Updated : 28 Jul 2022 07:07 IST

జయహో... మృగరాజా!

అడవికి రాజైన సింహం అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ముందుగా మృగరాజు లేచి... ‘ఎవరైనా, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి. అదే విధంగా మీకు తోచిన సలహాలు, సూచనలు కూడా చేయవచ్చు. మన జీవుల సంరక్షణే నా  కర్తవ్యమని గమనించండి’ అని చెబుతూ సింహాసనం మీద కూర్చుంది.

మంత్రైన కుందేలు లేచి.. ‘మృగరాజా! మీరు మరోలా అనుకోనంటే నేనొకటి చెబుతాను.!’ సింహం వైపు సందేహంగా చూస్తూ అడిగింది. సమావేశంలో ఉన్న పులి, ఏనుగు, చిరుతపులి, ఎలుగుబంటి, కంచర గాడిద మొదలైన జంతువులన్నీ... ‘కుందేలు ఏమి చెప్పబోతోందో?’ అనుకుంటూ దాన్ని గమనించసాగాయి.

‘మీరేదైనా చెప్పవచ్చు!’ అని సింహం, కుందేలుకు అనుమతిని ఇచ్చింది. ‘ఈ అడవికి, మా అందరికీ రాజు మీరు. ఇది అందరికీ తెలిసిందే. కానీ ప్రతీ సంవత్సరం మన అడవికి మంత్రి మారతారు. కానీ రాజు మీరే. తెలివితేటలు ఎక్కువ ఉపయోగించిన వారు మంత్రి అవుతున్నారు. మొన్న సంవత్సరం ఎలుగుబంటి, కిందటి సంవత్సరం ఏనుగు, ఇప్పుడు నేను మంత్రులుగా మా తెలివిని ప్రదర్శించి పదవిని గెలుచుకుంటున్నాం. కానీ మూడు సంవత్సరాలుగా మీరే రాజుగా కొనసాగుతున్నారు. ఇదెక్కడి న్యాయం? ఏనుగు మీకంటే బలంగా, పెద్దగా ఉంటుంది. పులి వేటాడితే, మీరు వేటాడినట్టే ఉంటుంది. చిరుత పులి మీకంటే వేగంగా పరుగెత్తుతుంది. మీతో సమానంగా, మీకంటే గొప్పగా ఉన్న జంతువులున్నప్పుడు మీరే రాజుగా ఉంటారా? ఆలోచించి చెప్పండి మృగరాజా!’ అని కుందేలు అంది.

ఆ మాటలు విని ఏనుగు, పులి, చిరుతపులిలాంటి జంతువులతో సహా అన్ని జీవులూ కుందేలు వైపు విచిత్రంగా చూశాయి. కుందేలు మాటలతో అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. వేటాడే ముందు ప్రశాంతతలా ఉంది.

‘మీలో ఎవరైనా రాజుగా ఉంటానని ముందుకొస్తే నా సింహాసనాన్ని ఆనందంగా ఇస్తాను. కానీ బల పరీక్ష నెగ్గిన వారే రాజు కావడానికి అర్హులు అవుతారు. పరీక్షకు సిద్ధమేనా?’ ఏనుగు, పులి, చిరుత మూడింటి వైపు చూస్తూ అడిగింది. ‘మాకొక రోజు సమయం కావాలి!’ అంటూ ఆ మూడూ గడువు కోరాయి. మృగరాజు ఒకరోజు సమయం ఇచ్చింది.

కుందేలు అన్ని జీవులకు వినబడేలా... ‘సమావేశం ముగిసింది’ అంది. సింహంతో సహా అన్ని జీవులూ వేటి నివాసానికి అవి వెళ్లాయి. గుహలోకి వెళ్లిన సింహం ఆలోచన అంతా రేపు జరగబోయే సమావేశం మీదే ఉంది. ‘పదవి కోసం ఒక్క జంతువైనా ముందు కొస్తుందా? చూద్దాం, రేపటి వరకూ ఆగుదాం’ అని మనసులో అనుకుంది.

తెల తెల్లగా తెల్లారింది. తిరిగి సమావేశం మొదలైంది. ‘అడవికి రాజు కాబోయే వాళ్లు ముందుకు రావాలి’ అని కుందేలు అన్ని జంతువుల వైపు చూస్తూ గట్టిగా అంది. కానీ ఏ జంతువు కూడా ముందుకు రాలేదు.

ఒక్క జంతువు కూడా ముందుకు రాకపోయే సరికి... ‘నేను ఏమీ అనను, ఏ హానీ చేయనని మాటిస్తున్నాను!’ అని సింహం భరోసాగా అంది. ఆ మాటతో ఏనుగు ముందుకొచ్చింది. ‘శెభాష్‌!’ ఏనుగును మెచ్చుకోలుగా చూస్తూ అంది సింహం. ‘మృగరాజా! నేను పోటీ చేయనని చెప్పడానికే ముందు కొచ్చాను. నేను మీ కంటే పెద్దగా ఉంటే మాత్రం ఏం లాభం. నా ఆలోచనలు చాలా నెమ్మదిగా ఉంటాయి. పైగా నేను మీలా సాహసాలు చేయలేను. రాజుగా నాకు మీరే అర్హులనిపిస్తోంది!’ అని చెప్పింది ఏనుగు.
ఆపై పులి ముందుకొచ్చింది. ‘నువ్వైనా రాజుగా ఉంటావా?’ అని సింహం అడిగింది. ‘లేదు! మహారాజా..! లేదు... వేటాడే సమయంలో అడవి నియమాలను పాటించను. నాకు సహనం తక్కువ కాబట్టి, రాజుగా ఉండే  అర్హత నాకు లేదనిపిస్తోంది!’ అని చెప్పింది పులి.

అప్పుడే చిరుతపులి ముందుకొచ్చింది. ‘పోనీ నువ్వైనా రాజుగా ఉంటావా?’ అని సింహం, చిరుతపులి వైపు చూస్తూ అడిగింది. ‘లేదు! నాకు స్వార్థం ఎక్కువ. నాకు అర్హత లేదనిపిస్తోంది!’ అంది చిరుత. ఇలా ఏ జంతువునడిగినా మేము రాజుగా ఉండలేమని తేల్చి చెప్పాయి.

‘జంతువుల మధ్య నిలబడి నక్కీ నక్కీ చూస్తున్న నక్కను నా వద్దకు తీసుకుని రండి!’ అని మృగరాజు గట్టిగా అనేసరికి అందరి దృష్టీ ఒక్కసారిగా నక్క మీద పడింది. కుందేలు నక్కను మృగరాజు ముందు ప్రవేశపెట్టింది.

‘నక్క మనకు రాజు కాబోతోందా! ఏంటి?’ అని జంతువులు ఒకదానితో ఒకటి గుసగుసలు అడుకోసాగాయి. ‘నిశ్శబ్దం’ అని సింహం అనే సరికి అన్ని జంతువులూ సింహం వైపు చూడసాగాయి. ‘‘కొన్ని రోజుల క్రితం ఈ నక్క నా వద్దకు వచ్చి... ‘నాకు మంత్రి అయ్యే అవకాశం ఇప్పించండి!’ అంటూ నన్ను అడిగింది. సమయం ఉంది. పోటీలో తెలివి బాగా చూపిస్తే తప్పకుండా నువ్వే మంత్రివి కాగలవన్నాను. నా మాటలు నక్కకు రుచించలేదు. కొంతసేపటికి దాహం వేసి మడుగు వద్దకు వెళ్లాను. అక్కడ కొంత దూరంలో నక్క... ఏనుగు, చిరుత, పులివంటి జంతువులతో.. ‘ఎప్పుడూ, సింహమే రాజుగా ఉండాలా? మీరూ ఉండచ్చుగా! మీరు సింహం కన్నా గొప్పవారు!’ అంది. ఆ మాటలు నా చెవిని పడ్డాయి. అందుకే నేనే మంత్రైన కుందేలుతో ఈ నాటకం అంతా ఆడించాను’ అంది సింహం. కుందేలు.. ‘అవును... నిజమే!’ అంది.

‘నక్క తప్ప నాకు మీరందరూ మద్దతు ఇచ్చారు. నాపై మీ అభిమానం బయటపడింది. నక్క నైజం తెలిసొచ్చింది. పదవి కావాలంటే పోటీలో తెలివి ప్రదర్శించి గెలుపొందాలి. అంతే కానీ కపటవేషాలు వేయకూడదు. మరోసారి ఇలా చేస్తే నీకు శిక్ష తప్పదు!’ అని సింహం, నక్కను సున్నితంగా హెచ్చరించింది.

తన బండారం బయట పడటంతో చేసేది లేక సిగ్గుతో తలదించుకుంది నక్క. ‘రాజు కిరీటం వారసత్వం కాదు. ధైర్యం, సాహసం ప్రదర్శిస్తే అది మిమ్మల్నైనా వరిస్తుంది. ఇది అందరూ గమనించండి!’ అని సింహం అనేసరికి జంతువులన్నీ.. ‘మృగరాజాకు జై’ అని గట్టిగా అన్నాయి.

- కె.వి.లక్ష్మణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని