చిత్రకారుడి గర్వభంగం!

పూర్వం నీలగిరి రాజ్యానికి సింహేంద్రవర్మ రాజు. ఆ రాజ్యంలో వర్ణతేజుడు అనే చిత్రకారుడు ఉండేవాడు. చిత్రకళలో బాగా నైపుణ్యం ఉన్న వ్యక్తిగా అతడికి మంచి పేరుంది. దాంతో అతడిని ఆస్థాన చిత్రకారుడిగా నియమించుకున్నాడు రాజు.

Published : 21 Jul 2022 00:21 IST

పూర్వం నీలగిరి రాజ్యానికి సింహేంద్రవర్మ రాజు. ఆ రాజ్యంలో వర్ణతేజుడు అనే చిత్రకారుడు ఉండేవాడు. చిత్రకళలో బాగా నైపుణ్యం ఉన్న వ్యక్తిగా అతడికి మంచి పేరుంది. దాంతో అతడిని ఆస్థాన చిత్రకారుడిగా నియమించుకున్నాడు రాజు. వర్ణతేజుడి ప్రతిభను మెచ్చి.. అతనికో భవంతిని బహుమతిగా అందించాడు. అందులో సకల సౌకర్యాలూ కల్పించాడు రాజు. దాంతో వర్ణతేజుడిలో గర్వం పెరిగింది. తనను తాను గొప్పవాడిగా భావించుకునేవాడు. తనను మించిన చిత్రకారుడు చుట్టుపక్కల రాజ్యాల్లో ఎవరూ లేరనే అహంకారంతో విర్రవీగుతూ ఉండేవాడు.

వర్ణతేజుడిలో వచ్చిన మార్పును రాజు సింహేంద్ర వర్మ గమనించాడు. ఎలాగైనా అతనిలోని అహంకారాన్ని పారదోలాలని అనుకున్నాడు. మంత్రి సుబుద్ధిని సలహా అడిగాడు. పేరుకు తగ్గట్టుగానే, ఎటువంటి సమస్యనైనా తన బుద్ధి కుశలతతో పరిష్కరించగల నేర్పరి అతడు. రాజు గారి ఆలోచన తెలుసుకున్న సుబుద్ధి.. ‘మహారాజా.. మీరు చెప్పింది నిజమే. వర్ణతేజుడిలో ఈ మార్పును నేనూ గమనించాను. అతని మాటల్లో తనను తాను ఎంతో గొప్పగా ఊహించుకుంటూ, ఇతరులను చిన్నచూపు చూస్తున్నాడు. మాటల్లోనూ నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది’ అన్నాడు మంత్రి.

‘అతడిలోని అహంకారాన్ని పటాపంచలు చేసే మంచి మార్గం చెప్పండి’ అన్నాడు రాజు సింహేంద్ర వర్మ. ‘మహారాజా.. తనను తాను గొప్పగా ఊహించుకునే వర్ణతేజుడికి తనకంటే మంచి చిత్రకారులు ఉన్నారనే విషయం అర్థం కావాలి. అప్పుడే అతని గర్వం పోతుంది. ఆ అహంకారాన్ని తగ్గించే ఉపాయం ఒకటి నా దగ్గర ఉంది’ అన్నాడు సుబుద్ధి. ‘అలాగా.. ఆ ఉపాయం ఏమిటో చెప్పండి’ అని అడిగాడు రాజు. ‘రాజా.. .మన రాజ్యానికి దగ్గరలో ఓ అడవి ఉంది. అక్కడ ఓ వారం రోజులు ఉండి, అందులోని మనోహరమైన దృశ్యాలను చిత్రీకరించమని ఆదేశించండి. తిరిగి రాజ్యానికి వచ్చిన తర్వాత అతనిలో కలిగిన మార్పును మీరే చూస్తారు’ అని మంత్రి బదులిచ్చాడు. అడవి అందాలను చిత్రించడం వల్ల వర్ణతేజుడిలో మార్పు ఎలా వస్తుందో అర్థం కాకపోయినా.. మంత్రి మీద నమ్మకంతో సరేనన్నాడు రాజు.

మరుసటి రోజే అడవికి వెళ్లి అందమైన దృశ్యాలను గీయాలని చిత్రకారుడిని ఆదేశించాడు రాజు. ఆయన మాట మేరకు ఇష్టం లేకపోయినా సామగ్రిని తీసుకొని, ఓ గుర్రంపైన అడవికి బయలుదేరాడు. అడవికి చేరిన వర్ణతేజుణ్ని అక్కడి దృశ్యాలు కట్టిపడేశాయి. ప్రకృతి అందాలు పరవశింప చేశాయి. అక్కడి కొండలు, నదులు, చెట్లు, పక్షులు, ఆకాశం... అన్నీ వేటికవే అందంతో పోటీ పడుతున్నాయి. ఎప్పుడూ అలాంటి మనోహర దృశ్యాలు చూడలేదు వర్ణతేజుడు. వారం రోజులు ఉండి అక్కడి దృశ్యాలు చిత్రించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రకృతి రంగుల కలయికను తన కుంచెలో ప్రతిఫలించలేకపోయాడు. అక్కడి ప్రకృతి అందంతో తన చిత్రకళ పోటీ పడలేకపోయింది. నిరాశగా రాజ్యానికి తిరిగివచ్చాడు. దర్బారులో కొలువై ఉన్న రాజు.. ‘వర్ణతేజా... ప్రయాణం ఎలా జరిగింది? నేను చెప్పినట్టుగా అడవి అందాలను చిత్రించారా?’ అని ప్రశ్నించాడు. ‘పూర్తిగా సఫలం కాలేకపోయాను’ అని సమాధానమిచ్చాడు వర్ణతేజుడు.

‘వర్ణతేజా.. ఇప్పటికైనా నీకు అర్థమై ఉంటుంది. మనల్ని మనం అతిగా ఊహించుకోరాదు. మనకంటే నైపుణ్యం గలవారు చాలామంది ఉంటారు. మీ కళ గొప్పది. అందుకే రాజుగారు మీకు గౌరవం ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకోండి. మీ కళకు ఇంకా మెరుగులు దిద్దుకోండి. గర్వాన్ని తగ్గించుకోండి. సాటి కళాకారుల్ని గౌరవించండి’ అని మంత్రి సుబుద్ధి అన్నాడు. కావాలనే రాజు తనను అడవికి పంపారని వర్ణతేజుడికి అర్థమైంది.

‘మహారాజా! నన్ను మన్నించండి. నేనేంటో నాకు అర్థమైంది. ఇక నుంచి మారిన వర్ణతేజుణ్ని చూస్తారు. నా ప్రవర్తనపై నేను సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమించండి’ అన్నాడు వర్ణతేజుడు. అతడిలో మార్పు కలిగినందుకు సంతోషించాడు సింహేంద్రవర్మ. అందుకు తగిన ఉపాయం చెప్పి సహకరించిన మంత్రి సుబుద్ధిని అభినందించాడు.

- వడ్డేపల్లి వెంకటేశ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని