Published : 31 Jul 2022 00:19 IST

కనువిప్పు!

పేదరాశి పెద్దమ్మ.. చీకటి పడ్డాక వచ్చిన అతిథులకు భోజనం పెట్టింది. వారి క్షేమ సమాచారాలు అడిగి, తాను కూడా తిని నిద్రకు ఉపక్రమించింది. ఇంతలో ఇంటి తలుపులు ఎవరో కొడుతున్న శబ్దం వినిపించింది. పెద్దమ్మ వెళ్లి తలుపు తీసింది. ఒక సాధువు ఎదురుగా కనిపించాడు. ఆయనను సాదరంగా లోపలికి ఆహ్వానించింది. ‘అమ్మా.. చాలా దూరం నుంచి వస్తున్నా. ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా పెట్టు’ అని పెద్దమ్మను అడిగాడు సాధువు. అతడిని కూర్చొమ్మని చెప్పి వంట గదిలోకి వెళ్లి, భోజనం సిద్ధం చేసింది. కాళ్లు, చేతులు కడుక్కోమని చెప్పి నీరు అందించింది. సాధువు వచ్చేలోగా అరటి ఆకులో భోజనం వడ్డించింది. సాధువు సంతృప్తిగా తిన్నాక ‘అమ్మా.. వేళ కాని వేళలో వచ్చినా, ఏమాత్రం విసుగు చెందకుండా.. చక్కగా వండి, వేడివేడి రుచికరమైన పదార్థాలతో నా ఆకలి తీర్చావు. నీకు ఒక వరం ఇస్తున్నాను. నీ దగ్గరకు వచ్చేవారు.. ఈ ఊరికి ఏ పని మీద వచ్చారో నీకు నిజమే చెప్పాలి. ఒకవేళ అబద్ధం ఆడితే.. నీకు ఇట్టే తెలిసిపోతుంది’ అన్నాడు. ఆ రాత్రి అక్కడే బస చేసి, ఉదయమే వెళ్లిపోయాడు సాధువు.

ఒకరోజు గంగడు అనే ఒక దొంగ పేదరాశి పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. అతనికి భోజనం పెట్టిన తర్వాత, పెద్దమ్మ అతని గురించి అడుగుతూ.. ‘నువ్వు ఈ ఊరు రావడానికి కారణం ఏమిటి? ఏ పని మీద వచ్చావు?’ అని అడిగింది. తాను వ్యాపారం నిమిత్తం వచ్చానని అబద్ధమాడాడు గంగడు. సాధువు ఇచ్చిన వరంతో అది అబద్ధమని పెద్దమ్మకు తెలిసింది. ‘నాయనా! నువ్వు ఈ ఊరు వచ్చిన పని చెప్పటంలో అబద్ధం ఆడుతున్నావు. అది నేను గ్రహించాను. నా దగ్గర ఎప్పుడు కూడా నిజమే చెప్పు. నేను నీకు ఎటువంటి హాని తలపెట్టే దానిని కాదు’ అని ప్రేమగా గంగడిని అడిగింది పెద్దమ్మ. ‘అమ్మా.. నేను ఈ ఊరి జమీందారు ఇంటిలో ఈ రాత్రి దొంగతనం చేయడానికి వచ్చాను’ అని నిజం చెప్పాడు గంగడు. అప్పుడు పేదరాశి పెద్దమ్మ ‘నాయనా.. దొంగతనం నేరమని నీకు తెలియదా? ఇతరుల ధనాన్ని అపహరించడం సరికాదు కదా!’ అని అడిగింది. భార్యాబిడ్డలను పోషించుకోవడానికి నాకు గత్యంతరం లేక దొంగతనం చేస్తున్నాను’ అని సమాధానమిచ్చాడు గంగడు.

‘నీ భార్యాబిడ్డలకు నువ్వు చేస్తున్న పని తెలుసా?’ అని పెద్దమ్మ అడిగింది. ‘వారికి తెలిస్తే బాధపడతారు.. అందుకే వాళ్లకి నేను తెలియనివ్వలేదు’ అన్నాడు గంగడు. ‘వాళ్లకు బాధ కలిగించే పని చేయడం తప్పు కదా! నువ్వు దొంగతనం చేస్తూ దొరికితే ఎలాగైనా వారికి తెలుస్తుంది. కుటుంబాన్ని పోషించడానికి దొంగతనం చేస్తున్నానని అంటున్నావు. మరి నీకు శిక్ష పడితే.. అందులో వారు కూడా భాగాన్ని తీసుకుంటారా? నీ బదులుగా వారు శిక్ష అనుభవిస్తారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది పేదరాశి పెద్దమ్మ. గంగడికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాకపోవడంతో తలదించుకున్నాడు. ఇనుము వేడిగా ఉన్నప్పుడే, దాన్ని మనకు కావాల్సిన ఆకారంలోకి మలుచుకోవాలన్న సత్యం తెలిసిన పేదరాశి పెద్దమ్మ.. ‘చూశావా.. నా ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు. నువ్వు దొంగతనం చేసి పట్టుబడితే నీ భార్యాబిడ్డలు అనాథలు అయిపోతారు. వాళ్లు జీవితాంతం బాధపడతారు. నీ జీవితం జైల్లోనే మగ్గిపోతుంది. మీ కుటుంబానికి మేలు చేయని పని నీకు అవసరమా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు చేస్తున్నది తప్పని నీకే తెలుస్తుంది’ అని గంగడిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.

పేదరాశి పెద్దమ్మ మాటలు అతడిని ఆలోచనలో పడేశాయి. ‘అమ్మా.. నాకు కనువిప్పు కలిగించావు. దొంగతనం చేయడం చాలా తప్పని అర్థమయ్యేట్లు చెప్పావు. ఇకపై నేను చోరీలు మానివేసి కష్టం చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటాను’ అని అన్నాడు గంగడు. పెద్దమ్మ ఆనందపడుతూ ‘నాయనా.. ఈ రాత్రికి ఇక్కడే ఉండు. జమీందారు గారి దగ్గర నీకు నేను పని ఇప్పిస్తాను’ అని చెప్పింది. అన్నట్లుగానే ఉదయమే జమీందారు గారి దగ్గరకు తీసుకువెళ్లి గంగడికి కొలువు ఇప్పించింది పెద్దమ్మ. ‘అమ్మా.. నీ రుణం మరువలేనిది. నా ఆకలిని తీర్చడమే కాకుండా, నాలో పరివర్తన తీసుకొచ్చి.. నా కుటుంబ పోషణకు పని కూడా ఇప్పించావు. ఇక్కడ చక్కగా పని పనిచేసి.. జమీందారు గారి మన్ననల్ని పొందుతాను’ అని కృతజ్ఞతా భావంతో చెప్పాడతను. పెద్దమ్మకి ఇచ్చిన మాట ప్రకారమే.. జమీందారు దగ్గర బుద్ధిగా పనిచేసి మంచి పేరు పొందాడు గంగడు.

- మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts