తప్పు తెలిసొచ్చింది!

‘చింటూ అల్లరి భరించలేకపోతున్నా.. నువ్వైనా కొంచెం భయం చెప్పు మామా’ అంది కుందేలు. ‘నీకు తెలీదు అల్లుడు.. చింటూని ఏమైనా అంటే ఇక నా పని అంతే! నేనే నెమ్మదిగా చెబుతాను. కంగారు పడకు’ అంది మగ కోతి. చింతపల్లి అడవులు.. అనేక జంతువులు, పక్షులకు సురక్షిత ఆవాసం.

Published : 05 Feb 2023 15:53 IST

‘చింటూ అల్లరి భరించలేకపోతున్నా.. నువ్వైనా కొంచెం భయం చెప్పు మామా’ అంది కుందేలు. ‘నీకు తెలీదు అల్లుడు.. చింటూని ఏమైనా అంటే ఇక నా పని అంతే! నేనే నెమ్మదిగా చెబుతాను. కంగారు పడకు’ అంది మగ కోతి. చింతపల్లి అడవులు.. అనేక జంతువులు, పక్షులకు సురక్షిత ఆవాసం. దాంతో ఎక్కడి నుంచో వచ్చిన ఓ కోతి జంట, అక్కడి జువ్వి చెట్టు మీద నివసించసాగింది. మగ కోతి అందరికీ సహాయం చేస్తూ స్నేహంగా ఉండేది. చాలా కాలం తరవాత వాటికి ఓ మగ పిల్ల పుట్టింది. ఆ బుల్లి కోతికి చింటూ అని పేరు పెట్టుకున్నాయి. లేక లేక కలిగిన సంతానం కావడంతో గారాబంగా పెంచసాగాయి. అది చెట్టు చివరి కొమ్మలూ ఎక్కేస్తోంది. కాకి గూడులోని గుడ్లు, కింద పడేస్తుంది. ఇతర పక్షుల గూళ్లను చిందర వందర చేసేస్తోంది. దాంతో అవి చాలా బాధపడేవి. అందుకనే చింటూని కాస్త దారిలో పెట్టమని చెబుతోంది కుందేలు.

చింటూ ఇంటికి రాగానే.. ‘నేను, మీ అమ్మ ఇంతవరకు అందరికీ సహాయం చేయడమే కానీ హాని చేయలేదు. కానీ నువ్వు చేస్తున్న అల్లరికి అన్ని జంతువులు, పక్షులు బాధ పడుతున్నాయి. నీ అల్లరి మానకపోతే నాతో దెబ్బలు తింటావు’ అంది మగ కోతి. ‘చిన్న పిల్లను కొడతానంటావా.. అదే తెలుసుకుంటుందిలే..’ అని అడ్డు తగిలింది తల్లి కోతి. తల్లి తనకు అండగా ఉండటంతో చింటూ అల్లరి మరింత పెరిగింది. పిచ్చుకలు అల్లుకున్న గూడును నేలపాలు చేసింది. చిలకలు తినే కాయలు కోసి పడేసింది. కుందేలు దాచుకున్న ఆహారాన్ని తీసుకెళ్లి బావిలో పడేసింది. గట్టిగా చెబుదామంటే.. చిన్న పిల్ల కావడంతో ఆ అడవిలోని జీవులు దాన్నేమీ అనేవి కాదు. కొంత కాలానికి కోతి జంటకు ఓ ఆడపిల్ల పుట్టింది. చెల్లెలు పుట్టడంతో చింటూ ఆనందానికి అవధులు లేవు. ఎప్పుడూ చెల్లెలు చిన్నూ ధ్యాసే. కారణమేదైనా.. చింటూ అల్లరి కాస్త తగ్గడంతో జీవులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. కానీ, నెల తిరగకుండానే చింటూ మళ్లీ అల్లరి మొదలు పెట్టేశాడు. ఇక దానికి బుద్ధి చెప్పక తప్పదు అనుకున్నాయి జంతువులు, పక్షులు.

ఒకరోజు చిన్నూ బయటకు వచ్చి ఆడుకుంటోంది. దాన్ని మాటల్లో పెట్టింది కుందేలు. ‘చిన్నీ.. నీకు గున్న ఏనుగును చూపిస్తా వస్తావా?’ అని అడిగింది. ‘భలే భలే.. గున్న ఏనుగా..!’ అంటూ కుందేలు వెనకే వెళ్లింది చిన్ని. దాన్ని దూరంగా ఉన్న ఓ గుహలోకి తీసుకు వెళ్లిన కుందేలు, అక్కడే ఉన్న గున్న ఏనుగును పరిచయం చేసింది. ‘మీరిద్దరూ ఇక్కడ ఆడుకోండి. ఆకలి వేస్తే అక్కడ దుంపలు ఉన్నాయి. అవి తినండి’ అంది. ‘మరి మా అమ్మ నాకోసం వెతుకుతుందేమో?’ అడిగింది చిన్ని. నేను చెబుతాలే అంటూ గుహకు అడ్డంగా రాయి పెట్టి బయటకు వచ్చింది కుందేలు. ‘కోతి పిల్ల చిన్నూను ఎవరో ఎత్తుకెళ్లారట’ అంటూ ఎగిరింది కాకి. అది దాని తల్లిదండ్రులకు తెలిసింది. ‘ఇంకెక్కడ చిన్నూ.. చింటూ చేసే అల్లరికి బాధ పడిన వారెవరో దాన్ని బావిలో పడేసి ఉంటారు’ అంది పిచ్చుక. కంగారు పడిన చింటూ.. గబగబా నూతిలోకి చూసి వెతికింది. కోతి దంపతుల బాధ చూడలేక అన్ని జంతువులు, పక్షులు చిన్నూని వెతకసాగాయి. ఏనుగు పిల్ల ఉన్న గుహ వైపు వెతకడానికి వెళ్లింది కుందేలు. తూర్పు వైపునకు లేడి, ఉత్తరానికి కాకి, మిగిలిన అన్నీ చోట్లకు పిచ్చుకలు, చిలుకలు వెళ్లి వెతికాయి.

కాసేపటికి అవన్నీ తిరిగి వచ్చి, ఎక్కడా కనబడలేదన్నాయి. ‘అయినా.. చింటూ చేసిన అల్లరికి అడవిలోని జంతువులు, పక్షులు చాలా బాధపడ్డాయి. అందులో ఏవో చిన్నూకి హాని తలపెట్టి ఉంటాయి. చింటూ అల్లరికి చిన్నూ బలైపోయింది’ అంది ఎలుగుబంటి. ‘నేను ఇంకెప్పుడూ అల్లరి చేయను. కోపం ఉంటే నన్ను కొట్టండి. నా చెల్లిని మాత్రం బాధ పెట్టవద్దు’ అంటూ ఏడ్చింది చింటూ. ‘దయచేసి నా బిడ్డను వెతికి పెట్టండి. దాన్నేమీ చేయకండి. ఇక నుంచి చింటూ ఎప్పుడూ అల్లరి చేయడు. ఎవరినీ బాధ పెట్టడు’ అని వేడుకుంది తల్లి కోతి. అక్కడి నుంచి ఏమీ తెలియనట్టు.. గుహ దగ్గరకు వెళ్లి.. చిన్నూని తీసుకొచ్చింది కుందేలు. ‘అదిగో.. ఆ చెట్టు దగ్గర మీ అమ్మానాన్న ఉన్నారు. వెళ్లి ఏనుగు గున్నతో ఆడుకుంటున్నాను అని చెప్పు’ అని పంపించింది. తిరిగి వచ్చిన చిన్నూని చూసి ఎంతో ఆనందించింది చింటూ. ‘నిజమే.. నేను చాలా మందిని బాధ పెట్టాను’ అనుకొని బాధపడింది చింటూ. ఆ రోజు నుంచి అల్లరి మాని, అందరితో కలిసి మంచి కోతి అని పేరు తెచ్చుకుంది. ‘తనదాకా వస్తే కానీ తెలీదు కాకమ్మా..’ నవ్వుతూ అంది కుందేలు.

- కూచిమంచి నాగేంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని