అసలు రూపం!

దట్టమైన నల్లమల అభయారణ్యంలో ఎన్నో జంతువులు, పక్షులు కలిసి మెలిసి జీవిస్తుండేవి. తాతల కాలం నుంచి తన కుటుంబానికి సేవలు చేస్తున్న నక్కను మంత్రిగా చేసుకుని అడవిని పాలించేది సింహం. కాకి, రామచిలుకలను సలహాదారులుగా నియమించుకొని అడవిలోని సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండేది.

Published : 18 Jul 2022 00:23 IST

దట్టమైన నల్లమల అభయారణ్యంలో ఎన్నో జంతువులు, పక్షులు కలిసి మెలిసి జీవిస్తుండేవి. తాతల కాలం నుంచి తన కుటుంబానికి సేవలు చేస్తున్న నక్కను మంత్రిగా చేసుకుని అడవిని పాలించేది సింహం. కాకి, రామచిలుకలను సలహాదారులుగా నియమించుకొని అడవిలోని సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండేది. తనదైన శైలిలో వాటిని వేగంగా పరిష్కరించేది. నిత్యం వెంటే ఉంటూ అతి వినయాన్ని నటించే నక్కలాంటి జంతువులు, మరికొన్ని పక్షులు నిజంగానే తనపట్ల నమ్మకంగా ఉన్నాయా? లేక సింహాసనంపై కన్ను వేశాయా? అని ఒకరోజు సింహానికి సందేహం కలిగింది. వెంటనే తనకెప్పటి నుంచో సన్నిహితులు, నమ్మకస్థులయిన రామచిలుకను, కాకిని రప్పించింది. తన ఆలోచనను వాటికి చెప్పింది. అవి రెండూ మృగరాజు మాటను అమలు పరచడం మొదలుపెట్టాయి. అందుకో పథకం వేశాయి. అందులో భాగంగా సింహం తన గుహ ముందు చచ్చిపడినట్లుగా నటించసాగింది. కాకి, చిలుక వేగంగా అడవంతా తిరిగి.. మృగరాజు జబ్బు చేసి మరణించిందనే సందేశాన్ని మిగతా జంతువులకు, పక్షులకు చేరవేశాయి.

సింహం చనిపోయిందనడంతో అడవిలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అడవిలోని జంతువులు, పక్షులు తమ పనులను పక్కకు పెట్టి.. మృగరాజును చివరిచూపు చూడడానికి బయలుదేరాయి. కొంత సమయానికి అక్కడ నివసించే ప్రాణులన్నీ సింహం గుహ దగ్గరికి చేరాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న కాకి.. సింహం కనుగుడ్లను పొడుస్తున్నట్లు నటించసాగింది. పక్కనే ఉన్న చెట్టుపై కూర్చొని సింహంతో తనకున్న స్నేహాన్ని తలుచుకుంటూ ఏడవసాగింది రామచిలుక. అడవి జంతువులు, పక్షులు ఆ అడవికి రాజైన సింహం పట్ల సానుభూతిని చూపాయి. అక్కడికి పరుగెత్తుతూ ఆయాసంతో వచ్చిన ఎలుగుబంటి.. ‘మాయదారి రోగం మృగరాజును బలి తీసుకుంది. నాకు ఒక్క మాట చెబితే, ఏ విధంగానైన నాకు తెలిసిన వైద్యంతో చికిత్స చేసి బతికించుకునేదాన్ని’ అంటూ బోరున విలపించసాగింది.

అప్పుడే తన అనుచరులతో అక్కడికి చేరుకున్న ఏనుగు మిగతా జంతువులతో ఇలా అంది. ‘అడవికి రాజు అనే గర్వంతో సింహం ఎవ్వరినీ లెక్క చేసేది కాదు. నిజం చెప్పాలంటే నేను మృగరాజు కంటే బలమైన జంతువును. అలాంటిది ఏ ఒక్కరోజూ సింహం నన్ను తన పక్కన కూర్చోబెట్టుకోలేదు. నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఇన్నాళ్లకు దీని పీడ విరగడైంది. ఈ రోజు నుంచి ఈ అడవికి నేనే రాజును’ అని ప్రకటించుకుంది. గజరాజుకు మద్దతుగా కొన్ని జంతువులు, పక్షులు గట్టిగా చప్పట్లు కొట్టాయి. అంతవరకు సింహం దగ్గరే కూర్చొని ఏదో దీర్ఘాలోచన చేస్తున్న నక్క.. ‘మాతాత, ముత్తాతల కాలం నుంచి సింహానికి ఊడిగం చేస్తున్నాం. అనేక సందర్భాల్లో మృగరాజుని కాపాడాను. అడవిలో ఏ మూల ఏం జరుగుతుందో, ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో మాకు పుట్టుకతో తెలిసిన విద్య. కాబట్టి, ఏ రకంగా చూసిన ఈ అడవికి రాజును నేనే’ అని స్పష్టం చేసింది. నక్కకు అనుకూలంగా మరికొన్ని జంతువులు, పక్షులు అవునంటూ తలూపాయి.

ఆ సమయంలో పక్షి జాతికి నాయకత్వం వహించే నెమలి అక్కడికి వచ్చింది. ‘పక్షుల్లోకెల్లా నేనే అందమైనదాన్ని. అడవిలో జరిగే ప్రతి కదలికనూ ఇట్టే పసిగట్టగలను. సింహం అడవికి రాజే కానీ నాలా ఎగరలేదు. దేవుడు పక్షుల్లో ఎవరికీ లేని కిరీటం లాంటి పింఛాన్ని నాకు ప్రసాదించాడు. ఎప్పట్నుంచో మా పక్షిజాతి ఈ అడవికి సేవలు చేస్తుంది. మృగరాజు తర్వాత సింహాసనంపై కూర్చునే నిజమైన అర్హతలున్న పక్షి రాజును నేనే’ అని గట్టిగా అరిచింది. అక్కడ ఉన్న పక్షులన్నీ ఆ నెమలికి మద్దతునిచ్చాయి. అప్పుడు నక్క ‘పక్షికి రాజ్యమెందుకు?’ అని హేళనగా మాట్లాడింది. నెమలి కోపంతో నక్కపైన దాడికి దిగింది. ఏనుగు గట్టిగా ఘీంకరించింది. జంతువులు, పక్షులన్నీ తమ వర్గం వారే రాజు కావాలని పోట్లాడుకోసాగాయి. అప్పటివరకూ చచ్చినట్లు నటించిన సింహం ఒక్కసారిగా పైకి లేచి జూలు విదులుస్తూ గర్జించింది. ఆ గర్జనతో జంతువులు, పక్షులన్నీ గప్‌చుప్‌ అయిపోయాయి. ఆశ్చర్యపోతున్న వాటి వైపు చూస్తూ ‘నాకే జబ్బూ లేదు. నేను మరణించనూ లేదు. నా చుట్టూనే తిరుగుతూ, అనుక్షణం పొగడ్తలతో ముంచెత్తే మీ నిజ స్వరూపం తెలుసుకోవాలనే ఈ నాటకం ఆడాను’ అంటూ ఆగ్రహంతో గుహలోకి వెళ్లిపోయింది మృగరాజు.

- తూర్పింటి నరేశ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని