Published : 07 Aug 2022 00:17 IST

సోమరితనమే పెద్ద జబ్బు!

పూర్వం రామాపురంలో రమణయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను మహా సోమరి. తిని నిద్రపోవటం తప్ప మరో పని ఎరగనివాడు. కష్టపడితే శరీరం చిక్కిపోతుందనే భావన కలవాడు. ఎవరెంత చెప్పినా సోమరితనం వీడలేదు. తండ్రి సంపాదించి ఇచ్చింది అంతో ఇంతో ఉండటం వల్ల, ఎలాగోలా కాలం గడిచిపోతోంది.

ఆ విధంగా కొంతకాలం జరిగింది. ఉన్నట్లుండి రమణయ్యకు ఆరోగ్యం చెడింది. ఎన్ని మందులు వాడినా ఆ రోగం తగ్గుముఖం పట్టలేదు. పక్క గ్రామంలో ఉన్న నాటు వైద్యుడి దగ్గరికి పోతే, ఆయన రమణయ్యను పరీక్షించి, ఒంట్లో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోయింది. వెంటనే పెరగాలంటే గాడిద మాంసం తినాలి అని సలహా ఇచ్చాడు.

రమణయ్య గ్రామం చేరి, వాకబు చేస్తే, ఆ ఊరికంతా మంగయ్య అనే వ్యక్తి వద్ద రెండు గాడిదలు, వాటి పిల్లలు మరో రెండూ ఉన్నాయి. ఆయన ఇంటికెళ్లి రమణయ్య ఒక గాడిదను అమ్మమన్నాడు.

‘దేనికి?..’ అని మంగయ్య అడిగాడు. రమణయ్య తన అనారోగ్యం గురించి, నాటువైద్యుడు చెప్పిన వైద్యం గురించి చెప్పాడు. ‘మీరెంత ఖరీదు ఇచ్చినా సరే నేను ఇవ్వను గాక ఇవ్వను. అవి నా బతుకు తెరువుకు నిరంతరం ఉపయోగపడేవి. వాటికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ధనానికి ఆశపడి, వాటి ప్రాణం తీయడానికి ఒప్పుకోను’ అన్నాడు మంగయ్య.

అయినా రమణయ్య ఒక పట్టాన మంగయ్యను వదలలేదు. మంగయ్య కూడా మెట్టు దిగలేదు. రమణయ్య సరాసరి గ్రామాధికారి వద్దకు వెళ్లి, మంగయ్య మీద ఫిర్యాదు చేశాడు. తన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి మంగయ్య సహకరించడం లేదని ఆ ఫిర్యాదు సారాంశం. మంగయ్య, గ్రామాధికారితో తన జీవనానికి ఉపయోగపడే పెంపుడు జంతువును చంపడం తనకే మాత్రం ఇష్టం లేదని, జంకూబొంకూ లేకుండా చెప్పాడు.

గ్రామాధికారికి మంగయ్య జీవకారుణ్యం నచ్చింది. ఆయన రమణయ్యతో... ‘ఏదో జంతువు మాంసం తింటే బలం వస్తుందనేది వట్టి భ్రమ. అసలు మాంసాహారమే ముట్టని వారూ ఎంతో మంది ఆరోగ్యవంతులుగా ఉన్నారు. నిండు నూరేళ్లూ జీవిస్తూ ఉన్నారు. ఫలానా జంతువు మాంసం తింటే మంచిది, ఫలానా పక్షి మాంసం తింటే శక్తి వస్తుందనేది సరైంది కాదు. కష్టపడి పనిచేసి, కడుపు నిండా తిని, కంటినిండా నిద్రిస్తే దానంతటదే ఆరోగ్యం వస్తుంది. అలాకాక దినమంతా ఏ పని చేయక విశ్రాంతిగా ఉంటే అనారోగ్యం రాక ఏమొస్తుంది? భగవంతుడు మనకు కాళ్లూ చేతులూ ఇచ్చింది ఎందుకు? కష్టించి పని చేసి సంపద పెంచుకునేందుకే, విశ్రాంతి తీసుకునేందుకు కాదు. ఈ మధ్య గాడిద పాలకు గిరాకీ వచ్చింది. అది కూడా పెద్ద వ్యాపారం అయింది. ఇలా అయితే వాటి బిడ్డలూ తృప్తిగా పాలు తాగలేవు. అయినా మీకొక విషయం చెబుతాను. ఏమీ అనుకోకండి. గాడిద పాలు, మాంసానికి ఆ శక్తి ఎలా వచ్చింది? ఆలోచించారా? గాడిద నుంచే కదా! మరి గాడిదకు ఆ శక్తి ఎలా వచ్చింది? కష్టించడం వల్లే కదా!. దాని మాంసమో, పాలో తాగి రోగనిరోధక శక్తి పొందాలనుకునే బదులు మనం సోమరులుగా ఉండక కష్టించి పనిచేస్తూ పోషకాహారం తింటూ ఉంటే దానంతటదే రోగనిరోధకశక్తి వస్తుంది. జంతువులను హింసించాల్సిన అవసరం ఉండదు కదా! మా తాత గతంలో వైద్యం చేసేవాడు. అందువల్ల అనుభవం మీద ఈ నాలుగు ముక్కలు చెప్పాను. పాటించడానికి ప్రయత్నించండి’ అని గ్రామాధికారి రమణయ్యకు నచ్చచెప్పి పంపేశాడు. బాగా ఆలోచించి చూస్తే గ్రామాధికారి మాటల్లో వాస్తవం ఎంతో ఉందనిపించింది రమణయ్యకు. తన తోటి వయసు వారు చాలామంది ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. వారంతా కష్టజీవులే. తనే సోమరితనంతో ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. ఇక మీదట చేతనైనంత కష్టం చేయాలి. ఖాళీగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. దాన్ని తూ.చ. తప్పక పాటించాడు. దాని వల్ల ఆకలి పెరిగింది. కంటినిండా నిద్రా లభించింది. శరీర దారుఢ్యం ఏర్పడి ఆరోగ్యమూ బాగుపడింది.

- గంగిశెట్టి శివకుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts