ఎగిరే గాలిపటమా!

గాలి పటం ఎంతుంటుంది?... ‘ఆ ఎంతుంటుంది.. మన చేతుల్లో ఇమిడిపోయేంత ఉంటుంది. మహా అయితే ఇంకాస్త పెద్దగా ఉంటుంది’ అని మీరు సమాధానం చెబుతారేమో..! మీ అభిప్రాయం ఇదే

Published : 20 Jul 2022 00:23 IST

గాలి పటం ఎంతుంటుంది?... ‘ఆ ఎంతుంటుంది.. మన చేతుల్లో ఇమిడిపోయేంత ఉంటుంది. మహా అయితే ఇంకాస్త పెద్దగా ఉంటుంది’ అని మీరు సమాధానం చెబుతారేమో..! మీ అభిప్రాయం ఇదే అయితే మాత్రం మీరు తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే ఒక్కో గాలిపటం చిన్నపాటి విమానం పరిమాణంలోనూ ఉంటోంది. అదీ ఏ విదేశాల్లోనో కాదు.. మన దగ్గరే! మరి మనం ఆ విశేషాల గురించి తెలుసుకుందామా!

పిల్లలమైన మనకు గాలిపటాలు అంటే భలే సరదా కదూ! అవి అలా గాల్లో ఎగురుతూ ఉంటే.. మనకు వచ్చే ఆనందమే వేరు కదా! కానీ ఇప్పుడు చెప్పుకోబోయే గాలిపటాలు పెద్దలకు మాత్రమే! అవును వాటిని గాల్లోకి ఎగరేయడం, నియంత్రించడం వాళ్లకే కష్టం. మనలాంటి చిన్నపిల్లలైతే వాటితోపాటే అమాంతం గాల్లోకి లేస్తాం. ఎందుకంటే అవి బాహుబలి గాలిపటాలు మరి. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో ‘వన్‌ ఇండియా కైట్‌’ పేరుతో ఓ బృందం ఉంది. వీళ్లంతా పెద్ద పెద్ద పతంగులను తయారు చేసి, వాటిని గాల్లోకి ఎగరేస్తారు.

కోడిపిల్ల.. పులి పిల్ల!
బుజ్జి కోడి పిల్ల నుంచి.. బుల్లి పులి పిల్ల వరకు.. గుర్రం నుంచి బల్లి వరకు... ఇలా చాలా ఆకారాల్లో ‘వన్‌ ఇండియా కైట్‌’ వాళ్లు పతంగులకు ప్రాణం పోశారు. వీళ్లు తయారు చేసిన కథక్‌ పతంగి బాగా ఫేమస్‌ అయింది. కొన్ని గాలిపటాలైతే అచ్చం పారాచూట్‌లనే తలపించేలా ఉన్నాయి. ప్రస్తుతం వీళ్లు ప్రపంచంలోనే అతిపెద్ద గాలి పటం తయారీ కోసం కృషి చేస్తున్నారు. అది ఫుట్‌బాల్‌ మైదానం అంత పరిమాణంలో ఉండనుందట. అయ్య బాబోయ్‌... అంత పెద్ద పతంగిని ఊహించుకుంటేనే.. వామ్మో అనిపిస్తోంది కదూ! చూద్దాం.. వీళ్లు దాన్ని తయారు చేశాక ఎలా ఉంటుందో... గాల్లోకి ఎలా ఎగరేస్తారో మరి! నేస్తాలూ.. మొత్తానికి ఇవీ బాహుబలి పతంగుల విశేషాలు.

పట్టరపట్టు.. హైలెస్సా...
ఈ బాహుబలి పతంగులను ఎగరేయడం చూస్తే.. వాళ్లు గాలిపటాలను ఎగరేస్తున్నారా? లేక పెద్ద పెద్ద కొండల్ని లాగుతున్నారా? అనే అనుమానం రాకమానదు. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద పతంగులను ఎగరవేయడం ఒక్కరి వల్ల అస్సలు సాధ్యం కాదు. పది, ఇరవై మంది కలిస్తేనే వీటిని నియంత్రించగలరు. ఇవి పైకి లేవాలన్నా.. చాలా గాలి అవసరం. అందుకే ఎక్కువగా విశాలమైన మైదానాలు, తీరప్రాంతాల్లోనే వీటిని ఎగుర వేస్తారు. మన దేశంలో అయితే ఇలా పెద్ద పెద్ద పతంగుల్ని ‘వన్‌ ఇండియా కైట్‌’ సభ్యులు ఎగరవేస్తున్నారు. ఎక్కడ ‘కైట్‌ ఫెస్టివల్స్‌’ జరిగినా వీరెళ్లి తప్పకుండా వాటిలో పాల్గొంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని