తాబేలుకు తెలిసొచ్చింది!

ఒకరోజు చెరువులోని తాబేలు గట్టు మీదకొచ్చి, చెట్టు కింద దిగాలుగా కూర్చొంది. అప్పుడే అక్కడకు వచ్చిన కుందేలు అది గమనించింది. ‘ఏంటి తాబేలు మామా.. దిగులుగా ఉన్నావు?’ అని అడిగింది. దానికి తాబేలు.. ‘ఏం లేదు అల్లుడు’ అని బదులిచ్చింది. ‘నా దగ్గర కూడా దాస్తున్నావా మామా!

Updated : 16 Jul 2022 03:53 IST

ఒకరోజు చెరువులోని తాబేలు గట్టు మీదకొచ్చి, చెట్టు కింద దిగాలుగా కూర్చొంది. అప్పుడే అక్కడకు వచ్చిన కుందేలు అది గమనించింది. ‘ఏంటి తాబేలు మామా.. దిగులుగా ఉన్నావు?’ అని అడిగింది. దానికి తాబేలు.. ‘ఏం లేదు అల్లుడు’ అని బదులిచ్చింది. ‘నా దగ్గర కూడా దాస్తున్నావా మామా! నీ బాధ నాకు చెప్పకూడదా.. నేను వినకూడదా!’ అంది. ‘అదేం లేదు అల్లుడూ.. అడవిలో జంతువులన్నీ పరిగెడతాయి. పక్షులు ఆకాశంలో రివ్వున ఎగురుతాయి. పాములు, చేపలు, కప్పలు కూడా వేగంగా పోతాయి. అంతెందుకు, నాకంటే చిన్నవాడివైన నువ్వు కూడా వేగంగా పరిగెడతావు. శత్రువుల నుంచి క్షణంలో తప్పించుకుంటావు. అదే నేనైతే..’ అని వాపోయింది.

‘దేవుడు ఒక్కో జీవిని ఒక్కో రకంగా సృష్టించాడు. మన బలహీనతలను చూసి మనం బాధ పడకూడదు. నువ్వు నీటిలో జీవించగలవు. నేను నేలపైనే జీవించగలను. ఇద్దరం స్నేహంగా ఉన్నా మన ఆహారం వేరు.. జీవన విధానం వేరు’ అంటూ తాబేలును ఓదార్చే ప్రయత్నం చేసింది కుందేలు. ‘ఎన్ని చెప్పినా నా ఆకారాన్ని, నడకను చూస్తే నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు ముద్దుగా, తెల్లగా, అందంగా ఉంటావు. దేవుడు నాపై కోపంతో నీకిచ్చిన ఆ మూడు లక్షణాల్లో ఒక్కటీ నాకు ఇవ్వలేదు. చివరికి, నాకన్నా చిన్నవైన చీమలు కూడా నన్ను దాటి ముందుకు వెళ్లిపోతుంటాయి. వాటిని చూస్తుంటేనే సిగ్గుగా ఉంది. లేడి పిల్లలా చెంగుచెంగున గెంతాలని, పక్షుల్లా గాల్లో స్వేచ్ఛగా ఎగరాలని, సరదాగా చెట్టెక్కాలని.. ఇలా ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి. కానీ అవన్నీ నెరవేరవు. నేను నడుస్తానని ఎవరూ అనుకోరు. పాకుతున్నాననే పొరబడుతుంటారు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది తాబేలు.

‘మామా! నీ గురించి నువ్వు చాలా తక్కువగా ఊహించుకుంటున్నావు. అది మంచిది కాదు’ అని నచ్చజెప్పబోయింది కుందేలు. ‘నువ్వు ఎన్ని మాటలు చెప్పినా.. నాలాగా నెమ్మదిగా నడిచే జంతువులు, చిన్న జీవులు ఈ అడవిలోనే లేవు’ అంది తాబేలు. ‘నువ్వు నా ఆకారాన్ని ఎంత సమర్థించినా.. వెనక నుంచి నవ్వుకునే జంతువుల మాటలు చెవిలో మార్మోగుతూనే ఉన్నాయి’ అని కుందేలుతో అంది తాబేలు. కుందేలు ఏదో మాట్లాడబోగా.. ‘అల్లుడూ.. నువ్వు నాకన్నా చిన్నవాడివి. నాలాగా పుట్టుంటే ఆ బాధేంటో నీకు తెలిసేది. పైగా నేను కనబడకుండా.. నామీద పెద్ద బరువులాంటి డొప్ప ఒకటి. దాన్ని మోయలేక చస్తున్నాను. దాని వల్ల నా శరీరం ఎవరికీ కనిపించదు’ అంది తాబేలు. ‘అది కాదు మామా! ప్రతి ప్రాణి పుట్టుకకు ఒక పరమార్థం ఉంటుంది. అది ఏదో ఒక సమయంలో బయట పడుతుంది’ అనిని సర్దిచెప్పింది కుందేలు. ‘పనికిరాని మాటలు కట్టిపెట్టు’ కోపంగా అంది తాబేలు. ‘నీకు మంచి మాటలు చెప్పటం వృథా’ అని కుందేలు అక్కడ నుంచి వెళ్లబోయింది.

ఇంతలో దూరం నుంచి సింహ గర్జన వినిపించింది. దాంతో అడవిలోని జంతువులు తలో దిక్కుకు పరుగులు తీశాయి. కుందేలు పొదల్లోకి వెళ్లి దాక్కుంది. తన పక్క నుంచే జింకలు, దున్నలు, జిరాఫీలు, అడవి పందులు పరుగులు తీయటం తాబేలు కళ్లారా చూసింది. సింహం గాండ్రింపునకు పురి విప్పి నాట్యం చేస్తున్న నెమళ్లు సైతం పారిపోయాయి. తాబేలు ఉన్న ప్రదేశానికి సింహం వచ్చేసరికి.. జంతువులన్నీ సురక్షితంగా తప్పించుకున్నాయి. ఆహారం దొరక్కపోవడంతో సింహం కోపం రెట్టింపైంది. ఆవేశంతో పంజా ఎత్తి, నేల మీద కొట్టబోయిన దానికి కింద తాబేలు కనపడింది. పెద్ద ప్రాణులు తప్పించుకున్నా.. తాబేలు దొరకడంతో కాస్త శాంతించింది. ఆకలి మీదున్న మృగరాజు దాన్ని తినాలనుకుంది. అది మాత్రం ముందు జాగ్రత్తగా తన తల, కాళ్లను డొప్పలోకి ముడుచుకొని కదలకుండా రాయిలా ఉండిపోయింది. సింహం విశ్వప్రయత్నం చేసినా.. డొప్ప కారణంగా దాన్ని తినలేకపోయింది. తన పదునైన దంతాలతో డొప్పను పగలగొట్టాలని చూసినా సాధ్యపడలేదు. విసుగుపుట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. చివరకు తాబేలును వదిలేసి వెళ్లిపోయింది.

సింహం బారి నుంచి తప్పించుకోవటంతో తాబేలు ఊపిరి పీల్చుకుంది. ఇంతలో పొదల్లోంచి కుందేలు బయటకు వచ్చింది. తాబేలును సమీపించి.. ‘ఇప్పటిదాకా నువ్వు నీ నడకను, డొప్పను అసహ్యించుకున్నావు. చివరకు ఆ డొప్పే నిన్ను రక్షించింది. జంతువులన్నీ సింహం బారి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశాయి. నేను కూడా అంతే. కానీ, నువ్వు మాత్రం ధైర్యంగా ఇక్కడే నిలబడి ప్రాణాలు కాపాడుకున్నావు’ అంది కుందేలు. ‘అవును... నువ్వు చెప్పింది నిజమే! అనవసరంగా నన్ను నేను నిందించుకున్నాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను. మరెప్పుడూ ఎవరితోనూ పోల్చుకోను’ అంటూ కుందేలుకు వీడ్కోలు పలికి చెరువు వైపు నడిచింది తాబేలు.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని