Published : 29 Jul 2022 00:27 IST

భలే శిష్యుడు!

చంద్రగిరి రాజ్యాన్ని భూపాలుడు పాలించేవాడు. రాజ్యం పొలిమేర వద్ద పార్వతీపురం ఉంది. అక్కడ గురుకులాన్ని రామశర్మ నిర్వహిస్తున్నాడు. ఒకసారి భూపాలుడు పండితులను, గురుకుల నిర్వాహకులను సన్మానించాలనుకున్నాడు. ఆ మేరకు వారికి ఆహ్వానాలూ పంపాడు.

ఆహ్వానం అందుకున్న రామశర్మ, ప్రియ శిష్యుడు పన్నెండు సంవత్సరాల సుధాముడితో గుర్రపు బండిలో అడవి దారిలో కోటకు బయలుదేరాడు. దారిలో ఒక దొంగ గుర్రపు బండిని ఆపాడు.

‘అయ్యా! నేను ఈ మధ్యనే దొంగగా మారాను. మీ వద్ద ఉన్నది ఇవ్వండి. నేను హింసకు పాల్పడను’ అని అన్నాడు. ‘బాబూ మా దగ్గర ఏమీ లేదు. కావాలంటే మా చేతి సంచి చూసుకో’ అని సంచిని ఆ దొంగకు ఇచ్చాడు రామశర్మ.
‘అవును.. మేము రాజు గారిని కలవడానికి కోటకు వెళుతున్నాం. రాజు గారు మా గురువు గారికి ఏది ఇస్తే అది నీకు ఇస్తాం. నీ పేరేంటో చెప్పు’ అన్నాడు సుధాముడు.

‘నా పేరు శివయ్య. మీరు మాట తప్పకుండా రాజుగారు ఇచ్చింది నాకు ఇవ్వాలి సుమా..’ అన్నాడు శివయ్య. ‘ఓ అలాగే ఇస్తాము’ అన్నాడు సుధాముడు. సుధాముడి మాటలకు ముసిముసిగా నవ్వుకున్నాడు రామశర్మ. గుర్రపు బండి బయలుదేరి కోటకు చేరుకుంది.

భూపాలుడు అందరినీ సన్మానిస్తున్నాడు. రామశర్మ వంతు వచ్చింది. ‘గోవర్దన పర్వతాన్ని ఎత్తింది ఆ గోపాలుడు... ప్రజల గుండెలు గెలుచుకుని ఏలుతున్నది ఈ భూపాలుడు’ అని రాజును పొగిడాడు సుధాముడు.

‘పిట్ట కొంచెం కూత ఘనం.. ఎవరు ఈ పిల్లవాడు’ అన్నాడు రాజు. ‘మహారాజా! ఇతడు నా ప్రియశిష్యుడు. పేరు సుధాముడు’ అన్నాడు రామశర్మ. ‘చూస్తుంటే చిచ్చర పిడుగులా ఉన్నాడు’ అనుకొని, రామశర్మను సన్మానించి పది బంగారు నాణేలు ఇవ్వబోయాడు రాజు.

‘మహారాజా! మీరు మా గురువు గారికి ఇచ్చే బంగారు నాణేలు నాకు ఇవ్వండి... నాకు బహుమానాలు ఇవ్వదలచుకుంటే అవి మా గురువుగారికి ఇవ్వండి’ అన్నాడు సుధాముడు. ఆ మాటలకు సభలో అందరూ గుసగుసలాడసాగారు.

‘అదేంటీ.. గురువు గారికి ఇచ్చే బహుమతి నీకు ఇవ్వాలని అంటున్నావు?’ అన్నాడు మంత్రి. దారిలో దొంగ అడ్డగించిన సంగతి చెప్పాడు సుధాముడు. ‘అయితే ఇప్పుడే భటులను పంపి ఆ దొంగను పట్టి చెరసాలలో పెట్టిస్తాను’ అన్నాడు రాజు.

‘వద్దు మహారాజా! ఆ దొంగ నిజాయతీ గలవాడు. అతనికి నేను బుద్ధి చెబుతాను’ అన్నాడు సుధాముడు. ‘ఇప్పుడేం చేయమంటావు’ అన్నాడు రాజు. ‘బంగారు నాణేలు నాకు ఇస్తున్నట్టు, ఒక వెండి నాణెం గురువుగారికి ఇస్తున్నట్లు పత్రాలు రాసి ఇవ్వండి. ఒప్పందం ప్రకారం గురువుగారికి ఇచ్చే బహుమతి ఆ దొంగకు ఇస్తాను’ అన్నాడు సుధాముడు.

‘అలాగే.. నీ తెలివి తేటలు అర్థమయ్యాయి’ అన్నాడు రాజు.  రాజుకు ధన్యవాదాలు చెప్పి రామశర్మ, సుధాముడు గుర్రపు బండిలో తిరుగు ప్రయాణమయ్యారు. శివయ్య వీరి కోసమే ఎదురు చూడసాగాడు. బండి ఆగింది.

‘హమ్మయ్య... మాట తప్పకుండా ఇదే మార్గం గుండా వచ్చారు.. చాలా సంతోషం’ అన్నాడు శివయ్య. ‘మాది కూడా మాటంటే మాటే’ అని వెండి నాణెం ఇచ్చి పత్రం చూపించాడు సుధాముడు. పత్రం చదివి ఆ వెండి నాణెం తీసుకుని.. ‘ఏం చేస్తాం. నాకింతే ప్రాప్తం’ అన్నాడు శివయ్య.

‘నీ కుటుంబ పోషణకు ఈ ఒక్క నాణెం ఎన్ని రోజులు వస్తుంది’ అని అడిగాడు రామశర్మ. ‘ఒక మాసం వస్తుంది’ అన్నాడు శివయ్య. ‘తరువాత ఏం చేస్తావు’ అన్నాడు సుధాముడు. ‘మళ్లీ ఇలాగే ఎవరినైనా అడ్డగించి న్యాయంగా దోచుకుంటాను’ అన్నాడు శివయ్య.

‘ఇంత బలిష్టంగా ఉన్నావు.. కష్టపడి పని చేసుకోవాలి కానీ, ఇలా దారి కాచి దోచుకోవడం ఏమీ బాలేదు’ అన్నాడు రామశర్మ.

శివయ్యకు ఏం చెప్పాలో తోచలేదు. ‘కోటలో కొలువు ఇప్పిస్తాను చేస్తావా?’ అన్నాడు సుధాముడు. ‘చేస్తాను’ అన్నాడు శివయ్య. శివయ్యను గుర్రపు బండిలో కూర్చొబెట్టుకుని మళ్లీ కోటకు చేరుకున్నారు. రాజును కలిసి ‘ఇతనే శివయ్య... ఇతడికి కొలువు ఇవ్వండి మహారాజా!’ అన్నాడు సుధాముడు.

‘ఇప్పుడిప్పుడే దొంగగా మారుతున్న ఇతడికి మంచి మాటలు చెప్పి తీసుకొచ్చావు. ఇతడికి సైనిక శిక్షణ ఇప్పించి కొలువు ఇస్తాను’ అన్నాడు రాజు. ‘శివయ్యకు కొలువు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు మహారాజా!’ అని చెప్పి రామశర్మ, సుధాముడు బయలుదేరుతుంటే.. ‘నాలో మార్పు తెచ్చినందుకు మీకు కృతజ్ఞతలు’ అని రామశర్మతో, సుధాముడితో, మహారాజుతో అన్నాడు శివయ్య.

‘రామశర్మా.. తెలివైన మీ శిష్యుడు, గురుకులంలో అన్ని విద్యలూ పూర్తి చేసుకున్నాక.. మా కోటలో కొలువు ఇస్తాను’ అన్నాడు రాజు. ‘అలాగే మహారాజా!’ అన్నాడు రామశర్మ. రాజుకు ధన్యవాదాలు చెప్పాడు సుధాముడు. గురుకులానికి చేరుకున్నాక సుధాముణ్ని అందరూ పొగిడారు. గురువు కూడా అతడి భుజం తట్టాడు. వినయంగా గురువుగారికి పాదాభివందనం చేశాడు సుధాముడు.

- యు.విజయశేఖర రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts