చిన్నారి పోలీసులు!

హలో ఫ్రెండ్స్‌.. పోలీసులను చూసినా, వారి వాహనాల శబ్దం వినపడినా.. మనం బోలెడు భయపడతాం కదా! అలాంటిది, ఓ ఇద్దరు నేస్తాలు.. ఏ పరీక్షా లేకుండానే ఐపీఎస్‌ అధికారులుగా మారారు.

Updated : 28 Jul 2022 07:09 IST

హలో ఫ్రెండ్స్‌.. పోలీసులను చూసినా, వారి వాహనాల శబ్దం వినపడినా.. మనం బోలెడు భయపడతాం కదా! అలాంటిది, ఓ ఇద్దరు నేస్తాలు.. ఏ పరీక్షా లేకుండానే ఐపీఎస్‌ అధికారులుగా మారారు. స్టేషన్‌లో రికార్డులను పరిశీలించడంతోపాటు కేసులకు సంబంధించి అక్కడి సిబ్బందికి కొన్ని సూచనలూ చేశారు. ‘పిల్లలేంటి? పోలీసులుగా మారడమేంటి?’ అని సందేహం మీకు వచ్చే ఉంటుంది. అది తీరాలంటే, చకచకా ఇది చదివేయండి మరి.

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలోని కోరమంగళలో ఉన్న డీసీపీ కార్యాలయానికి ‘కుయ్‌.. కుయ్‌’మంటూ ఉదయాన్నే ఒక బుగ్గ కారు వచ్చి ఆగింది. పోలీసు యూనిఫాం ధరించిన ఇద్దరు 13 ఏళ్ల బాలురు అందులోంచి దర్జాగా దిగారు. వారికి అక్కడి సిబ్బంది సెల్యూట్‌ చేసి, భవనంలోని ఛాంబర్‌లోకి తీసుకెళ్లి డీసీపీ స్థానంలో కూర్చోబెట్టారు. ఇదంతా సినిమా కథలా అనిపిస్తోంది కదూ!

రెండు గంటలు..
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మిథిలేశ్‌, కేరళలోని కొట్టాయానికి చెందిన సల్మాన్‌.. ఇద్దరికీ పోలీసు కావాలనేది లక్ష్యం. అయితే, ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోరికను.. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తీర్చాలనుకున్నారు. కోరమంగళ డీసీపీతో మాట్లాడటంతో ఆయన సరేనన్నారు. దాంతో ఇద్దరూ తమ పేర్లు రాసి ఉన్న పోలీసు యూనిఫాం ధరించి, ఐపీఎస్‌ అధికారులుగా రెండు గంటలపాటు విధులు నిర్వర్తించారు. డీసీపీ కార్యాలయంలోని రోజూవారీ రికార్డులను పరిశీలించారు. ఆ భవనంలోనే ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. కేసుల రిజిస్టర్‌ను చూశారు. సరదాగా అక్కడి ఇన్‌స్పెక్టర్‌ కొన్ని కేసుల వివరాలు చెబుతుంటే.. వాటిపైన ఎలా ముందుకెళ్లాలో ఈ నేస్తాలే సూచించడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది.

ఆలోచన వచ్చిందిలా..
‘ఇంతకీ మిథిలేశ్‌, సల్మాన్‌లు పోలీసే కావాలని ఎందుకు అనుకున్నారు?’ అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. అందుకు వారి సమాధానమేంటంటే.. ‘ప్రతి ఒక్కరిలో క్రమశిక్షణ ఉంటేనే, సమాజం బాగుంటుందని అనుకున్నాను. అది పోలీసులతోనే సాధ్యమని చిన్నతనం నుంచి నా నమ్మకం. అందుకే, ఐపీఎస్‌ చదివి పెద్ద అధికారి కావాలనుకున్నా’ అని మిథిలేశ్‌ చెబుతున్నాడు. ‘ఒకరోజు నేను స్కూల్‌కు వెళ్తుంటే, ఉన్నట్టుంది ఓ వంతెన కూలిపోయింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూశాక.. పెద్దయ్యాక ఎలాగైనా పోలీసు కావాలని గట్టిగా నిశ్చయించుకున్నా’ అని సల్మాన్‌ వివరించాడు.


నవ్వుతూ వీడ్కోలు..

పోలీసు స్టేషన్‌ లోపల ఉన్న లాకప్‌ గదులను పరిశీలించాక.. అక్కడి రిజిస్టర్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంకెళ్లు ఎలా వేస్తారో, కేసుల నమోదు, వాటి విచారణ తదితర అంశాలను ఇన్‌స్పెక్టర్‌ దగ్గరుండి వారికి వివరించారు. తరవాత, పిల్లలిద్దరూ వచ్చిన వాహనంలోనే తిరిగి వెళ్లిపోయారు. ఈ చిన్నారి పోలీసులకు అక్కడి సిబ్బంది నవ్వుతూ వీడ్కోలు పలికారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని