Published : 08 Aug 2022 00:19 IST

మహమ్మారి తెచ్చిన మార్పు!

అవంతీపురాన్ని పాలిస్తున్న రాజు మధురసేనుడు. ఆయన పాలనలో రాజ్యంలోని ప్రజలు హాయిగా జీవించసాగారు. అయితే రాజు తన రాజ్యంలోని తిమ్మాపురం ప్రజల ప్రవర్తనతో బాగా విసుగెత్తిపోయాడు! ఎన్నోసార్లు వారిని మార్చాలని ప్రయత్నం చేసి ప్రతిసారీ విఫలమవుతూనే ఉన్నాడు! కారణం వారిలో వారు పరస్పరం గొడవలు పడుతూ ఉంటారు. పైగా ఎవరైనా గ్రామంలోకి కొత్తగా వస్తే వారితోనూ, రాజ ఉద్యోగులతోనూ ప్రతి చిన్న విషయానికి ఘర్షణ పడుతూ ఉంటారు. అందుకే ఆ గ్రామంలో ప్రభుత్వోద్యోగులు ఎవరూ కూడా సేవలు అందించడానికి ముందుకు వచ్చేవారు కాదు. విషయం తెలుసుకున్న రాజు ఆ ప్రాంత ప్రజలు కూడా మన రాజ్యంలోని భాగమే, వారికి కూడా మన సేవలు అందించాలి అనేవాడు.

ఏరోజూ కూడా ఆ గ్రామంలోని పాఠశాలకు విద్యార్థులు వెళ్లేవారు కాదు. గురువు ఆ గ్రామంలోని పెద్దలను కలిసి ‘పిల్లలు బడికి రావట్లేదు, వారిని పంపించండి’ అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకునేవారు కాదు. మహామంత్రి ఎన్నో సార్లు... ‘రాజా! మీరు ఎందుకు తిమ్మాపురం గ్రామ ప్రజల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోరు? వారిని దండించి మీ దారికి తీసుకురావచ్చు కదా!’ అనేవాడు. ఆ మాటలు విని సమాధానం చెప్పక, నవ్వుకునే వాడు రాజు. కొంత కాలం గడిచింది.

ఒకసారి అవంతీపురం రాజ్యంలో అంటువ్యాధి ప్రబలడంతో చాలామంది ఆ వ్యాధి బారిన పడి మరణించసాగారు. రాజ వైద్యులు వైద్య సేవలు అందించడంతో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వచ్చాయి. కానీ తిమ్మాపురంలో మాత్రం ఇంకా అలానే ఉంది. కారణం అక్కడి ప్రజల ప్రవర్తనే! అక్కడి వారికి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన లేకపోవడం, శుభ్రత పాటించకపోవడం.. ఎన్నోసార్లు వారికి అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినా ఎవరు అటువైపు వచ్చేవారే కాదు. అసలు వినేవారే కాదు. అందువల్ల అక్కడ మహమ్మారి అదుపులోకి రాకుండా ఉంది. విషయం తెలుసుకున్న రాజు, వెంటనే... ‘అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి వైద్య సేవలు అందించండి’ అని మంత్రిని ఆదేశించారు.

అయితే వైద్య సిబ్బంది వచ్చి.. ‘మహారాజా... మేం ఎన్నోసార్లు మీ మాటకు విలువ ఇచ్చి ఆ ప్రాంతానికి వెళ్లి, వైద్య సేవలు అందించడానికి చూశాం. కానీ ఈసారి మేము అక్కడికి వెళ్లేదే లేదు’ అని నిరాకరించారు. మర్నాడు ఉదయాన్నే మహారాజు మంత్రితో... ‘ఈ రోజు మనం ఆ తిమ్మాపురం గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ సేవా శిబిరం ఏర్పాటు చేద్దాం’ అన్నాడు.

‘మహారాజా మీరు?!’ అన్నాడు మంత్రి. ‘ఏమవుతుంది. అక్కడకు వెళ్లి ముందు వారికి నైతిక బలాన్ని చేకూర్చాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయండి’ అని ఆదేశించాడు. మహారాజు అక్కడికి వెళ్లగానే ఆ గ్రామంలోని ప్రజలందరూ ఒక్కసారిగా రాజును చూడగానే బోరున విలపించారు. ‘మహారాజా.. ఊర్లో చాలామంది అంటువ్యాధిన పడి మరణిస్తున్నారు. దాన్నుంచి మీరు మమ్మల్ని కాపాడాలి’ అని దీనంగా వేడుకున్నారు.

‘చూడండి.. మన రాజ్యంలో ఈ వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చింది. కానీ ఈ గ్రామంలో రాకపోవడానికి కారణం మీ ప్రవర్తనే!’ అన్నాడు మహారాజు.

‘వైద్యులు ఎవరూ రాలేదు. వారిని రప్పించండి మహారాజా! వారి ద్వారా సేవలందించండి. ఈ మరణాలను ఆపించండి’ అని వేడుకున్నారు. ‘నేను వారిని రమ్మని ఆజ్ఞాపించా. కానీ మీ ప్రవర్తనకు విసిగి వారు రామని భీష్మించుకుని కూర్చున్నారు’ అన్నాడు రాజు.

‘అదేంటి మహారాజా! మీ అధికారాన్ని ఉపయోగించి వారిని రమ్మని ఆజ్ఞాపించవచ్చు కదా?! రాకపోతే మీరు వారిని శిక్షించొచ్చు కదా?’ అన్నారు. దానికి మహారాజు ఒక నవ్వు నవ్వి ‘అలా ప్రజలను శిక్షించే పద్ధతి నాది కాదు. అలా చేసే వాడిని అయితే మీరు ఇంతకుముందు చాలాసార్లు మాట విననప్పుడు మిమ్మల్నే శిక్షించేవాడిని. ఎవరైనా వారి తప్పును వారే తెలుసుకోవాలనేది నా విధానం’ అన్నాడు.

‘మనం గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు అనుభవిస్తున్నాం’ అని వారంతా బాధపడ్డారు. మహారాజు గారే స్వయంగా తిమ్మాపురంలో సేవా శిబిరం ఏర్పాటు చేశారని తెలిసిన వైద్య సిబ్బంది.. అందరూ కలిసి అక్కడికి వచ్చి ఆ గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించసాగారు. సేవా శిబిరం కాస్తా వైద్య శిబిరంగా మారింది. రెండు రోజుల్లోనే వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఊరి జనం అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి తిమ్మాపురం గ్రామ ప్రజలు తమ ప్రవర్తనను మార్చుకున్నారు. మహారాజు కూడా ఎంతో సంతోషించారు.

- ఏడుకొండలు కళ్లేపల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని