Published : 30 Jul 2022 00:22 IST

కొక్కొరోకో.. కొక్కొరోకో.!

ఉదయాన్నే లేచిన కోడిపుంజు ఆహారం కోసం బయలుదేరింది. దారిలో చెత్తకుప్పల దగ్గర పురుగులు తింటూ చాలా దూరం వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్లే దారి మర్చిపోయింది. తల ఎత్తి ‘కొక్కొరోకో’ అని గట్టిగా కూత పెట్టింది. ఎవరూ కనిపించలేదు. భయంతో వడివడిగా అడుగులు వేస్తూ.. పరుగులు తీస్తూ మరింత దూరం వెళ్లిపోయింది. అప్పటికే చీకటి పడింది. తానున్న ప్రదేశమేంటో కోడిపుంజుకు తెలియడం లేదు. అటూ ఇటూ తిరుగుతూ ఓ చెట్టు కిందకు చేరింది. అక్కడే ఒక మూలన ఆ రాత్రి నిద్రపోయింది. మధ్యరాత్రి దాటాక చీకట్లోనే.. అలవాటు ప్రకారం ‘కొక్కొరోకో’ అని కూత పెట్టింది. దాని అరుపు ఆ ప్రాంతంలో ప్రతిధ్వనించింది. దాంతో మరింత భయపడింది కోడిపుంజు. తెల్లవారాక చుట్టూ చూస్తే అదో పెద్ద అడవి అని దానికి అర్థమైంది. ఇంతలో చెట్ల పైనుంచి పక్షుల కిలకిలరావాలు వినపడ్డాయి. అవి కోడిపుంజును వింతగా చూడసాగాయి.

‘నీ పేరు ఏంటి.. ఎక్కడ నుంచి వచ్చావు? ఈ అడవికి కొత్తలా ఉన్నావు. ఎందుకొచ్చావు?’ అని కోడిపుంజును ప్రశ్నించింది రామచిలుక. ‘నన్ను కోడిపుంజు అంటారు. నాది ఈ పక్కనే ఉన్న పల్లెటూరు. ఆహారం కోసం వచ్చాను. దారి తప్పి ఈ అడవిలో చిక్కుకున్నా’ అంది. ఇంతలో కోకిల కల్పించుకొని ‘నిన్ను చూస్తుంటే ఎగరలేవనిపిస్తోంది. ఏ జంతువన్నా చూస్తే నీ పని అంతే..’ అనడంతో కోడిపుంజు మరింత భయపడింది. ఇంతలో ఎక్కడి నుంచో ఓ కుందేలు చెట్టు వద్దకు వచ్చింది. కోడిపుంజును పైకీ కిందకు ఎగాదిగా చూసింది. ‘‘రాత్రి ‘కొక్కొరోకో’ అని కూసింది ఎవరు?’’ అని ప్రశ్నించింది. పక్షులన్నీ.. ‘మేం కాదు .. మేం కాదు’ అని అన్నాయి. ‘అలా అరిచిన జీవిని తన ముందు హాజరు పరచాలని మృగరాజు ఆదేశం’ అంది కుందేలు. పక్షులన్నీ భయంతో కోడిపుంజును చూపించాయి.

‘మృగరాజు వద్దకు పద’.. అంటూ కోడిపుంజుతో అంది కుందేలు. దానికి కోడిపుంజు ‘నేను ఈ అడవికి కొత్త. తెలియక చేశాను’ అని సమాధానం ఇచ్చింది. మరోసారి కూత పెట్టను అంది. ‘ఈ మాటలు నా దగ్గర కాదు.. మృగరాజు సమక్షంలో చెప్పాలి. రాకపోతే శిక్ష పెరుగుతుంది’ అని హెచ్చరించింది కుందేలు. ఇక చేసేదేమీ లేక.. కోడిపుంజు, కుందేలుతో కలసి మృగరాజు వద్దకు వెళ్లింది. అక్కడ పెద్ద బండరాయిపైన కూర్చున్న సింహాన్ని చూడగానే కోడిపుంజుకు భయంతో పాటు ఏడుపు తన్నుకొచ్చింది. ఏడుస్తూ కూడా ‘కొక్కొరోకో’ అని కూత పెట్టసాగింది. సింహానికి కోడిపుంజు పరిస్థితి చూసి జాలి వేసింది. ‘మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నా.. ఇకపై రాత్రి వేళల్లో అరిచి జంతువులకు నిద్రాభంగం కలిగించొద్దు’ అని ఆదేశించింది. బతుకుజీవుడా.. అనుకుంటూ పరుగున చెట్టు వద్దకు చేరుకుంది కోడిపుంజు. ఆ రాత్రి కూడా అక్కడే నిద్రపోయింది.

అర్ధరాత్రి దాటాక దానికి మనుషుల మాటలు వినపడ్డాయి. తన పక్క నుంచి ఇద్దరు వ్యక్తులు వెళ్లటం గమనించింది. ఒకరి చేతిలో వల, మరొకరి వద్ద విల్లుతో మృగరాజు గుహ వైపు వెళ్లడం చూసింది. కోడిపుంజుకు భయంతో నిద్ర పట్టలేదు. చెట్టుపైన చూస్తే పక్షులన్నీ నిద్రలో ఉన్నాయి. ఇంతలో అలవాటు ప్రకారం ‘కొక్కొరోకో’ అని రెండుసార్లు గట్టిగా కూత కూసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకొని నాలుక కరుచుకుంది. సింహం నుంచి పిలుపు రాకముందే అడవి దాటాలని నిర్ణయించుకుంది. తెల్లవారగానే భయంతో పరుగు తీయటం ప్రారంభించింది కోడిపుంజు.

దారి మధ్యలో దానికి కుందేలు కనిపించింది. దాన్ని చూడగానే కోడిపుంజు గజగజ వణికిపోయింది. ‘తప్పైంది.. క్షమించమని రాజుకు చెప్పు’ అని వేడుకుంది. దానికి కుందేలు ‘మృగరాజు నిన్ను స్వయంగా తీసుకురమ్మని ఆదేశించారు’ అంది. కుందేలు మాట కాదనలేక, తప్పించుకునే మార్గం లేక సింహం వద్దకు వెళ్లిందది. అక్కడ సింహాన్ని చూడగానే కోడిపుంజు.. ‘మృగరాజా.. నన్ను వదిలేయండి. మరోసారి కూత పెట్టను’ అని కోరింది. ‘‘నిన్ను శిక్షించడానికి రమ్మనలేదు. ఈరోజు నీ కారణంగా నా ప్రాణాలు నిలబడ్డాయి. నువ్వు అరవకపోతే అడవిలోకి వచ్చిన వేటగాళ్లు నన్ను బంధించి హతమార్చేవారు. నీ కూతతో మెలకువ వచ్చింది. పక్కన చూస్తే ఇద్దరు వేటగాళ్లు, వల కనపడ్డాయి. నేను వెంటనే అప్రమత్తమై గర్జించగానే వాళ్లు పారిపోయారు. నువ్వు నాకు ప్రాణదాతవు. ఈ అడవిలో నీకు ఇష్టం వచ్చినంతకాలం ఉండొచ్చు. ఏ సమయంలోనైనా ‘కొక్కొరోకో’ అని అనొచ్చు’’ అంది సింహం. ఆనందంతో ‘కొక్కొరోకో’ అంటూ అడవిలోనే ఉంటానంది కోడిపుంజు.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts