది. ఆ ప్లాస్టిక్‌తో పర్యావరణహిత టైల్స్‌, ఇంటి పైకప్పు షీట్లు, బెంచీలూ తయారు చేస్తారు. ప్రజలకు అర్థమయ్యేలా.. ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ ఉత్పత్తులను వాహనం దగ్గరే ప్రదర్శనగా ఉంచుతోంది. కొద్దిరోజుల్లోనే ప్లాస్టిక్‌ తీసుకొని, సామగ్రి ఇచ్చే మొబైల్‌ వాహనాలను ఇతర రాష్ట్రాల్లోని పాఠశాలలూ, కాలేజీల సమీపంలో ఏర్పాటు చేయనుందట. దిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల నుంచి సేకరించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేశాక.. వచ్చిన సామగ్రితో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాన్ని కూడా రూపొందించిందీ చిన్నారి.

ఇంటి నుంచే మొదలవ్వాలి..
‘ఒక్కసారి వాడి పారేసే బాటిళ్లూ, కవర్లూ, ఐస్‌క్రీమ్‌ రేపర్లతో వాతావరణం కలుషితమవుతోంది. మనుషులతోపాటు మూగజీవాలకూ అవి ముప్పుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకే నా వంతుగా ప్రయత్నాలు చేస్తున్నా. మన ఇంటి నుంచే ప్లాస్టిక్‌ను అంతం చేసే పని మొదలవ్వాలి’ అని లిసిప్రియ చెబుతోంది. నేస్తాలూ.. ఈ అక్క చెబుతున్నట్లు, ఇకనుంచి మనం కూడా ప్లాస్టిక్‌కు ‘నో’ చెప్పేద్దామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని