Published : 05 Aug 2022 00:20 IST

నా పాట.. నీ నాట్యం!

నెమలికి అంతా అయోమయంగా ఉంది. తాను అడవిలోకి వచ్చానని మాత్రం తెలుసుకుంది. ‘పగలే అయినా వెలుగు తక్కువగా ఉండటానికి కారణం ఏపుగా పెరిగిన చెట్లే కదా’ అని అనుకుంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కొంతదూరం ముందుకు నడిచింది. ఆకలి వేయడంతోపాటు ఆయాసం రావడంతో ఒక జామ చెట్టు కింద ఆగింది. నెమలి అలికిడికి చెట్టు పైన ఉన్న కోకిల నిద్రలేచింది. కింద ఉన్న నెమలిని చూడగానే ‘చిట్టీ.. నా కోసం తిరిగి వచ్చేశావా? నువ్వు వెళ్లిపోయావని నేనెంతగా ఏడ్చానో నీకు తెలియదు. హమ్మయ్య! నువ్వు వచ్చేశావ్‌. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా ఉంది’ అంది.

కోకిల మాటలకు నెమలి ఆశ్చర్యపోతూ.. ‘నన్ను చిట్టీ అని పిలుస్తోందేమిటి? నా పేరు చిట్టి కాదుగా!’ అని మనసులో అనుకుంటూనే కోకిల వైపు విచిత్రంగా చూడసాగింది. ‘అలా విచిత్రంగా, కొత్తగా, ఏమీ తెలియనట్లు చూస్తావే? నాలుగు రోజులు ఎటో వెళ్లొచ్చేసరికి నీ చిన్నినే మరచిపోతావా? స్నేహం అంటే ఇదేనా?’ అంటూ మూతి ముడుచుకుంది కోకిల. ‘పక్క ఊర్లో ఉండే నా యజమాని పెట్టే బాధలు భరించలేక.. అతని కన్నుగప్పి ఇక్కడకు వచ్చాను. నా పేరు చిట్టి కాదు’ అని కోకిలతో గట్టిగా అంది నెమలి. ‘చిట్టీ.. నువ్వు మారిపోయావు. నన్ను పూర్తిగా మర్చిపోయావు. యజమాని, ఊరు.. అంటూ కొత్తగా మాట్లాడుతున్నావు. నా పాట, నీ నాట్యం అడవిలో అందరికీ తెలుసు. కానీ నువ్వు మర్చిపోవడమే విచిత్రంగా ఉంది. ఎన్నో వేడుకలకు, పండుగలకు నువ్వూ, నేను కలసి ఆడాము, పాడాము. అందరినీ అలరించాము. కానీ నువ్వు ఇప్పుడవన్నీ మరచిపోవడమే నాకు విచిత్రంగా ఉంది’ అంటూ నెమలి వైపు దీనంగా చూసింది కోకిల.

కోకిల ఇంతలా చెబుతున్నా.. నెమలి మాత్రం ఏమీ తెలియదన్నట్లే ప్రవర్తించసాగింది. అప్పుడు చెట్టు కింద ఉన్న ఉడుతతో ‘నువ్వైనా చిట్టికి చెప్పు’ అని అడిగింది కోకిల. ‘చిన్నీ.. నువ్వు బాధ పడకు. చిట్టికి నేను చెబుతాను’ అంటూ నెమలిని కొంచెం దూరంగా తీసుకుని వెళ్లింది ఉడుత. ‘నా పేరు చిట్టి కాదంటే కోకిల అస్సలు నమ్మడం లేదే? నేను యజమాని నుంచి తప్పించుకుని వచ్చానంటే ఏమాత్రం వినిపించుకోదేం?’ ఉడుతతో అసహనంగా అంది నెమలి.

అప్పుడు ఉడుత.. ‘నువ్వు చిట్టివి కావని నాకు తెలుసు. అయితే, ఇంతకుముందు ఇక్కడ చిట్టి అనే నెమలి ఒకటి ఉండేది. అదంటే చిన్నికి ప్రాణం. ఆ రెండింటినీ చూసిన మేమంతా.. స్నేహితులంటే ఇలా ఉండాలనుకునేవాళ్లం. ఆ ఇద్దరికీ మా అందరి దిష్టి తగిలిందేమో? నాలుగు రోజుల క్రితం చిట్టికి ఏదో జబ్బు చేసి చనిపోయింది. అప్పటి నుంచి చిన్ని ఏమీ తినడం లేదు. మాతో కూడా సరిగా మాట్లాడటం లేదు. పోయిన చిట్టి ఎలాగూ తిరిగి రాదు. కానీ ఈ చిన్ని కూడా ఏమి తినకుండా దాని మీద బెంగతో మంచంపట్టేలా ఉంది. కోతి బావా, కాకి, నేనూ అంతా చిన్ని గురించే బాధపడుతున్నాం. మేం ఎన్ని చెప్పినా, అది మా మాటలు నమ్మడం లేదు. చిట్టి చనిపోలేదు. నా కోసం తిరిగి వస్తుందని చెబుతూ.. చెట్టు మీదే ఉండిపోసాగింది. ఇప్పుడు నువ్వు వచ్చావు. చిన్ని తిరిగి మామూలు మనిషి కావడం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎన్నో బాధలు అనుభవించి వచ్చావు. చిన్ని బాధను తీర్చలేవా?’ అని నెమలిని బతిమిలాడింది.

ఉడుత మాటలు నెమలిని ఆలోచించేలా చేశాయి. ‘‘మిత్రమా.. ప్రాణం విలువ నాకు తెలుసు. తోటి జీవి జీవితం నా చేతుల్లో ఉందని తెలిస్తే విడిచి వెళ్లిపోతానా? చిన్ని ‘గాయం’.. నా ‘స్నేహం’ ద్వారా తగ్గుతుందంటే అంతకంటే కావాల్సింది ఏముంది? స్నేహానికన్నా మిన్న లోకాన లేదని పెద్దలు అన్నారు. ఇప్పుడు నేనే చిట్టిని.. పద’ అని ఉడుతతో అంది నెమలి. వెంటనే జామ చెట్టు వద్దకు వెళ్లి ‘చిన్నీ.. నిన్ను నేను మరచిపోలేదు. నాకన్నీ గుర్తుకు వచ్చాయి’ అంది నెమలి సంతోషంగా. ‘హమ్మయ్యా.. నా చిట్టి నన్ను గుర్తు పట్టింది. నా కోసం తిరిగి వచ్చేసింది’ అంటూ సంబరపడిపోయింది కోకిల. ‘ఈ పండ్లు తింటేనే.. నేను నీతో ఉంటాను’ అంటూ చిన్నికి పండ్లు అందించింది నెమలి. ‘నువ్వొచ్చేశావు కదా.. ఇక ఎంచక్కా తింటాను’ అంటూ పండును కొరికింది కోకిల. ‘కబుర్లతోనే స్నేహితులిద్దరూ కాలక్షేపం చేయకండి. కోతి బావ ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమం ఉంది. చిన్ని పాట.. చిట్టి నాట్యం కోసం నాతో సహా అందరూ ఎదురు చూస్తున్నాం’ అని ఉడుత అనగానే.. ‘అలాగే.. వస్తున్నాం’ అంటూ నెమలితోపాటు బయలుదేరింది కోకిల.

- కె.వి.లక్ష్మణరావు


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని