అగ్గిపెట్టెంత పోలీస్‌స్టేషన్‌!

‘వంకాయంత వజ్రాన్ని కాజేసిన దొండకాయంత దొంగను.. అగ్గిపెట్టెంత పోలీస్‌స్టేషన్‌ నుంచి, పొట్లకాయంత పోలీసు వచ్చి పట్టుకున్నాడు. జామకాయంత జైల్లో పెట్టి, తాటికాయంత తాళం వేశాడు..’

Updated : 18 Jul 2022 02:11 IST

‘వంకాయంత వజ్రాన్ని కాజేసిన దొండకాయంత దొంగను.. అగ్గిపెట్టెంత పోలీస్‌స్టేషన్‌ నుంచి, పొట్లకాయంత పోలీసు వచ్చి పట్టుకున్నాడు. జామకాయంత జైల్లో పెట్టి, తాటికాయంత తాళం వేశాడు..’ ఇలాంటి కథను మన అమ్మమ్మనో, నాయనమ్మనో చెప్పి ఉంటారు కదా! అమెరికాలో నిజంగానే ఓ బుజ్జి పోలీసుస్టేషన్‌ ఉంది. మరి దాని విశేషాలు ఏంటో తెలుసుకుందామా!

అమెరికాలోని ఫ్లోరిడా సమీపంలోని క్యారబెల్‌ నగరంలో ప్రపంచంలోకెల్లా అతిచిన్న పోలీస్‌స్టేషన్‌ ఉంది. నిజానికి అదో టెలిఫోన్‌ బూత్‌ అంతే ఉంటుంది. అందులో కేవలం ఒక్కరు మాత్రమే ఉండగలరు. పోలీస్‌స్టేషన్‌ అయితే చిన్నది కానీ.. దీని వెనక ఉన్న కథ మాత్రం కాస్త పెద్దదే...

అనగనగా.. అప్పుడెప్పుడో...
అది 1963వ సంవత్సరం.. క్యారబెల్‌ నగరంలో 98వ జాతీయ రహదారి పక్కన పోలీసులకు సంబంధించిన ఒక ఫోన్‌.. పక్కనే ఉన్న భవనం గోడకు తగిలించి ఉండేది. పోలీసు బీట్‌కు సంబంధించిన అధికారి దాంతో మాట్లాడేవాడు. అది రోడ్డు పక్కనే ఉండటంతో పోలీసు అధికారి లేని సమయంలో ఆకతాయిలు దాని నుంచి విపరీతంగా కాల్స్‌ చేసుకునేవారు. అప్పట్లో ఇదో సమస్యగా మారింది. వర్షం వస్తే పోలీసు అధికారి కూడా తడుస్తూనే ఫోన్‌ మాట్లాడాల్సి వచ్చేది. అప్పట్లో ఆ ప్రాంతంలో అతడొక్కడే పోలీస్‌! అందుకే చిన్న టెలిఫోన్‌ బూత్‌ ఏర్పాటు చేసి అందులో ఫోన్‌ ఉంచారు. అదే పోలీస్‌స్టేషన్‌గా మారింది. ప్రపంచంలోకెల్లా అతి చిన్న పోలీస్‌స్టేషన్‌గానూ గుర్తింపు దక్కింది.

ఇప్పటికీ...
అప్పట్లో ఏర్పాటు చేసిన ఆ బుజ్జి పోలీస్‌ స్టేషన్‌ గదిని ఇప్పుడు ఛాంబర్‌ ఆఫీస్‌లో ప్రదర్శనకు పెట్టారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు సందర్శకులకు దాన్ని వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికీ ఈ నగరాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులు ఆ బుజ్జి పోలీస్‌స్టేషన్‌ను చూసి మురిసిపోతుంటారు.

నమూనా కూడా...
గతంలో పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేసిన చోట ఇప్పుడు దాని నమూనాతో పాటు, ఓ బెంచీ కూడా అమర్చారు. పర్యాటకులు ఇక్కడ తెగ సెల్ఫీలు దిగుతూ, వాటిని తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పంచుకుంటూ ఉంటారు. కొన్ని టెలివిజన్‌ షోలలోనూ, ఓ సినిమాలోనూ ఈ బుజ్జి పోలీస్‌స్టేషన్‌ను చూపించారు. ఈ పోలీస్‌స్టేషన్‌, దీని చిత్రాలతో ఉండే టీ షర్టులకు కాపీరైట్‌ ఉంది. అన్నట్లు మరో విషయం ఏంటంటే.. ఇప్పటికీ ఈ పోలీస్‌స్టేషన్‌లో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ఉంటుంది. కొంతకాలం క్రితం వరకూ.. సందర్శకులు కూడా దీన్నుంచి కాల్స్‌ చేసుకునేవారు. కానీ ప్రస్తుతం డయల్‌ లేని ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ను ఉంచారట. అంటే ఎవరూ కాల్స్‌ చేసుకోలేరన్నమాట. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ప్రపంచంలోకెల్లా అతిచిన్న పోలీస్‌స్టేషన్‌ విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని