ఎవరు ఉత్తమ శిల్పి?

సూర్యగిరి రాజ్యాన్ని రత్నాకరుడు పాలించేవాడు. అతని మంత్రి సుశర్మ. ఒకసారి రాజు, మంత్రి మారువేషాల్లో సీతాపురం అనే గ్రామం వెళ్లారు. అక్కడ ఒక ఇరవై సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి రాళ్లను

Published : 17 Jul 2022 00:20 IST

సూర్యగిరి రాజ్యాన్ని రత్నాకరుడు పాలించేవాడు. అతని మంత్రి సుశర్మ. ఒకసారి రాజు, మంత్రి మారువేషాల్లో సీతాపురం అనే గ్రామం వెళ్లారు. అక్కడ ఒక ఇరవై సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి రాళ్లను శిల్పాలుగా చెక్కసాగాడు. అవి ఎంతో అందంగా ఉన్నాయి.

‘బాబూ! నీ పేరు ఏంటి?’ అన్నాడు రాజు. ‘అయ్యా! నా పేరు వసంతుడు’ అన్నాడు అతను. ‘శిలల మీద కదా శిల్పాలు చెక్కాల్సింది. మరి నువ్వేంటి మామూలు రాళ్ల మీద శిల్పాలు చెక్కుతున్నావు?’ అన్నాడు మంత్రి.

‘అయ్యా! శిలలు కొనే స్థాయి కాదు నాది... ఈ రాళ్లయితే ఎక్కడబడితే అక్కడ ఉచితంగా దొరుకుతాయి.. కదా!’ అన్నాడు వసంతుడు. ‘మరి నీ గురువు ఎవరు?’ అన్నాడు రాజు. ‘అయ్యా! నాకు గురువు ఎవ్వరూ లేరు. ఎవరి వద్ద అయిన శిష్యుడిగా చేరదామంటే నన్ను ఎవ్వరూ అంగీకరించ లేదు. అందుకే.. నేనే సొంతంగా శిల్పాలు చెక్కడం నేర్చుకున్నా...’ అన్నాడు వసంతుడు ఎంతో బాధగా! ఈ మాట విని రాజు, మంత్రి కూడా చాలా బాధపడ్డారు.

తర్వాత కాస్త పక్కకు వచ్చి.. ‘ఇలాంటి కళాకారులు మరుగున పడకూడదు’ అన్నాడు రాజు. ‘అవును మహారాజా! మీరు అన్నది నిజమే.. ఈ సారి శిల్పకళను ప్రోత్సహిద్దాం. ఈ వసంతుడు కూడా ఆ శిల్పకళా పోటీలో పాల్గొనేలా చేద్దాం’ అన్నాడు మంత్రి. ‘అలాగే మంత్రివర్యా..! మిగతా చర్యలు మీరే తీసుకోండి’ అన్నాడు రాజు.

ఒక వారం తరువాత పది మంది శిల్పులను పిలిపించాడు మంత్రి. కోటలోని ఉద్యానవనంలో ఒకే రకమైన శిలలను తెప్పించి ఉంచి వారికి అన్ని వసతులూ ఏర్పాటు చేసి, ‘అమ్మ- బిడ్డ’ అనే అంశం ఇచ్చి శిల్పాన్ని చెక్కమని వారికి రెండు మాసాలు గడువు ఇచ్చాడు. వసంతుడు కూడా పాల్గొనేలా చేశాడు మంత్రి.

రెండు మాసాల్లో ఆ పది మంది శిల్పులు శిల్పాలను చెక్కారు. రాజుతో పాటు కోటలోని ప్రతి ఒక్కరూ ఆ శిల్పాలను చూశారు. అన్నీ ఒకదానిని మించి మరోటి ఉన్నాయి. ఒక్కొక్క శిల్పి తాము చెక్కిన శిల్పానికి పేరు కూడా పెట్టారు. ఏది ఉత్తమ శిల్పమో నిర్ణయించాలంటే సామాన్యుల నుంచి కూడా అభిప్రాయాన్ని తీసుకోవాలని, ఒక వారం రోజుల పాటు శిల్పాలను చూసే అవకాశం అందరికీ ఇచ్చాడు మంత్రి. దాంతో పాటు ఎందుకు అది ఉత్తమ శిల్పంగా నిలిచిందో చెప్పిన వారికి బహుమతి ఇస్తానన్నాడు.

కొందరు.. ‘ఆ శిల్పం బాగుంది, ఈ శిల్పం బాగుంది... శిల్పి బాగా చెక్కాడు’ అన్నారే కానీ వర్ణించలేకపోయారు. శివయ్య అనే వ్యక్తి ‘అమ్మ ఒడి’ అనే శిల్పం ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. ‘బంగారు తల్పాలు, పట్టు పరుపుల్లాంటివి ఎన్ని ఉన్నా తల్లి, బిడ్డను తన ఒడిలో నిదురపుచ్చడానికే ఎక్కువ ఇష్ట పడుతుంది. బిడ్డ నిదురపోతుంటే తల్లి కనుల నుంచి ఆనందభాష్పాలు రాలుతున్నట్టు, ఒడిలో బిడ్డ చిరునవ్వుతో కళ్లు మూసుకుని నిదురపోతున్నట్టు శిల్పాన్ని అద్భుతంగా చెక్కాడు శిల్పి’ అని వర్ణించాడు.

శివయ్య చెప్పాక మళ్లీ అందరూ పరిశీలనగా ‘అమ్మ ఒడి’ శిల్పాన్ని అణువు అణువూ పరిశీలించి.... ‘అవును... శివయ్య చెప్పింది... అక్షరాలా నిజం’ అన్నారు. ఆ శిల్పాన్ని చెక్కింది వసంతుడు. అతణ్ని ఉత్తమ శిల్పిగా ప్రకటించి అందరి సమక్షంలో రాజు ఘనంగా సత్కరించాడు. మిగతా శిల్పులకు కూడా కానుకలు ఇచ్చి సన్మానించాడు. శిల్ప వర్ణనకు శివయ్యకు పది బంగారు నాణేలు ఇచ్చాడు. వసంతుణ్ని ఆస్థాన శిల్పిగా నియమించాడు రాజు.

- యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని