సుబ్బరాజు సన్మానం!

రానున్న వేసవిలో మన ఊరిలో ఉత్సవాలు జరపాలనుకుంటున్నాం. అందులో ప్రతిభావంతులకు సన్మానాలు చేయాలి. అందుకోసం గ్రామస్థులంతా పొదుపును పాటిస్తూ, పైసా పైసా కూడబెట్టి సహాయపడాలని గ్రామస్థులను సమావేశపరిచి చెప్పాడు ఊరి పెద్ద.

Published : 24 Jul 2022 00:18 IST

రానున్న వేసవిలో మన ఊరిలో ఉత్సవాలు జరపాలనుకుంటున్నాం. అందులో ప్రతిభావంతులకు సన్మానాలు చేయాలి. అందుకోసం గ్రామస్థులంతా పొదుపును పాటిస్తూ, పైసా పైసా కూడబెట్టి సహాయపడాలని గ్రామస్థులను సమావేశపరిచి చెప్పాడు ఊరి పెద్ద.
‘వేసవిలో ఉత్సవాలా?’ పెదవి విరిచారు ఎక్కువ మంది. ‘ఇప్పుడు వేసవిలో పడుతున్న నీటి ఇబ్బందులు చాలవా?’ ఆడవాళ్లు కూడా స్వరం కలిపారు. ‘వేసవిలో నీటి ఎద్దడి నిజమే కానీ, వ్యవసాయ పనులకు విరామముండే సమయం అదే కాబట్టి అప్పుడు నిర్వహించడమే సబబు’ అని మరికొంతమంది వాదించారు. ‘ఇంకా సంవత్సరం సమయముంది. అప్పుడాలోచించుకోవచ్చు’ ధీమాతో మరికొందరు స్వరం విప్పారు. ‘సంవత్సరం ఉంది కాబట్టే ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి’ అని ఇంకొందరు సమర్థించారు.
‘ఏది ఏమైనా ఉత్సవాలు నిర్వహించి తీరాలి. విరాళాలుగా ప్రతి ఇంటివారు వంద వరహాలు ఇచ్చి తీరాల్సిందే. ఆ డబ్బును ఉత్సవాల ముందు నెలలో అందజేయాలి’ అని గ్రామపెద్ద హుకుం జారీ చేశాడు. అందరూ అలాగే అన్నట్లు తలూపారు. ఒక్క సుబ్బరాజు మాత్రం తన నిస్సహాయతను తెలియజేశాడు.

‘ఊరంతా ఒకే మాటగా ఉంటే, నువ్వేంటి ఇలా? కష్టమో, నష్టమో ఇచ్చి తీరాల్సిందే’ అందరూ సుబ్బరాజుపై ఘొల్లుమన్నారు. చివరకు శారీరక శ్రమను ఉత్సవాలకు వినియోగిస్తానని మాటిచ్చాడు సుబ్బరాజు.

పిసినారితనంలో ప్రతిభ చాటుకుంటున్న సుబ్బరాజుకే మొదటి సన్మానం చేయాలి అంటూ అతడిని ఆట పట్టించారు కొందరు. గ్రామపెద్ద ఆలోచనలో పడి.. ‘సుబ్బరాజూ! వేసవిలో నీటి ఎద్దడి నీకు తెలియంది కాదు. గ్రామం చివరలో ఉన్న బావి ఎండిపోకుండా ఉత్సవాల సమయంలో ఏటి నీటితో నింపాలి. నీ శరీర శ్రమ అందుకు వినియోగించు, అది కష్టమనిపిస్తే వంద వరహాలు చెల్లించడంలో మినహాయింపు మాత్రం లేదు’ అని షరతు పెట్టాడు. తెల్లమొహమేశాడు సుబ్బరాజు.
ఇంటికి వచ్చిన సుబ్బరాజుకు నిద్రపట్టలేదు. నూతిని నింపడమంటే మాటలతో పనికాదు. ఆ ఆలోచనల పరంపరలో సుబ్బరాజు మెదడులో తళుక్కున ఒక మెరుపు మెరిసింది. తెల్లారేసరికి ఊరి చివరకు పోయి పల్లమున్న ప్రాంతంలో ఒక గుంట తవ్వడం ప్రారంభించాడు.

దారిన పోతున్న వాళ్లు అది చూసి... ‘సుబ్బరాజూ! ఈ తవ్వకం ఎందుకో’ అని అడిగారు. పొదుపు చేసి దాచుకుందామని చెప్పాడు. ‘ఇక్కడేమిటి?’ అర్థంగాక అడిగారు వాళ్లు. ‘ఇంటికన్నా ఇక్కడైతే పదిలంగా ఉంటుంది’ అని చెప్పాడు సుబ్బరాజు. ‘ఎంతేమిటి?’ అంటూ ఇంకొందరు వెటకారంగా అడిగారు.

‘ఎప్పుడు ఎంత కలిగితే అంత’ అని చెప్పి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. మర్నాడు కూడా యథావిధిగా అదే ప్రాంతానికి వచ్చి మరో గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. మరి కొందరు చూశారు. ఇలా ప్రతిరోజూ ఉదయం గొయ్యి తవ్వడం సాయంత్రం కూలి పని చూసుకొని వచ్చి ఆ గొయ్యిని పూడ్చిపెట్టడం చేస్తుండేవాడు సుబ్బరాజు. రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు ఆ నోటా ఈ నోటా సుబ్బరాజు పొదుపు వ్యవహారం ఊరు ఊరంతా పాకింది. ఈ విషయం దొంగల చెవిన పడింది.

ఊరు చివరన సుబ్బరాజు దాచుకున్న పొదుపు డబ్బులు కాజేయాలనుకున్నారు. ఒక రోజు రాత్రి దొంగల గుంపు ఊరు చివర సుబ్బరాజు పూడ్చిన గోతులవైపు వెళ్లింది. చీకట్లో తవ్వకాలు మొదలు పెట్టారు. ఎక్కడ కూడా ఒక్క వరహా కనిపించలేదు. ఉసూరుమంటూ వెళ్లిపోయారు. తెల్లారేసరికి సుబ్బరాజు ఆ ప్రాంతానికి యథావిధిగా వచ్చాడు. అక్కడంతా గోతుల మయమవ్వడంతో అవాక్కయ్యాడు. ఇదేదో దొంగల పనేనని అంచనా వేశాడు. అక్కడకు వచ్చిన వారు అది చూసి సుబ్బరాజును పరామర్శించడం మొదలుపెట్టారు. ఇంతలో వర్షం ముంచుకొచ్చింది. ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. అందరూ సుబ్బరాజు మీద జాలిని చూపించారు. సుబ్బరాజు మాత్రం.. ‘అంతా మన మంచికే జరిగిందంటూ’ వారి ఓదార్పులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇప్పుడు వర్షాకాలం, చలికాలం పూర్తై వేసవికాలం వచ్చింది. విరాళాల సేకరణలో గ్రామపెద్దల బృందం సుబ్బరాజు దగ్గరకు వచ్చింది.

నీకు శ్రమ తప్పింది. వేసవి వచ్చినా బావి ఎండిపోలేదు. ఇక వంద వరహాలు చెల్లించడమే అన్నారు. ‘బావి నింపడం కానీ, వరహాలు చెల్లించడం కానీ ఏదో ఒకటి చేయమని సూచన చేశారు. బావి ఇంకిపోకుండా చేసింది నేను, మరి డబ్బులు ఎందుకు చెల్లించాలి?’ అని ఎదురు ప్రశ్న వేశాడు సుబ్బరాజు.

‘ఇందులో నీ గొప్పతనమేమిటి? గ్రామపెద్దలు అడిగారు. మీరు పైసా పైసా పొదుపు చేసి డబ్బును విరాళంగా ఇవ్వమన్నారు. నేను చినుకు చినుకు కూడబెట్టి బావి నింపాలనుకున్నాను. అందుకోసం పడిన చినుకు వృథా కాకుండా భూమిని గుల్ల చేసే పనిలో పడ్డాను. నేను దాచి పెట్టింది వరహాలనుకున్న దొంగలు దోచుకోడానికి గుంతలు తవ్వి విడిచి పెట్టారు. అవి ఇంకుడు గుంతలుగా మారి బావి ఎండిపోకుండా చేశాయి’ అని అసలు విషయాన్ని వివరించాడు సుబ్బరాజు. అతడి తెలివికి ఊరి పెద్దలతోపాటు గ్రామస్థులూ నివ్వెరపోయారు. ఆ ఉత్సవాల్లో సుబ్బరాజుకే మొదటిగా సన్మానం చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే చేశారు కూడా.

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని