రెండూ సరైనవే!

గంగవరం, రామవరం గ్రామాల మధ్య ప్రవహించే నాగావళి నది మీద వంతెన ఉంది. అక్కడికి వెళితే చల్లటి గాలి తగులుతుంది. వేసవి ఉక్కపోతల నుంచి తప్పించుకోవడానికి సాయంత్రాలు జనం అక్కడికి వెళుతుంటారు. ఒక వేసవి సాయంత్రం గంగారాం మాస్టారు వంతెన మీదకు వెళుతుండగా, తండ్రి వెంటే వెళ్లాడు తొమ్మిదో తరగతి చదివే వేణు...

Published : 02 Aug 2022 00:27 IST

గంగవరం, రామవరం గ్రామాల మధ్య ప్రవహించే నాగావళి నది మీద వంతెన ఉంది. అక్కడికి వెళితే చల్లటి గాలి తగులుతుంది. వేసవి ఉక్కపోతల నుంచి తప్పించుకోవడానికి సాయంత్రాలు జనం అక్కడికి వెళుతుంటారు. ఒక వేసవి సాయంత్రం గంగారాం మాస్టారు వంతెన మీదకు వెళుతుండగా, తండ్రి వెంటే వెళ్లాడు తొమ్మిదో తరగతి చదివే వేణు.

చీకటి పడిన తరువాత ఒక్కొక్కరూ ఇళ్లకు వెళ్లిపోతుంటే, గంగారాం తన కొడుకుని తీసుకుని బయల్దేరాడు. వంతెన చివర బిక్కుబిక్కుమంటూ కనబడ్డాడో అబ్బాయి. అతణ్ని పలకరించి వివరాలడిగాడు గంగారాం. తనది పొరుగూరనీ, ఆ రోజొచ్చిన పరీక్షా ఫలితాల్లో తప్పాననీ, ఇంటికెళితే అమ్మానాన్న కొడతారన్న భయంతో ఇక్కడ కూర్చున్నానని చెప్పాడా అబ్బాయి.

‘అలాగా..! ఎంతమాత్రం ఒంటరిగా కూర్చోవద్దు. మాతో రా! ఈ రాత్రి మాతో ఉండి ఉదయమే వెళ్దువు గానీ. మీ వాళ్లకు ఫోను చేసి కంగారు పడొద్దని చెబుతాను’ అని కుర్రాడిని ఆహ్వానించాడు గంగారాం.

కుర్రాడు వాళ్లతో రావడానికి ఇష్టపడలేదు. అలాగని గంగారాం వదిలిపెట్టలేదు. బుజ్జగించాడు చాలాసేపు. మరికాసేపటికి కుర్రాడిని వెతుకుతూ బంధువులు వచ్చారు. గంగారాం బుజ్జగించడాన్ని దూరం నుంచే చూసిన వాళ్ల నాన్న... ‘మావాడిని ఒంటరిగా ఉండనీయకుండా ఇంటికి పిలిచినందుకు ధన్యవాదాలండీ’ అని నమస్కరించాడు.

తర్వాత ఆ కుర్రాడికి నచ్చజెప్పి తీసుకుపోయారు వాళ్లు. అక్కడి నుంచి వెళుతున్న దారిలో గంగారాంను ఒక ఇంట్లో వాళ్లు ఆపి పలకరించారు. చాలా మంది ఉన్నారక్కడ. కాసేపు నవ్వుతూ మాట్లాడిన గంగారాం ఇంటికి బయల్దేరబోతూ... చేతిలో పుస్తకంతో ఉన్న యువకుణ్ని చూశాడు. అతడి వివరాలడిగాడు. యువకుడు.. ‘పక్క వీధిలో మా ఇల్లుంది. ఉద్యోగానికి జరగబోయే రాత పరీక్షకు చదువుకోడానికి వచ్చాను’ అంటూ... చేతిలోని పుస్తకం చూపించాడు. ‘అలా.. అంతమంది మధ్య కూర్చుని చదివితే ప్రయోజనముండదు. ఒక్కడివే ఏకాంతంగా కూర్చుని చదివితే గుర్తుంటుంది’ అని సలహా ఇచ్చాడు గంగారాం.

‘మా ఇంట్లో మరీ ఎక్కువ జనం. ఇక్కడే కొంత నయమని వచ్చాను’ అన్నాడా యువకుడు. గంగారాం.. ‘నీ ఆలోచన తప్పు. పగటి పూట అయితే ఒక్కడివే ఏ చెట్టు కిందో కూర్చుని చదువు. రాత్రైతే దీపం వెలుగులో వీళ్లకు దూరంగా వెళ్లి ఏకాంతంగా చదువుకో. అంతేకానీ ఇలా చెయ్యొద్దు’ అన్నాడు. సరేనంటూ తలూపాడా యువకుడు.

అది విన్న వేణుకు ఒక సందేహం వచ్చింది. ‘నాన్నా! ముందేమో వంతెన మీద కుర్రాడిని ఒక్కడినే ఉండొద్దన్నావు. ఇక్కడేమో అందరి మధ్యన ఉన్న యువకుడిని వాళ్లతో ఉండొద్దన్నావు. రెండింట్లో ఏది సరైంది?’ అనడిగాడు కాస్త భయం భయంగా!
వేణు భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని.. ‘రెండూ సరైనవే.. వివరంగా ఇంటికి వెళ్లాక చెబుతాను’ అన్నాడు గంగారాం. రాత్రి భోజనం చేస్తుండగా తన సందేహం గుర్తు చేశాడు వేణు. గంగారాం.. ‘గుర్తుంది.. ఇక్కడైతే తమ్ముడు కూడా వింటాడని ఆగాను. వంతెన మీద కుర్రాడు ఒంటరిగా చీకట్లో ఉన్నాడు. పైగా పరీక్ష తప్పిన బాధలో ఉన్నాడు. దుఃఖంలో ఉన్నవారిని ఒంటరిగా ఉండనివ్వకూడదు. అలాంటివాళ్లు దగ్గరి వాళ్ల మధ్య గడపాలి. ఆ సమయంలో ఓదార్పు అవసరం. అప్పుడే బాధను తొందరగా మరచిపోగలుగుతారు. లేదంటే చెడ్డ ఆలోచనలు భయపెడతాయి. నిరాశ, దుఃఖం చుట్టుముట్టి అఘాయిత్యం చేసుకునేలా ప్రేరేపిస్తాయి. అందుకే వంతెన మీద ఒంటరిగా వద్దని చెప్పాను’ అన్నాడు.

‘అందుకేనా.. మనింటికి రమ్మన్నావు...’ కళ్లు పెద్దవి చేసుకుని అన్నాడు వేణు. అవునన్నట్లు తలూపాడు తండ్రి.

‘ఇక యువకుడేమో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ గుంపులో కూర్చున్నాడు. అది తప్పు. మంచి ఆలోచనలు రావాలన్నా, చదివింది బాగా గుర్తుండాలన్నా.. ప్రశాంతంగా ఉండే చోట ఏకాంతంగా కూర్చుని సాధన చేయాలి. అప్పుడే చదివింది జ్ఞాపకం ఉంటుంది. తపస్సు చేసుకునే మునులు కూడా ఏ ఆటంకం ఉండకూడదనే మనుషులు తిరగని అడవులకు వెళ్లేవారు. ఏకాంతంలోనే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి అతడికలా సలహా ఇచ్చాను’ అని చెప్పాడు గంగారాం.

‘నాకిప్పుడు ఒంటరితనానికి, ఏకాంతానికి తేడా తెలిసింది’ అని సంబరపడుతూ చెప్పాడు వేణు. నాన్ననడిగి మొత్తం విషయం తెలుసుకున్న తమ్ముడు కూడా ఒంటరితనం, ఏకాంతం మధ్య తేడా తెలిసిందన్నాడు. మొత్తానికి మీరు ఉపాధ్యాయుడని నిరూపించుకున్నారు. మీతో వచ్చినందుకు ఒక పాఠమే నేర్పారు వాడికి’ నవ్వుతూ అంది గంగారాం భార్య.

‘ఇందులో నా గొప్పతనమేముంది? వాడడిగాడు కాబట్టే సందేహం తీర్చాను. పిల్లల్లో ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే జ్ఞానం పెరుగుతుంది. వాళ్లకే సందేహం వచ్చినా పెద్దల్ని అడిగి వెంటనే తెలుసుకోవాలి. అలా జ్ఞానం పెంచుకున్నప్పుడే ప్రయోజకులు అవుతారు’ అన్నాడు గంగారాం.

-ఎన్‌.ఉమా మహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు